కన్నీళ్లే దిగుబడి! | Yield tears! | Sakshi
Sakshi News home page

కన్నీళ్లే దిగుబడి!

Published Tue, Mar 10 2015 2:16 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM

Yield tears!

రామాపురం మండలం నీలకంఠరావుపేటకు చెందిన రైతు గౌతమ్ కళ్యాణ్ సుమారు 18 ఎకరాల్లో మామిడి తోట సాగు చేశాడు. మొన్నటి వరకు చెట్లు పచ్చగా కళకళలాడాయి. 2014 ఆగస్టు వరకు రెండు బోర్లలో వస్తున్న నీటితో చెట్లను సంరక్షించుకుంటూ వచ్చాడు. ఈ బోర్లలో నీరు ఇంకిపోవడంతో సుమారు 10 బోర్ల వరకు వేశాడు. కానీ, నీటి జాడ కనిపించలేదు.

నాలుగైదు ట్యాంకర్లు పెట్టి ఐదారు నెలలుగా నీటిని తోలాడు. ప్రస్తుతం చుట్టు పక్కల ఎక్కడా నీరు లేకపోవడంతో ట్యాంకర్లతో తోలడానికి ఇబ్బందిగా మారింది. సుమారు 1200 పైగా 20 ఏళ్ల వయసున్న మామిడి చెట్లు నిలువునా ఎండిపోయాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. లక్షల్లో పెట్టుబడులు పెట్టినా చెట్లు ఎండుతుండడంతో ఆందోళన చెందుతున్నాడు.
 
 
సాక్షి, కడప : పుడమి తల్లిని నమ్ముకున్న రైతుకు పుట్టెడు కష్టాలు మిగిలాయి. ఆరుగాలం శ్రమించినా అవస్థలు తప్పడం లేదు. ఒకనాడు చేసిన వ్యవసాయానికి, నేటి వ్యవసాయానికి చాలా తేడా కనిపిస్తోంది. నాడు బావుల్లో నీరు దొరికితే, నేడు వేల అడుగులు డ్రిల్ చేసినా పాతాళ గంగను పైకి రప్పించలేక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఒక్కొక్క రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసినా చుక్కనీరు కనిపించక, ఉన్న పంటను ఎలా కాపాడుకోవాలో తెలీక కుమిలిపోతున్నాడు.

దిగుబడులు రాక, చేసిన అప్పులు తీరక ఆవేదన చెందుతున్నాడు. పల్లెల్లో ఎండుతున్న చెట్లను సంరక్షించుకునేందుకు ఒక్కో రైతు ఒక్కో ప్రయోగం చేస్తున్నాడు. కొందరు బోర్లు వేస్తే, మరికొందరు ట్యాంకర్లతో నీరు తోలితే, ఇంకొందరు సంపుల్లో స్టాకు పెట్టుకుని పాట్లు పడితే.. కొంత మంది దూర ప్రాంతం నుంచి తోట వద్దకు పైపులైన్లు వేసుకుని వేసవి దాటేంత వరకు చెట్లను సంరక్షించుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఒక్కో రైతుది ఒక్కో గాథ.
 
వేలాది ఎకరాల్లో ఎండిన పండ్ల తోటలు
జిల్లా వ్యాప్తంగా సుమారు 93.5 వేల ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేశారు. ప్రస్తుత వేసవిలో పండ్ల తోటలను ఎలా రక్షించుకోవాలో అన్నదాతకు అంతుచిక్కడం లేదు. ఏడాదికేడాది పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసవిలో చెట్లను ఎలా బతికించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. గత ఏడాది 5 వేల ఎకరాలు ఎండిపోతే ఈ సంవత్సరం అది రెట్టింపు అవుతోంది.

జిల్లాలోని పులివెందుల, రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన చీని, నిమ్మ, అరటి, మామిడి, ఉసిరి, సపోట, శీతాఫలం తోటలు నీరు లేక ఎండిపోతున్నాయి.  రానున్న రెండు నెలల్లో పరిస్థితి మరింత ఆందోళనగా మారనుందని ఉద్యాన శాఖ అంచనా వేస్తోంది. పండ్ల తోటలను రక్షించుకునేందుకు రైతులు విరివిగా బోర్లు వేస్తున్నారు. చాలా మంది రైతుల పొలాల్లో నీరు పడక లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నాడు. చీనీ, అరటి, మామిడి చెట్లు వాడుబడుతుంటే చూస్తూ తట్టుకోలేక ఇలా అప్పులపాలవుతున్నారు. పల్లెల శివార్లలో బోర్లు వేసే లారీలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి.
 
మార్చిలోనే ఇలా ఉంటే....
మార్చి ఆరంభంలోనే భూగర్బ జలాలు ఇంత అట్టుడుగు స్థాయికి పడిపోవడంతో రానున్న మూడు నెలల్లో పరిస్థితి మరింత దుర్భరంగా మారనుంది. అరకొరగా నీరు వస్తున్న బోర్లలో ఇప్పుడే నీరు అడుగంటుతోంది. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఊహించుకోడానికే భయం వేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్లు, సంపులు, ట్యాంకర్ల ద్వారా ఎలా పడితే అలా పరిస్థితిని బట్టి నీరు తోలుకుంటున్నారు.  
 
సాఫ్ట్‌లోన్లు అందించండి
రైతులు నీటి తడులు అందించుకోడానికి భారీ పెట్టుబడులు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సాఫ్ట్‌లోన్లను అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వేలాది ఎకరాలు ఎండుతున్న నేపథ్యంలో ఉద్యానశాఖ అధికారులు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపించి నష్టపరిహారం వచ్చేలా చూడాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

చెట్లను సంరక్షించుకోవడానికి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ట్యాంకర్లతో నీటి తడులు అందించేందుకు ట్యాంకర్లకు బాడుగ చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. కానీ, నేటి ప్రభుత్వం జిల్లా పరిపాలన యంత్రాంగం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement