దేశరాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీనికితోడు తాజాగా విద్యుత్ సంక్షోభం కూడా తలెత్తింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఏర్పడిన నీటి ఎద్దడి ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. దీనిని అనువుగా మలచుకొన్న కొందరు నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు.
ఢిల్లీలోని మునక్ కెనాల్‌లో వాటర్ ట్యాంకర్ చోరీకి గురైన ఉదంతం సంచలంగా మారింది. నీటి చౌర్యాన్ని అరికట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ఈ నీటి చౌర్యంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆప్‌తో నీటి మాఫియా కుమ్మక్కైందని బీజేపీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా కార్యాలయ అధికారులు కూడా వాటర్ మాఫియా పేరుతో ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు హర్యానా కూడా సుప్రీం కోర్టు ఆదేశించిన రీతిలో ఢిల్లీకి నీటిని విడుదల చేయడం లేదని ఎల్‌జీకి ఆప్ లేఖ రాసింది. తాజాగా ఢిల్లీ-హర్యానా మునాక్ కెనాల్ నుండి ట్యాంకర్లలో అక్రమంగా నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కాలువ నుంచి ఢిల్లీకి మాత్రమే నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ఆ నీరు వేరేవైపు మరలిపోతోంది. ఎల్‌జీకి ఆప్ రాసిన లేఖలో రాజధానిలో నీటి ట్యాంకర్ల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని మంత్రి అతిషీ ప్రస్తావించారు.
2023 జనవరిలో ఢిల్లీ జల్ బోర్డు 1179 ట్యాంకర్లను అందుబాటులో ఉంచింది. 2023 జూన్ నాటికి ఈ ట్యాంకర్ల సంఖ్య 1203. అయితే 2024 జనవరిలో వాటి సంఖ్య 888కి తగ్గిందని దీని వెనుకగల కారణాన్ని తెలుసుకోవాల్సి ఉన్నదని అతిషీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ ముఖ్య కార్యదర్శి, సీఈఓలు తన సూచనలను పాటించకుండా ట్యాంకర్ల సంఖ్యను తగ్గించారని ఆమె పేర్కొన్నారు. వారు ట్యాంకర్ మాఫియాతో కుమ్మక్కయ్యారని అతిషీ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను ఆమె కోరారు. ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని ఢిల్లీ జల్ బోర్డుకు పలుమార్లు లేఖలు రాసినా అధికారులు పట్టించుకోలేదని అతిషి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment