
రేపట్నుంచి వాటర్ ట్యాంకర్లు బంద్
ముంబై వాటర్ ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రకటన
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నిబంధన దృష్ట్యా నిర్ణయం
నీటి కొరతతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న ముంబై వాసులకు మరో దెబ్బ తగలబోతోంది. రేపట్నుంచి (ఏప్రిల్ 10) ముంబైలో నీటి ట్యాంకర్ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ముంబై వాటర్ ట్యాంకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నిబంధన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ పేర్కొంది.
80 ఏళ్ల సేవలకు అందుకే గుడ్‌బై....
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నిబంధనల ప్రకారం బోర్‌వెల్ యజమానులు ఎన్‌ఓసీ పొందాల్సి ఉంటుందని అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 381 ఎ నోటీసులు జారీ కావడంతో అనుమతి లేకుండా నీటి సరఫరా కొనసాగించలేమని ముంబై వాటర్ ట్యాంకర్ అసోసియేషన్ ప్రతినిధి అంకుర్ వర్మ చెప్పారు. అందుకే ట్యాంకర్ల సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
‘నీరు లేక – ట్యాంకరూ లేక బతికేదెలా?
ప్రస్తుతం ముంబైకి నీటిని సరఫరా చేసే ఏడు రిజర్వాయర్లలో కేవలం 33.57 శాతం మాత్రమే నీటి నిల్వలున్నాయి. ఇప్పటికే కొలాబా, ఘాట్‌కోపర్, ములుంద్, వర్లీ, బోరివలి, అంధేరి తదితర ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల తాగునీటికి బదులు బోర్‌వెల్ నీరు, మురకినీటిని సరఫరా చేస్తున్నారు. ఇది పౌరుల ఆరోగ్యానికి ముప్పుగా మారింది.