దేశరాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటి బెంబేలెత్తిస్తున్నాయి. దీనికితోడు ఒక వైపు నీటి ఎద్దడి, మరోవైపు కొత్తగా తలెత్తిన విద్యుత్ సంక్షోభం ఢిల్లీవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఢిల్లీలోని మండోలా, లోని ప్రాంతాల్లోని పవర్ గ్రిడ్ స్టేషన్లలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఫలితంగా ఉత్తర ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం 2:11 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఢిల్లీలోని వజీరాబాద్, కాశ్మీరీ గేట్, గీతా కాలనీ, హర్ష్ విహార్, ప్రీత్ విహార్, ఐపీ పవర్, రాజ్‌ఘాట్, నరేలా, గోపాల్‌పూర్ ప్రాంతాల్లోని సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ అంతరాయాల కారణంగా పలు నీటి శుద్ధి ప్లాంట్లు పనిచేయడం లేదు. ఇది తాగునీటి సమస్యకు తీవ్రతరం చేసింది. ఈ నేపధ్యంలో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ఇంధన శాఖ మంత్రితో ఢిల్లీ మంత్రి అతిషి భేటీ కానున్నారు. ఈ విషయాన్ని అతిషీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఖాతాలో తెలిపారు.
నీటి ఎద్దడి సమస్యను కూడా అతిషీ దానిలో ప్రస్తావించారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని, దీని కారణంగా నీటి వినియోగం పెరిగిందని, హర్యానా నుంచి రావాల్సిన నీరు అంతకంతకూ తగ్గుతోందని, హర్యానాలోని వజీరాబాద్ బ్యారేజీ, మునక్ కెనాల్ నుంచి నీరు రావడం లేదని ఆమె పేర్కొన్నారు. దీనికితోడు ఢిల్లీలోని డబ్ల్యూటీపీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని కూడా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment