tankers
-
ఢిల్లీలో నీటి చౌర్యం.. ఎల్జీకి మంత్రి ఫిర్యాదు
దేశరాజధాని ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీనికితోడు తాజాగా విద్యుత్ సంక్షోభం కూడా తలెత్తింది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఏర్పడిన నీటి ఎద్దడి ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారింది. దీనిని అనువుగా మలచుకొన్న కొందరు నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు.ఢిల్లీలోని మునక్ కెనాల్లో వాటర్ ట్యాంకర్ చోరీకి గురైన ఉదంతం సంచలంగా మారింది. నీటి చౌర్యాన్ని అరికట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ఈ నీటి చౌర్యంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆప్‌తో నీటి మాఫియా కుమ్మక్కైందని బీజేపీ తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా కార్యాలయ అధికారులు కూడా వాటర్ మాఫియా పేరుతో ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు హర్యానా కూడా సుప్రీం కోర్టు ఆదేశించిన రీతిలో ఢిల్లీకి నీటిని విడుదల చేయడం లేదని ఎల్జీకి ఆప్ లేఖ రాసింది. తాజాగా ఢిల్లీ-హర్యానా మునాక్ కెనాల్ నుండి ట్యాంకర్లలో అక్రమంగా నీటిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కాలువ నుంచి ఢిల్లీకి మాత్రమే నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ఆ నీరు వేరేవైపు మరలిపోతోంది. ఎల్జీకి ఆప్ రాసిన లేఖలో రాజధానిలో నీటి ట్యాంకర్ల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని మంత్రి అతిషీ ప్రస్తావించారు.2023 జనవరిలో ఢిల్లీ జల్ బోర్డు 1179 ట్యాంకర్లను అందుబాటులో ఉంచింది. 2023 జూన్ నాటికి ఈ ట్యాంకర్ల సంఖ్య 1203. అయితే 2024 జనవరిలో వాటి సంఖ్య 888కి తగ్గిందని దీని వెనుకగల కారణాన్ని తెలుసుకోవాల్సి ఉన్నదని అతిషీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ ముఖ్య కార్యదర్శి, సీఈఓలు తన సూచనలను పాటించకుండా ట్యాంకర్ల సంఖ్యను తగ్గించారని ఆమె పేర్కొన్నారు. వారు ట్యాంకర్ మాఫియాతో కుమ్మక్కయ్యారని అతిషీ ఆరోపించారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆమె లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను ఆమె కోరారు. ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని ఢిల్లీ జల్ బోర్డుకు పలుమార్లు లేఖలు రాసినా అధికారులు పట్టించుకోలేదని అతిషి పేర్కొన్నారు. -
నీటి సంక్షోభం: ఢిల్లీ ట్యాంకర్ మాఫియాపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: రాష్ట్రంలో నీటి సంక్షోభం నెలకొన్న సమయంలో ట్యాంకర్ మాఫీయాను అరికట్టకపోవటంపై సుప్రీకోర్టు ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో నీటి వృధాపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని సీరియస్ అయింది. ట్యాంకర్ మాఫియా, నీటి వృధాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, జాగ్రత్తల రిపోర్టును తమకు అందజేయాలని వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు జిస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలే ఆదేశించారు. ట్యాంకర్ మాఫియాను అరికట్టడం ప్రభుత్నానికి చేతకాకపోతే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తామని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.‘‘ కోర్టు ముందు నకిలీ స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు?. హిమాచల్ ప్రదేశ్ నుంచి వాటర్ వస్తోంది. ఢిల్లీకి వచ్చిన నీరు ఎక్కడికి వెళ్లుతోంది?. ట్యాంకర్ మాఫియా విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాజేయాలి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. చర్యలకు సంబంధిచి పూర్తి నివేదిక గురువారం అందజేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.హిమాచల్ ప్రదేశ్.. హర్యానాకు ఇస్తున్న మిగులు నీటిని ఇలాంటి సంక్షోభ సమయంలో తమకు తరలించాలని ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రియించింది. దీంతో ఢిల్లీకి నీటిని అందించాలని సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్‌కు ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ నీటిని అందించిన హర్యానా తమ వాటాను తగ్గిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. -
ఆక్సిజన్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగుల కు అవసరమైన ఆక్సిజన్ కొరత లేకుండా చేసే దిశగా ప్రభుత్వ యత్నాలు ఫలించాయి. ఒడిశా నుంచి రాష్ట్రానికి తొలిదఫా 6 ట్యాంకర్లలో 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ చేరుకుంది. ట్యాంకర్లు రోడ్డు మార్గాన ఒడిశాలోని అం గూల్ ప్లాంట్‌కు వెళ్లి, తిరిగి వచ్చేందుకు వారం రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వేగంగా ఆక్సిజన్ రప్పించేందుకు ఖాళీ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఒడిశాకు తరలించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ నింపుకొని రాష్ట్రానికి చేరుకున్న ట్యాం కర్లను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పంపించినట్టు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం, ఆక్సిజన్ కొరత మొదలయ్యే పరిస్థితిలో వెంటనే ఎయిర్‌ఫోర్స్ సహాయంతో ఆక్సిజన్ తెప్పించాలని సీఎం నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాష్ట్ర అధికారులు.. ఎయిర్‌ఫోర్స్ అధికారులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 విమానాల్లో తొమ్మిది ఖాళీ ట్యాంకర్లను ఈ నెల 23న హైదరాబాద్ నుంచి ఒడిశాలోని అంగూల్ ప్లాంట్‌కు పంపారు. ఈ ట్యాంకర్లు అక్కడ ఆక్సిజన్ నింపుకొని రోడ్డు మార్గంలో రాష్ట్రానికి బయలుదేరాయి. సోమవారం రాష్ట్రానికి చేరుకున్నాయి. మొదట్లో రూర్కెలా, అంగూల్ రెండు ప్లాంట్ల నుంచీ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని భావించినా.. రూర్కెలా ప్లాంట్ అక్కడి విమానాశ్రయానికి మరీ దూరంగా ఉండడంతో.. ప్రస్తుతానికి అంగూల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 350 టన్నుల మేర ఆక్సిజన్ అవసరమని చెప్పారు. వంద టన్నుల మేర ఇక్కడ ఉత్పత్తి అవుతోందని, మరో 300 టన్నుల మేర దిగుమతి చేసుకోవాల్సి ఉందని వివరించారు. కేంద్రం ఒడిశా నుంచి రాష్ట్రానికి 250 టన్నుల ఆక్సిజన్ కేటాయించిందని, ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఆస్పత్రులకు ఆక్సిజన్.. రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్‌ను అవసరమైన ఆస్పత్రులకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్యాంకర్లలో ఒకదానితో గచ్చిబౌలిలోని టిమ్స్, ఛాతీ వైద్యశాల, కింగ్ కోఠి ఆస్పత్రులకు ఆక్సిజన్ అందించారు. ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా పరిస్థితి చేయి దాటుతుండడంతో.. అక్కడి రోగులను, కరోనా బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఆస్పత్రుల్లో పరిస్థితి చక్కబడనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడకుండా.. అవసరాల మేరకు సరఫరా చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. నేడు మరో ఎనిమిది ట్యాంకర్లు అంగూల్‌కు.. మంగళవారం మరో ఎనిమిది ఖాళీ ట్యాంకర్లను విమానాల ద్వారా ఒడిశాలోని అంగూల్ ప్లాంట్‌కు తరలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ట్యాంకర్లు ఆక్సిజన్ నింపుకొని ఈ నెల 30వ తేదీ నాటికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటాయని వెల్లడించాయి. వాటిలో సుమారు 120 టన్నుల ఆక్సిజన్ వస్తుందని వివరించాయి. కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతోందని, ఈ మేరకు కొరత తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నాయి. ‘ఆక్సిజన్’ రథసారథులు ఆర్టీసీ డ్రైవర్లే ఒడిశాలోని అంగూల్‌లో ఆక్సిజన్ నింపుకొన్న ట్యాంకర్లను వందల కిలోమీటర్ల దూరం నడిపి భద్రంగా రాష్ట్రానికి తీసుకొచ్చింది ఆర్టీసీ డ్రైవర్లే. ఈ నెల 23న ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపిన విషయం తెలిసిందే. మండే స్వభావమున్న ఆక్సిజన్‌ను అంత దూరం నుంచి తరలించడం కత్తిమీద సాము వంటిది. ట్యాంకర్లను నిర్దేశిత వేగంతో జాగ్రత్తగా నడపాలి. ఇందుకోసం డ్రైవింగ్‌లో మంచి నైపుణ్యం ఉన్న సీనియర్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ 20 మంది డ్రైవర్లను ఎంపిక చేసింది. అందులో 10 మంది డ్రైవర్లు ఖాళీ ట్యాంకర్లతో విమానంలో ఒడిశాకు వెళ్లారు. విమానాశ్రయం నుంచి అంగూల్ ప్లాంట్‌కు ట్యాంకర్లతో వెళ్లి.. ఆక్సిజన్ నింపుకొని రాష్ట్రానికి తీసుకువచ్చారు. మంగళవారం ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఖాళీ ట్యాంకర్లతో మరికొందరు ఆర్టీసీ డ్రైవర్లు ఒడిశాకు వెళ్తున్నారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
– జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ కర్నూలు(అర్బన్): జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడిని నివారించేందుకు వీలుగా ఇప్పటికే 43 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. బుధవారం విజయవాడలోని ప్రభుత్వ సీఎస్ కార్యాలయం నుంచి పీఆర్, ఆర్డీ మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాగునీరు, ఇతర ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 36 కరువు మండలాలున్నాయని, ఇప్పటికే ఉపాధి హామీ ద్వారా 1.93 లక్షల మంది ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తున్నామని చెప్పారు. ఉపాధి కూలీల బకాయిలు బ్యాంకుల్లో జమయ్యాయని, ప్రతి వారం బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తు బకాయిలు పెండింగ్ లేకుండా చూస్తున్నామని సమాధానమిచ్చారు. కాగా తాగునీటి పైప్లైన్లు, స్కీముల మరమ్మతులకు నాన్ సీఆర్ఎఫ్ కింద రూ.5.88 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, ఇంకా నిధులు విడుదల కావాల్సి ఉందని చెప్పారు. ఆదోని డివిజన్లో నీటి ఎద్దడి అధికంగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటూ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జే హరిబాబు, డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డి, డీపీఓ పార్వతీ పాల్గొన్నారు. -
ఇదేం బుద్ధి సారూ?
► బూచేపల్లి ట్యాంక్‌లకు నీరివ్వరా? ► గొంతెండుతుంటే మంత్రి ఆదేశాలంటారా? ► కాంట్రాక్టర్లు, అధికారుల తీరును తప్పుపట్టిన స్థానికులు దర్శి: అధికారం చేతిలో ఉంది కదా అని నీచబుద్ధిని ప్రదర్శిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. తాగునీటిని అందించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్యాంకులకు ఎన్ఏపీ నీరు ఇవ్వకుండా నీచబుద్ధిని ప్రదర్శిస్తున్నారు. అడిగితే మంత్రి ఆదేశాలు అంటూ గ్రామస్తులకు నీరివ్వకుండా చుక్కలు చూపిస్తున్నారు. మండలంలోని సాయినగర్, శివరాజ్‌నగర్ గ్రామాల్లో ప్రజల దాహర్తిని తీర్చేందుకు బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకులకు దర్శి ఎన్ఎస్పీ కార్యాలయంలో నీరు ఇవ్వమని అధికారులు, కాంట్రాక్టర్లు తెగేసి చెప్పారు. పేదలకు ఉచితంగా సరఫరా చేస్తుంటే నీరెందుకు ఇవ్వరని కాంట్రాక్టర్ పౌలును ప్రశ్నించగా మంత్రి గారిని అడగండి మంత్రి గారి చెప్తేనే నీరిస్తామన్నారు. దీంతో మంగళవారం సాయినగర్ గ్రామస్తులకు తాగునీరు లేక గొంతెండినట్లయింది. అధికారంలో ఉన్న వారు తాగునీరు అందించక ఇస్తున్న వారిని ఇవ్వనివ్వకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో సాయినగర్, శివరాజ్‌నగర్ గ్రామస్తులకు తాగునీరు లేక ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన సంఘటనలు ఉన్నాయి. బూచేపల్లి చొరవతో.. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నీరివ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి కలుగజేసుకుని తామే స్వయంగా మేడే రోజు సాయినగర్‌లో ట్యాంకును ప్రారంభించారు. అయితే మంగళవారం ఎన్ఎపీ కార్యాలయం వద్దకు ట్యాంకును తీసుకుని ఆ గ్రామ ఎంపీటీసీ భర్త కరిపిరెడ్డి సుబ్బారెడ్డి, డ్రైవర్ రెడ్డిచర్ల ఆంజనేయులు వెళ్లగా మంత్రి శిద్దా ఆదేశాలంటూ నీరిమ్మని కాంట్రాక్టర్ వరగాని పౌల్ తెగేసి చెప్పారు. ఓ వైపు గ్రామస్తుల గొంతెండుతుంటే మరో వైపు మంత్రి ఆదేశాలు అంటూ కుటిల రాజకీయాలు చేయడం ఏంటని స్థానికులు కాంట్రాక్టర్ తీరును తప్పుపడుతున్నారు. మరుసటి రోజు కూడా ట్యాంకర్‌కు తాగునీరు సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తాగునీటికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
ప్రత్యామ్నాయమే శరణ్యం
- నీటి సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం కేఈ - గ్రామాల వారీగా ప్రతిపాదనలు పంపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశం - తక్షణ పరిష్కారం కింద ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్): ‘జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఆర్డబ్ల్యూఎస్ ఆధికారులు అన్ని పంచాయతీలు, నివాసిత ప్రాంతాల్లో అధ్యయనం చేసి పక్కా ప్రణాళికలతో ప్రతిపాదనలు పంపితే తక్షణ చర్యలు తీసుకుంటాం.. అప్పటి వరకు సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయండి’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో నీటి సమస్య, పరిష్కారంపై ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా నీటి సమస్య తీవ్రత, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం కేఈ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుంకేసుల ద్యామ్లో నీరు అడుగంటిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులను అన్వేషించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమున్న గ్రామాల్లో నీటి వనరులు గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తే జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేస్తారని కేఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు స్పష్టం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలకు జాప్యం లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశానికి నీటిపారుదల శాఖ సీఈ గైర్హాజరుకావడంపై కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది బకాయిలు చెల్లించాలి... నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో గత ఏడాది ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రూ.1.32 కోట్ల బిల్లులను చెల్లిస్తే ఈ ఏడాది నీటి సరఫరాకు కంట్రాక్టర్లు ముందుకు వస్తారని పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. నంద్యాల మండలం కొత్తపల్లిలో సర్పంచ్ ప్రభుత్వ బోరు పైప్‌లైన్‌ను కట్ చేసి నీటి సరఫరాకు ఆటంకాలు కల్గిస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిద్ర పోతున్నారా అంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై విరుచుకు పడ్డారు. సోమవారం సాయంత్రానికి పైప్‌లైన్‌ను పునరుద్ధరించాలని, సర్వంచ్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 8 గ్రామాలకు నీరు అందించే శ్రీరంగాపురం సీపీడబ్ల్యూ స్కీమ్‌ను పునరుద్ధరించాలని మంత్రి జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఫైళ్లు తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు.. నీటి సమస్య పరిష్కారానికి సంబంధించిన ఫైళ్లను మీ దగ్గరకు తెచ్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు భయపడుతున్నారని డోన్ నియోజక టీడీపీ ఇన్చార్జీ కేఈ ప్రతాప్ పేర్కొనగా తప్పు చేసిన వారికే భయం ఉంటుందని, మిగతావారు ధైర్యంగా వస్తారని కలెక్టర్ బదులిచ్చారు. ప్రస్తుతం ఆన్లైన్ ఫైళ్లు కావడంతో ఆ సమస్య కూడా లేదన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సుంకేసుల డ్యామ్‌లో తుంగభద్ర నీటిని నిల్వ చేసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. అన్ని గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు. వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయండి నీటి సమస్య సమీక్షలో భాగంగా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉన్న గ్రామాలకు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అయితే ఇందుకు వర్క్ ఆర్డర్ ఉండి తీరాలని తెలిపారు. సమస్య పరిష్కారానికి గ్రామ సభలతోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంది, బుడ్డారాజశేఖర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోలు దొంగల అరెస్ట్
రాజంపేట రూరల్: గూడ్స్ వ్యాగిన్లు, ట్యాంకర్ల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దొంగలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ను దొంగలించే కనకయ్య, ఓబులమ్మను డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల ఎదుట సోమవారం హాజరు పరిచారు. డీఎస్పీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన కనకయ్యశెట్టి, అంగడివీధికి చెందిన పెద్దఓబులమ్మ గతంలో కడప రైల్వేస్టేషన్ దగ్గర ఆగే గూడ్స్ వ్యాగిన్ల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దొంగలించి లారీలు, ఆటోలకు అమ్ముకుంటుండే వారు. ఇటీవల కాలంలో కడప రైల్వేస్టేషన్ దగ్గర నుంచి ఐఓసీ, హెచ్‌పీసీఎల్ కంపెనీలను ఎత్తివేసి భాకరాపేట వద్ద హెచ్‌పీసీఎల్ కంపెనీని స్థాపించి, అక్కడి నుంచే పెట్రోలు, డీజిల్‌ను ట్యాంకర్ల ద్వారా పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ను దొంగలించడానికి అలవాటు పడ్డ కనకయ్యశెట్టి, పెద్దఓబులమ్మ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లకు డబ్బును ఎరగా చూపి.. హెచ్‌పీసీఎల్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ట్యాంకర్ల నుంచి అక్రమంగా తీసుకునే వారు. లారీలకు, ఆటోలకు పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఒకటి, రెండు రూపాయలకు తగ్గించి అమ్ముకునే వారు. కొందరు అందించిన సమాచారం మేరకు ఈ విషయంపై కూపీ లాగగా అక్రమ దందా వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ చోరీలో కనకయ్యశెట్టి రెండవ భార్య వెంకటసుబ్బమ్మ అలియాస్ బుజ్జమ్మ సహకారం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు సహకరించిన గుంతకల్లుకు చెందిన ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్లు అయిన చంద్రశేఖర్, రఫిక్, ఆరీఫ్, ఎస్ఏ.ఖాదర్, ఖాదర్‌వలీ, మహమ్మద్, జిలానీ, అస్లాంబాషా, షఫి, అబ్దుల్‌రహిమాన్, వీరేష్, శివను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో ఒంటిమిట్ట సీఐ రవికుమార్, సిద్దవటం ఎస్ఐ అరుణ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారని వివరించారు. -
యథేచ్ఛగా నీటి దందా
- జేబులు నింపుకుంటున్న వ్యాపారులు - రోజురోజుకు పెరిగిపోతున్న నీటి వ్యాపారం - ఏటా తగ్గిపోతున్న భూగర్భజలాలు - కాలనీల్లో నీటి కొరత - ఇబ్బంది పడుతున్న జనం - పట్టించుకోని అధికారులు పటాన్చెరు: పట్టణంలో ట్యాంకర్లతో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పటాన్చెరు శాంతినగర్‌లో బోర్లలో నీరు తగ్గుతోంది. శాంతినగర్ పక్కన దాదాపు వందెకరాల శిఖంతో ఉన్న సాకి చెరువులో నీరు తగ్గింది. వర్షాలు లేక పోవడంతో చెరువులో ఉండాల్సిన నీరు లేదు. అలాగే పటాన్చెరు పట్టణంలో భూగర్భ జలాల లభ్యత ఉన్న కారణంగా ఈ ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు బోరు నీటిని తోడి అమ్ముకునే వ్యాపార సంస్థలు ఎక్కువయ్యాయి. పటాన్చెరు పట్టణంలోని పెట్రోలు బంక్‌లో బోరు వేసి నీటిని రాత్రింబవళ్లు తోడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శాంతినగర్‌లో ప్రైవేటు వ్యక్తులు ఆర్వో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ వాటర్ ప్లాంట్ల కారణంగా సమస్యలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అక్రమ పద్ధతుల్లో నీటిని తోడుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్‌ను వివరణ కోరగా ఆయన నీటి వ్యాపార కేంద్రాలను వెంటనే గుర్తించి వాటిని తొలగిస్తామన్నారు. తమ దృష్టికి అలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదన్నారు. స్థానికులు తాజాగా ఫిర్యాదు చేశారని దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాల్టా చట్టం అమలు చేయరా? పటాన్చెరు పట్టణంలో వాల్టా చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రోజురోజుకూ నీటి వ్యాపారం పెరుగుతోంది. 24 గంటలూ బోర్లు నడుపుతుండడంతో భూగర్భజలాలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - జగన్‌రెడ్డి, శాంతినగర్ పటాన్చెరు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు. నీటి వ్యాపార కేంద్రాల నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నీటి వ్యాపార నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరితే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. - చిదంబరం, శాంతినగర్ -
ఖాళీ బిందెలతో మహిళల బైఠాయింపు
అట్లూరు: మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయానికి తాళాలు వేశారు. అట్లూరు గ్రామానికి చెందిన సుమారు వందమంది మహిళలు గురువారం ఖాళీ బిందెలతో ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. నీటి కోసం అల్లాడుతున్నాం. ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసి, ఆదుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ ఎంపీడీ వో మధుసూదన్‌రెడ్డి చాంబర్లోకి వెళ్లి నిల దీశారు. ఆయనను బయటికి పంపించి, కా ర్యాలయానికి తాళాలు వేశారు. అనంతర ం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు ఈశ్వరయ్యను కూడా తాగు నీ టి సమస్యపై నిలదీశారు. అనంతరం తహశీల్దారు కార్యాలం ఎదుట బైఠాయించారు. అక్కడకు చేరుకున్న ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి సర్దుభాటు చేసే యత్నం చేశారు. మేము తాగునీటి కోసం అల్లాడుతున్నాం. మా గ్రామంలోకి ఏరోజైనా వచ్చి సమస్య పరిశీలించారా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మండ ల ప్రత్యేకాధికారి రమగోపాల్‌రెడ్డి, ఆర్డ బ్ల్యూఎస్ ఏఈ రవితేజా, పీఆర్ ఏఈ శ్రీనువాసులు అక్కడకు చేరుకుని సమస్య పరి ష్కరిస్తామంటూ నచ్చచెప్పి గ్రామంలోకి తీసుకెళ్లారు. మహిళలు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటసుబ్బయ్య, బద్వేలు ఏరియా కార్యదర్శి వీరశేఖర్, జిల్లా సభ్యు లు జకరయ్య, మండల కార్యధర్శి నిత్యపూజయ్య అక్కడకు చేరుకుని మహిళలకు మద్దతుగా నినాదాలు చేశారు. -
‘పురం’లో నీటిసమస్యకు చెక్!
నీటిఎద్దడి నివారణకు రూ.2.35కోట్లు ట్యాంకర్లు, ప్రైవేట్బోర్లను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేయాలని నిర్ణయం గద్వాల : జిల్లాలోని మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటిని పట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చడంతో కొన్ని పట్టణాల్లో రెండుమూడు రోజులకు ఒకమారు సరఫరా చేయాల్సి పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ‘పుర’వాసుల దాహం తీర్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆయా పట్టణాల్లో తాగునీటి ఎద్దడిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.25కోట్లు కేటాయించింది. కొన్నిరోజుల క్రితం అన్ని పట్టణాలకు నిధులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పట్టణ ప్రాంత ప్రజలకు కాస్తఊరట లభించనుంది. గద్వాల కృష్ణానది దగ్గర, జములమ్మ రిజర్వాయర్ వద్ద ఉన్న నిర్మించిన శాశ్వత పథకాల్లో నీళ్లు అడుగంటాయి. దీంతో గద్వాల పట్టణానికి తాగునీటి సరఫరా దినదినగండంగా మారింది. ఆయా పట్టణాల్లోనూ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. సమస్య నివారణకు అధికారులు ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. కానీ వేసవి ముగిసిన తర్వాత నిధులు విడుదలయ్యేవి. ఈసారి మాత్రం రాష్ర్ట ప్రభుత్వం ముందుచూపుతో ఆయా పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఈ నిధులను 15రోజుల క్రితమే విడుదల చేసింది. అయినప్పటికీ చాలా మునిసిపాలిటీలు ఇప్పటివరకు ప్రతిపాదనలు పంపించలేదు. రూ.2.35కోట్లు మంజూరు వేసవిలో తాగునీటి ఎద్దడినివారణకు రా ష్ట్ర ప్రభుత్వంజిల్లాలోని పురపాలక సం ఘాలు,నగర పంచాయితీలకు రూ.2.35 కోట్లు విడుదల చేసింది. అర్డర్స్ సీజనల్ కండిషన్స్ (ఏఎస్సీ)నిధుల ద్వారా వీటి ని కేటాయించింది. జిల్లాలో గద్వాల ము నిసిపాలిటీకి రూ.15 లక్షలు, వనపర్తికి రూ.15లక్షలు, నారాయణపేటకు రూ. 25లక్షలు, మహబూబ్‌నగర్‌కు రూ.40లక్షలు, కొల్లాపూర్‌కు రూ.20లక్షలు, నాగర్‌కర్నూల్‌కు రూ.20లక్షలు, షాద్‌నగర్‌కు రూ.20లక్షలు, బాదేపల్లికి రూ.20లక్షలు, అయిజకు రూ.20లక్షలు, కల్వకుర్తికి రూ.20లక్షలు,అచ్చంపేట నగర పం చాయితీకిరూ.20లక్షలచొప్పున మంజూ రయ్యాయి. ఆయా పట్టణాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా సరఫరా, సింగిల్‌ఫేజ్ మోటార్ల మరమ్మతులు కొత్తగా ఏర్పాటు, చేతిపంపులకు మరమ్మతులు అవసరమైన సామగ్రి కొనుగోళ్లు, బోర్ల తవ్వకం, ప్రైవేట్‌గా బోర్లను అద్దెకు తీసుకునేందుకు ఈ నిధులను వినియోగించేలా వెసులుబాటు కల్పించారు. -
నీరు.. చోరీ
- నగరంలో ట్యాంకర్ల మాయూజాలం - ఆరు ట్రిప్పులకు మూడే సరఫరా - పేదల కాలనీల్లో తీరని దాహార్తి - కార్పొరేషన్ నీరు హోటళ్లకు విక్రయం - స్వచ్ఛంద సంస్థల వ్యాపారం - రూ.వందకు కొని.. రూ.వెయ్యికి అమ్మకం - చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరంలో యథేచ్ఛగా మంచి నీటి దోపిడీ జరుగుతోంది. వేసవిలో తీవ్ర నీటిఎద్దడిని ఆసరాగా చేసుకొని ప్రజలకు జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ పర్వం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్లతో పాటు, స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో సాగుతోంది. కార్పొరేషన్ నీటిని ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్లు అమ్ముకుంటున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థల పేరిట కొందరు కార్పొరేషన్ ట్యాంకుల నుంచి నీటిని రూ.100 చెల్లించి తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు రూ.600 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. నీటి వ్యాపారంలో ఆరితేరుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థారుులో ఇందుకు విరుద్ధంగా ఉంది. నీటి సరఫరా కాగితాలపై అంకెల గారడీ సృష్టిస్తున్నారు. మంచినీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్‌కు సొంతంగా ఒక ట్యాంకర్ మాత్రమే ఉంది. అయితే వేసవిలో మంచినీటిని సరఫరా చేసేందుకు ఈ ఏడాది 12 ట్యాంకర్ల కోసం టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లను ఐదుగురు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు నీటిని సరఫరా చేయాలి. ఒక్క ట్యాంకర్‌కు ఒక్క ట్రిప్పుకు రూ.325 చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్క ట్యాం కర్ ద్వారా ఆరు ట్రిప్పులు సరఫరా చేయాలని టెండర్ నిబంధన పెట్టారు. ట్యాంకర్ల కాంట్రాక్టర్లు కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ అధికారులు సూచించిన ప్రకారం నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం మంచి నీటిని సరఫరా చేయాలి. అరుుతే ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లోపంతో మూడు, నాలుగు ట్రిప్పులు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని పలు కాలనీల వాసులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు మాత్రం ఆరు ట్రిప్పులు సరఫరా చేసినట్లు రిజస్టర్లలో రాసుకుంటున్నారని, అనుకూలంగా ఉన్న స్థానికులతో సంతకాలు చేయించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకు అడ్డాలను ఏర్పాటు చేసి స్థానికులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు ఏమీ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ట్యాంకర్ల నీటిని కాంట్రాక్టర్లు వాణిజ్య అవసరాలకు అమ్ముకుంటున్నారు. కార్పొరేషన ఖజానాకు గండి.. ఏటా ఈ ట్యాంకర్ల మంచినీటి సరఫరాలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ ఎత్తున కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్నారు. త క్కువ ట్రిప్పులు సరఫరా చేసి ఎక్కువ ట్రిప్పు లు సరఫరా చేసినట్లు లెక్కలు రాసుకుంటున్నారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసిన తర్వాత నెల వారీగా బిల్లులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మూడు, నాలుగు నెలల తర్వాత మంచినీటి సరఫరా బిల్లులు తీసుకుంటున్నారు. అప్పటికి ఈ లెక్కలు ఎవ్వరూ చూడరన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నారు. ఇందులో ఓ కాంట్రాక్టర్‌కు రెండు ట్యాంకర్లు మాత్రమే ఉన్నప్పటికీ తన వద్ద ఐదు ట్యాంకర్లు ఉన్నట్లు టెండర్ దక్కించుకోవడం గమనార్హం. నీటిని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మూడు, నాలుగు ట్రిప్పులు సరఫరా చేసి మిగతావి ఆపార్ట్మెంట్లు, హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకు మాత్రం లైన్‌మన్లతో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఏఈలు చెబుతున్నప్పటికీ నగరంలో రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. వీటిని పర్యవేక్షించుందుకే ఏఈలకు తీరకలేదు. వీరికే ట్యాంకర్ల సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పటించడంతో కాంట్రాక్టర్లకు కలిసివచ్చింది. కింది స్థాయి ఉద్యోగుల చేతులు తడిపి నాలుగు ట్రిప్పులకు ఆరు ట్రిప్పులు సరఫరా చేస్తున్నట్లు రిజిస్టర్లలో రాయించుకుంటున్నారు. వాస్తవంగా ఏ ట్యాంకర్..? రోజు ఎన్ని ట్రిప్పులు..? ఏ ప్రాంతాల్లో సరఫరా చేశారన్న విషయాలు కమిషనర్ లేక ఎంఈకి నివేదిక రూ పంలో సంబంధిత విభాగం అధికారులు ఇవ్వాలి. కానీ ఇక్కడ డీఈలు సైతం దీనిపై దృష్టి పెట్టడడం లేదు. దీంతో నగరంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ‘స్వచ్ఛంద’.. వ్యాపారం.. నగరంలో కొన్ని సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా ముసుగులో కార్పొరేషన్ నీటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలకు మాత్రమే కార్పొరేషన్ నిబంధనల ప్రకారం నీటిని ఉచితంగా ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు చేశారు. గతంలో దీన్ని ఆసరా చేసుకున్న కొంత మంది వ్యక్తులు కార్పొరేషన్ నుంచి ఉచితంగా నీటిని తీసుకొని నగరంలో హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్మెంట్లకు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేసి నీటి విక్రయించారు. అయితే ప్రస్తుతం గుర్తింపు ఉన్నా లేకున్నా సొంత ట్యాంకర్ ఉంటే రూ.100 చెల్లించి ట్యాంకర్ నీటిని కార్పొరేషన్ పరిధిలోని ట్యాంకుల నుంచి తీసుకోవచ్చు. అయితే గుర్తింపు ఉన్నా, లేకున్నా పదుల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు, కొంత మంది వ్యక్తులు కార్పొరేసన్ ట్యాంకుల నుంచి రూ.100 చెల్లించి నీటిని తీసుకొని ఇదే ట్యాంక్‌ను నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. తనిఖీలు చేయని అధికారులు.. మంచినీటి కోసం ప్రతిరోజు నగరంలో ఏదో ఒక చోట నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నగరంలో ఎక్కడ సమస్య ఉందో చెబితే అక్కడి ట్యాంకర్ పంపిస్తామని చెప్పిన కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం ట్యాంకర్లతో మంచినీటి సరఫరాపై నిఘా పెట్టడం లేదు. -
కన్నీళ్లే దిగుబడి!
రామాపురం మండలం నీలకంఠరావుపేటకు చెందిన రైతు గౌతమ్ కళ్యాణ్ సుమారు 18 ఎకరాల్లో మామిడి తోట సాగు చేశాడు. మొన్నటి వరకు చెట్లు పచ్చగా కళకళలాడాయి. 2014 ఆగస్టు వరకు రెండు బోర్లలో వస్తున్న నీటితో చెట్లను సంరక్షించుకుంటూ వచ్చాడు. ఈ బోర్లలో నీరు ఇంకిపోవడంతో సుమారు 10 బోర్ల వరకు వేశాడు. కానీ, నీటి జాడ కనిపించలేదు. నాలుగైదు ట్యాంకర్లు పెట్టి ఐదారు నెలలుగా నీటిని తోలాడు. ప్రస్తుతం చుట్టు పక్కల ఎక్కడా నీరు లేకపోవడంతో ట్యాంకర్లతో తోలడానికి ఇబ్బందిగా మారింది. సుమారు 1200 పైగా 20 ఏళ్ల వయసున్న మామిడి చెట్లు నిలువునా ఎండిపోయాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా చెట్లు ఎండుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. సాక్షి, కడప : పుడమి తల్లిని నమ్ముకున్న రైతుకు పుట్టెడు కష్టాలు మిగిలాయి. ఆరుగాలం శ్రమించినా అవస్థలు తప్పడం లేదు. ఒకనాడు చేసిన వ్యవసాయానికి, నేటి వ్యవసాయానికి చాలా తేడా కనిపిస్తోంది. నాడు బావుల్లో నీరు దొరికితే, నేడు వేల అడుగులు డ్రిల్ చేసినా పాతాళ గంగను పైకి రప్పించలేక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఒక్కొక్క రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసినా చుక్కనీరు కనిపించక, ఉన్న పంటను ఎలా కాపాడుకోవాలో తెలీక కుమిలిపోతున్నాడు. దిగుబడులు రాక, చేసిన అప్పులు తీరక ఆవేదన చెందుతున్నాడు. పల్లెల్లో ఎండుతున్న చెట్లను సంరక్షించుకునేందుకు ఒక్కో రైతు ఒక్కో ప్రయోగం చేస్తున్నాడు. కొందరు బోర్లు వేస్తే, మరికొందరు ట్యాంకర్లతో నీరు తోలితే, ఇంకొందరు సంపుల్లో స్టాకు పెట్టుకుని పాట్లు పడితే.. కొంత మంది దూర ప్రాంతం నుంచి తోట వద్దకు పైపులైన్లు వేసుకుని వేసవి దాటేంత వరకు చెట్లను సంరక్షించుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒక్కో రైతుది ఒక్కో గాథ. వేలాది ఎకరాల్లో ఎండిన పండ్ల తోటలు జిల్లా వ్యాప్తంగా సుమారు 93.5 వేల ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేశారు. ప్రస్తుత వేసవిలో పండ్ల తోటలను ఎలా రక్షించుకోవాలో అన్నదాతకు అంతుచిక్కడం లేదు. ఏడాదికేడాది పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసవిలో చెట్లను ఎలా బతికించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. గత ఏడాది 5 వేల ఎకరాలు ఎండిపోతే ఈ సంవత్సరం అది రెట్టింపు అవుతోంది. జిల్లాలోని పులివెందుల, రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన చీని, నిమ్మ, అరటి, మామిడి, ఉసిరి, సపోట, శీతాఫలం తోటలు నీరు లేక ఎండిపోతున్నాయి. రానున్న రెండు నెలల్లో పరిస్థితి మరింత ఆందోళనగా మారనుందని ఉద్యాన శాఖ అంచనా వేస్తోంది. పండ్ల తోటలను రక్షించుకునేందుకు రైతులు విరివిగా బోర్లు వేస్తున్నారు. చాలా మంది రైతుల పొలాల్లో నీరు పడక లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నాడు. చీనీ, అరటి, మామిడి చెట్లు వాడుబడుతుంటే చూస్తూ తట్టుకోలేక ఇలా అప్పులపాలవుతున్నారు. పల్లెల శివార్లలో బోర్లు వేసే లారీలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే.... మార్చి ఆరంభంలోనే భూగర్బ జలాలు ఇంత అట్టుడుగు స్థాయికి పడిపోవడంతో రానున్న మూడు నెలల్లో పరిస్థితి మరింత దుర్భరంగా మారనుంది. అరకొరగా నీరు వస్తున్న బోర్లలో ఇప్పుడే నీరు అడుగంటుతోంది. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఊహించుకోడానికే భయం వేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్లు, సంపులు, ట్యాంకర్ల ద్వారా ఎలా పడితే అలా పరిస్థితిని బట్టి నీరు తోలుకుంటున్నారు. సాఫ్ట్‌లోన్లు అందించండి రైతులు నీటి తడులు అందించుకోడానికి భారీ పెట్టుబడులు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సాఫ్ట్లోన్లను అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వేలాది ఎకరాలు ఎండుతున్న నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించి నష్టపరిహారం వచ్చేలా చూడాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెట్లను సంరక్షించుకోవడానికి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్యాంకర్లతో నీటి తడులు అందించేందుకు ట్యాంకర్లకు బాడుగ చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. కానీ, నేటి ప్రభుత్వం జిల్లా పరిపాలన యంత్రాంగం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జాతీయ రహదారిపై స్టాక్ దందా
దగదర్తి (బిట్రగుంట): దగదర్తి మండలం ఉలవపాళ్ల నుంచి సున్నపుబట్టీ వరకు జాతీయ రహదారి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. డీజిల్, పెట్రోల్ నుంచి వివిధ రకాల రసాయనాలకు సంబంధించి కొందరు అక్రమ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న దాబా హోటళ్లు, టైర్లకు పంక్చర్లు వేసే దుకాణాలు ఇందుకు వేదికగా మారుతున్నాయి. వీటి పక్కనే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుంటున్న అక్రమార్కులు ట్యాంకర్ల నుంచి సేకరిస్తున్న డీజిల్, పెట్రోల్‌ను కిరోసిన్, ఇతర రసాయనాలతో కల్తీ చేసి గ్రామాల్లోని దుకాణాలకు తరలిస్తున్నారు. వీటితో పాటు కల్తీ పామాయిల్, ఎముకల నుంచి తీసిన ఆయిల్‌ను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి నాణ్యమైన పామాయిల్‌గా డబ్బాల్లో నింపి దాబా హోటళ్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఉలవపాళ్ల నుంచి సున్నపుబట్టి వరకూ ఆరు కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి అక్రమ స్టాక్ పాయింట్లు పది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో స్టాక్ పాయింట్ నుంచి పోలీసులకు నెలనెలా భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉలవపాళ్ల వద్ద దాబా హోటల్ పక్కనే ఉన్న పెట్రోల్, డీజిల్ అక్రమ స్టాక్ పాయింట్‌పై కొద్ది నెలల క్రితం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దగదర్తి రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. డీజిల్, పెట్రోల్‌ను భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. అంతలోనే నిర్వాహకులు తమదైన శైలిలో పావులు కదపడంతో కేసు లేకుండానే వదిలేశారు. ప్రస్తుతం ఈ స్టాక్ పాయింట్లోరోజూ 500 నుంచి వెయ్యి లీటర్ల వరకూ డీజిల్, పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డీజిల్, పెట్రోల్ సేకరించేదిలా.. నెల్లూరు వైపు వెళ్లే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లతో అక్రమ స్టాక్ పాయింట్ నిర్వాహకులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ బయలుదేరిన వెంటనే డ్రైవర్ స్టాక్ పాయింట్ నిర్వాహకుడికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. అనంతరం స్టాక్ పాయింట్ల వద్ద ట్యాంకర్లను నిలిపి 25 లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ సేకరిస్తారు. ఇందుకు గాను డ్రైవర్, క్లీనర్లకు లీటరు డీజిల్‌కు రూ.35, పెట్రోల్‌కు రూ.45 వంతున చెల్లిస్తారు. ఇలా సేకరించిన పెట్రోల్, డీజిల్‌ను కిరోసిన్, ఇతర రసాయనాలతో కల్తీ చేసి గ్రామాల్లోని విక్రేతలకు డీజిల్ లీటరు రూ.50 వంతున, పెట్రోల్ రూ.60 వంతున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈఅక్రమ స్టాక్ పాయింట్లపై ఎస్పీకి నేరుగా ఫిర్యాదులు అందటంతో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది రహస్యంగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దాడులు నిర్విహ స్తాం.. గతంలో ఉలవపాళ్లలో పెట్రోల్, డీజిల్ అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాం. కేసులు కూడా నమోదు చేశాం. ఇటీవల కాలంలో మళ్లీ విక్రయాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. మరోమారు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ దందాను అడ్డుకుంటాం. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుంటాం. -వెంకట్రావు, దగదర్తి ఎస్ఐ -
జోరుగా మంచినీటి వ్యాపారం
మదనపల్లెలో నెలకు రూ.2.13కోట్ల వ్యాపారం ట్యాంకరు నీళ్లు రూ.700 30 ట్యాంకర్లు, 60 ట్రిప్పులుగా వ్యాపారం మదనపల్లె: జిల్లాలో ఎక్కడా లేని విధంగా మదనపల్లెలో నెలకు దాదాపు రూ.2.13 కోట్ల వరకు మంచినీటి వ్యాపారం జరుగుతోంది. పట్టణంలో భూగర్భ జలా లు పూర్తిగా అడుగంటిపోవడంతో శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేయాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు 29 ట్యాంకుల ద్వారా రోజుకు 403 ట్రిప్పుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.306 చొప్పున ప్రైవేటు వారికి చెల్లిస్తున్నారు. ఈ మొత్తం రోజుకు దాదాపు రూ.1.50 లక్షలు అవుతోంది. అంటే నెలకు రూ.45 లక్షలు. అదేవిధంగా ప్రైవేటు ట్యాంకర్లైతే ఒక్కో ట్యాం కు నీళ్లను రూ.600 నుంచి రూ.700 వరకూ విక్రయిస్తున్నారు. పట్టణంలో దాదాపు 40 ట్యాంకర్లకు పైగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకరు రోజుకు 20 ట్రిప్పులు వరకూ తోలుతున్నాయి. అంటే దాదాపుగా 800 ట్రిప్పులు. రోజుకు రూ.5.60 లక్షల వ్యాపారం ప్రైవే టు ట్యాంకర్ల ద్వారా జరుగుతోంది. అంటే నెలకు రూ.1.68 కోట్లు, ఇటు మున్సిపాల్టీ, అటు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని నెలకు రూ.2.13 కోట్లు వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుతం మున్సిపల్ కొళాయిల ద్వారా 10 రోజులకు, 15 రోజులకు ఒకసారి సరఫరా జరుగుతుండటంతో ప్రైవేటు ట్యాంకర్ల వ్యాపా రం సిరులు కురిపిస్తోంది. పట్టణ శివారు ప్రాంతాల నుంచి ట్యాంకరు యజమానులు నీటిని కొనుగోలు చేస్తున్నారు. బోర్ల వద్ద ట్యాంకరు నీరు రూ.300 చొప్పున కొనుగోలు చేసి, పట్టణంలో రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. అడుగంటిన భూగర్భజలాలు మదనపల్లె పట్టణంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఒకప్పుడు 600 నుంచి 700 అడుగుల్లో ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 1200 నుంచి 1300 అడుగులకు పడిపోయింది. మున్సిపల్ పవర్ బోర్లు 11, హ్యాండ్ బోర్లు 12 మాత్రమే పనిచేస్తున్నాయి. గతంలో ఇవి పవర్ బోర్లు 94, హ్యాండ్బోర్లు 62 పనిచేసేవి. వరుణదేవుడు కరుణిస్తే తప్పా సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. -
తాగునీటికి కటకట
వేసవి ఇంకా రానేలేదు... ఎండల తీవ్రత ఇంకా పెరగనే లేదు.. అప్పుడే నీటి తిప్పలు తీవ్రమవుతున్నాయి. పల్లెల్లో దాహం కేకలు మార్మోగుతున్నాయి. నీటికోసం కిలోమీటర్ల దూరానికి వెళ్లాల్సి వస్తోంది. రక్షితనీరు లేక తీరప్రాంత పల్లెలు అల్లాడుతున్నాయి. పట్టణాల్లో ట్యాంకర్ల వద్ద ముష్టియుద్ధాలు మొదలవుతున్నాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకుంటే మరిన్ని తిప్పలు తప్పవేమోనన్న భయం వెన్నాడుతోంది. సాక్షి, గుంటూరు :జిల్లాను ఆనుకొని కృష్ణానది ప్రవహిస్తున్నా... చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. ఇటు తీరప్రాంతం... అటు పల్నాడు ప్రాంతాల్లో రక్షిత నీటికోసం అల్లాడాల్సిన దుస్థితి దాపురించింది. ప్రధాన పట్టణాలతోపాటు గుంటూరు నగరానికీ నీటి ముప్పు మొదలయ్యింది. క్యూబిక్ మిల్లీ మీటరు నీటిలో 120 లేదా అంతకంటే తక్కువ రోగ కారక సూక్ష్మజీవులుంటే నీటిని రక్షిత నీరుగా పేర్కొంటున్నారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ ఇలాంటి నీరు లభ్యం కావడం లేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రక్షిత నీరు లేక వేసవిలో ఏటా వందల సంఖ్యలో జనం అతిసార, పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. నీటి సంబంధిత వ్యాధులు లేవని అధికారులు బుకాాయిస్తున్నా, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. జిల్లాలోని గ్రామాల్లో, పట్టణాల్లో రక్షిత నీరు దొరకకపోవడమే వ్యాధులకు కారణమని అందరూ అంగీకరించక తప్పదు. తీర ప్రాంతాలైన బాపట్ల, నిజాంపట్నం, రేపల్లె, కూచినపూడి ప్రాంతాల్లో సెలెనిటీ శాతం ఎక్కువగా ఉన్న నీరు చొచ్చుకొస్తూ ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. వేసవి కార్యాచణపైనా నిర్లక్ష్యం వేసవి సీజన్లో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం మొక్కుబడిగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. పల్నాడు ప్రాంతంలో సాగర్ కాల్వల కింద చెరువులు యుద్ధ ప్రాతిపదికన నింపుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. వీటి పరిధిలో ఉన్న 238 చెరువుల్ని మార్చి 31 లోగా నింపుకోవాలని జిల్లా ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. గతంలో ప్రత్తిపాడు, గుంటూరు రూరల్, నరసరావుపేట ప్రాంతాల్లో తీవ్రంగా తాగునీటి సంక్షోభం ఎదురైంది. మళ్ళీ ఇదే పరిస్థితి పునరావృతమైతే ఎలా అధిగమించాలో ప్రణాళిక ఇంతవరకు తయారు చేయలేదు. కేవలం కాల్వలపైనే ఆధారపడటంతో ముప్పు పొంచి ఉంది. ఇరిగేషన్ శాఖ ఆధునికీకరణ కోసం ఎప్పుడు కాల్వల్ని కట్టేస్తారో.. తెలియదు. ఈ పరిస్థితిలో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేందుకు, నీటి ఎద్దడి తలెత్తకుండా చేసేందుకు సరైన ప్రణాళిక అధికారులు రూపొందించకపోవడం గమనార్హం. 20 ప్రాజెక్టుల పూర్తి ఎన్నటికో? జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జిల్లాలో రూ.120 కోట్లతో 20 బహుళ గ్రామాలకు నీటి పథకాలు(మల్టీ విలేజ్ స్కీంలు) మంజూరై ఆరు నెలలు కావస్తున్నా, ఇంతవరకు టెండర్ల దశ దాటలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ 20 ప్రాజెక్టుల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు 170 గ్రామాల్లో సాధారణ వాటర్ స్కీంల పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి 31 లోపు పూర్తి చేస్తామని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నా, పనుల పూర్తిపై అనుమానాలు లేకపోలేదు. నగరానికీ అరకొర నీరే.. నగరంలో ప్రతిమనిషికీ తాగునీరు అందాలంటే 125 ఎంఎల్డీలు అవసరం. అయితే కేవలం 97 ఎంఎల్డీల నీటితోనే ప్రజలు సరిపెట్టుకుంటున్నారు. నగరంలో 25 రిజర్వాయర్ల ద్వారా తాగునీరు సరఫరాచేస్తున్నా కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా ఎపుడు అవుతుందా అని ప్రజలు జాగరాలు చేస్తున్న దశ్యాలు నగరంలో నిత్యకత్యమయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. కేవలం నీటి వనరులు పెరగని కారణంగానే తాగునీటి ఇక్కట్లు వెంటాడుతున్నాయి. సమగ్ర తాగునీటి పథకం కింద రూ.460 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన ప్రాజెక్టు టెండర్ల దశలోనే ఉంది. రెండున్నరేళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. -
షట్‌డౌన్
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని నూనె మిల్లులు సంక్షోభంలో ఉన్నాయి. మూడు నెలలుగా ఈ పరిస్థితి నెలకొంది. కొద్ది నెలల క్రితం నూనె మిల్లులు కళకళలాడుతుండేవి. ప్రస్తుతం మిల్లులు ఆడని కారణంగా బోసిపోయాయి. విత్తనాల కొరత ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలుపుతున్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, రాయచోటి, మైదుకూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో సుమారు 50 నూనె మిల్లులు ఉన్నాయి. ఇందులో 15 మిల్లుల వరకు ప్రొద్దుటూరులోనే ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచే ట్యాంకర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు నూనెను తరలిస్తుంటారు. ఈ పరిశ్రమపై ఆధారపడి వందల మంది కూలీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నారు. మిల్లుల యజమానులు విత్తనాల లభ్యతను బట్టి పొద్దుతిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్ ఆయిల్), వేరుశనగ నూనెను తయారు చేస్తుంటారు. వేరుశనగ నూనెను నేరుగా మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉండగా పొద్దుతిరుగుడు నూనెను మాత్రం రీఫైండ్ కోసం హైదరాబాద్‌కు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం విత్తనాల కొరత తో పాటు ధరలు కూడా పడిపోవడంతో పరిశ్రమకు గడ్డుకాలం ఏర్పడింది. కొంత కాలం క్రితం హోల్ సేల్‌గా 10 కిలోల వేరుశనగ నూనె రూ.1100 ఉండగా ప్రస్తుతం రూ.700 ఉంది. అలాగే పొద్దుతిరుగుడు నూనె (రా ఆయిల్) 10 కిలోలు రూ.720-620కి తగ్గింది. దిగుమతుల ప్రభావం కారణంగానే ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో యాంత్రీకరణ ప్రభావం కారణంగా పొద్దుతిరుగుడు పంట స్థానంలో ఎక్కువగా శనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. దీంతో పొద్దుతిరుగుడు పంట విస్తీర్ణం 25 శాతానికి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఆగిన మిల్లును తిరిగి నడపాలంటే కనీసం మూడు రోజులకు సరిపడ విత్తనాలైనా ఉండాలని, అవి దొరకడం కష్టతరంగా ఉందని ఓ వ్యాపారి తెలిపాడు. వేరుశనగ విస్తీర్ణం కూడా తగ్గిపోవడంతో నూనెమిల్లులకు విత్తనాల కొరత ఏర్పడింది. కొంత మంది వ్యాపారులు అనంతపురం జిల్లా నుంచి వేరుశనగ విత్తనాలు కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు. దిగుమతుల ప్రభావమే కారణం ఇతర దేశాల నుంచి నూనెలు ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో లోకల్ మార్కెట్లో నూనెతోపాటు విత్తనాల ధరలు పడిపోయాయి. ప్రభుత్వం పన్ను రాయితీ ఇవ్వడంతో విచ్చలవిడిగా నూనెలు దిగుమతి అవుతున్నాయి. దీంతో మిల్లులు సంక్షోభంలో ఉన్నాయి. - గువ్వల నారాయణరెడ్డి, ఆయిల్ మిల్లర్, ప్రొద్దుటూరు -
కరువు దరువు
సాక్షి, ముంబై: ఈ ఏడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ పది జిల్లాల్లో ఇప్పటికీ కరు వు ఛాయలు మాత్రం తొలగిపోవడం లేదు. చాలా గ్రామాలకు ఇంకా ట్యాంకర్లతోనే నీటి సరఫరా జరుగుతోంది. గత సంవత్సరం వర్షాలు అనుకున్నంతమేర వర్షాలు కురవకపోవడంతో మరఠ్వాడాలోని అనేక గ్రామాల్లో వేసవిలో కరువు తాండవించింది. తాగేందుకు నీరు లేక వందలాది గ్రామాల ప్రజలు వలస పోయారు. పశువులకు మేత, నీరు దొరకడం కష్టతరంగా మారింది. అదృష్టవశాత్తూ ఈ ఏడు ఆరంభం నుంచే వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిం చాయి. అయినప్పటికీ ధులే, పుణే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, బుల్డాణ జిల్లాల్లోని అనేక గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిస్తున్నారు. నీటిసరఫరా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 823 గ్రామాలు, 4,320 కుగ్రామాలకు సుమారు 1,042 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇందులో 99 ప్రభుత్వానికి చెందినవి, 943 ప్రైవేటు యజమానులకు చెందిన ట్యాంకర్లు ఉన్నాయి. ఈ ఏడు 30 జిల్లాల్లో వందశాతం కంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జలాశయాల్లోకి దాదాపు 78 శాతం నీరు వచ్చి చేరింది. కొన్ని జిల్లా ల్లో సంతృస్తస్థాయిలో, మరికొన్ని జిల్లాల్లో తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణంగా జూన్ ఒకటి నుంచి సెప్టెం బరు వర కు దాదాపు 159.9 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. అయితే ఈ సారి జూన్ నుంచి ఆగస్టు 31 వరకే 1,226.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీన్ని బట్టి చూస్తే ఈసారి 125 శాతం వర్షపాతం నమోదయిది. షోలాపూర్, సాంగ్లీ, ఔరంగాబాద్, బీడ్ జిల్లాల్లో 76-100 శాతం వర్షం కురిసింది. ఉస్మానాబాద్ జిల్లాలో 51-76 శాతం వర్షం కురిసింది. రాష్ట్రంలో 84 పెద్ద, 224 సాధారణ, 2,156 చిన్న నీటి డ్యాములు ఉన్నా యి. ఇలా మొత్తం 2,464 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవిగాక మరో 16 డ్యాములు ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు, డ్యాములతో కలిపి 37,335 మిలి యన్ ఘనమీటర్ల నీరు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 29,179 మిలియన్ ఘనమీటర్ల నీరు మాత్రమే ఉంది. శాతాలవారీగా చూస్తే 78 శాతం నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో ఈ నిల్వ లు రోజురోజుకూ తుగ్గుముఖం పడుతున్నాయి. దీన్ని బట్టి వచ్చే సంవత్సరం వేసవి కాలంలో కరువు పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొనసాగనున్న దాణాకేంద్రాలు ఇప్పటికీ కరువు పరిస్థితులు తొలగిపోకపోవడంతో 13 తాలుకాల్లోని పశుదాణా కేంద్రాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బారామతి, ఇందాపూర్, దౌండ్, ఫాల్తన్, మన్, ఖటావో, జాట్, అత్పడి, కవాటే మహాకాల్, టాస్‌గావ్, మంగళ్వేదా, పండర్పూర్ తాలుకాల్లో ఈ కేంద్రాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటి లో 1.75 లక్షల పశువులకు దాణా సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి పెరుగుతుండడంతో ట్యాంకర్ల సంఖ్యనూ పెంచామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా చంద్రపూర్, గడ్చిరోలీ జిల్లాల్లోని పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలా ల్లో పూర్తిగా నీరు చేరడం వల్ల రెండో పంట కూడా సాధ్యం కాకపోవచ్చని రైతులు అంటున్నారు. అయితే వర్షాల కారణంగా నష్టపోయిన పత్తిరైతులకు హెక్టారుకు రూ.ఐదువేలు, సోయాబీన్ రైతులకు హెక్టారుకు రూ.ఏడువేల చొప్పున పరిహా రం చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. పంటలు పూర్తిగా కొట్టుకుపోతే మాత్రం రూ.15 వేలు, రూ.20 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇంత తక్కువ నష్టపరిహారం ఇవ్వడమంటే తమను అవమానించడమేనని రైతులు అంటున్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ప్రభుత్వం వ్యవసాయా న్ని అపహాస్యం చే స్తోందని చంద్రపూర్ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో ప్రహార్ పేర్కొంది.