లైఫ్‌‘లైన్’ బంద్! | Mumbai's BEST conductors, drivers on strike to protest new scheduling software | Sakshi
Sakshi News home page

లైఫ్‌‘లైన్’ బంద్!

Published Tue, Apr 1 2014 10:35 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

Mumbai's BEST conductors, drivers on strike to protest new scheduling software

సాక్షి, ముంబై: బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్(బెస్ట్) యాజమాన్యం కొత్తగా రూపొందించిన కొత్త కంప్యూటరీకరణ షెడ్యూల్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ మంగళవారం ఉదయం నుంచి బస్ కండక్టర్లు, డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. ముంబైకర్లకు లైఫ్‌లైన్‌గా ఉన్న బెస్ట్ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  ఉద్యోగులు తమ కార్యాలయాలకు ఆలస్యంగా చేరుకున్నారు.  పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు తిప్పలు తప్పలేదు.

 డ్యూటీ షెడ్యూల్‌ను వ్యతిరేకిస్తూ...
 బెస్ట్ సంస్థలో కొద్ది రోజులుగా కండక్టర్, డ్రైవర్ల డ్యూటీ షెడ్యూల్‌పై కార్మిక యూనియన్లు, బెస్ట్ యాజమాన్యం మధ్య వివాదం నడుస్తోంది. కెనడా తరహాలో అక్కడి రవాణా పద్ధతులను ఇక్కడ కూడా అమలు చేయాలని బెస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకారం నాలుగు గంటలు డ్యూటీ, నాలుగు గంటలు విశ్రాంతి, మళ్లీ నాలుగు గంటలు విధులు నిర్వర్తించేలా డ్యూటీ షెడ్యూల్‌ను రూపొందించి ఇవ్వాలని కెనడా కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సదరు కంపెనీ షెడ్యూల్ తయారు చేసి ఇటీవలే బెస్ట్‌కు సమర్పించింది. దీన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.

 ఈ ప్రతిపాదనను ముందునుంచి వ్యతిరేకిస్తున్న కార్మిక యూనియన్లు, బెస్ట్ యాజమాన్యంతో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. ఇక సమ్మెకు దిగాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా మంగళవారం ఉదయం నుంచి ఆకస్మిక సమ్మెకు దిగారు. నగరంలోని మొత్తం 25 బెస్ట్ డిపోల్లో బస్సులన్నీ నిలిచిపోయాయి. కొన్ని చోట్ల బెస్ట్ అధికారుల ఒత్తిడి మేరకు నామమాత్రంగా కొన్ని బస్సులు మాత్రమే రోడ్లపై తిరిగాయి.  మిగతా ప్రాంతాల్లో మాత్రం సమ్మె కొనసాగింది.

 ముంబైకర్ల ఇబ్బందులు...
 సమ్మె వల్ల ఉద్యోగులు, విద్యార్థులతోపాటు వివిధ పనుల కోసం ఇంటినుంచి బయటకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అనేక ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు నుంచి తొమ్మిది తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం ఆరున్నర నుంచి బస్సుల కోసం బస్టాపుల్లో పడిగాపులు కాశారు. చివరకు అవి రావని తెలుసుకున్న విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. చివరకు ట్యాక్సీలను ఆశ్రయించి పాఠశాలలకు చేరుకున్నారు. ఇదే పరిస్థితి ఉద్యోగులకు కూడా ఎదురైంది. లోకల్ రైలు దిగిన ఉద్యోగులకు బస్సులు లేకపోవడంతో ట్యాక్సీలు, ఆటోలను ఆశ్రయించారు. ఒక్కసారిగా ఆటో, ట్యాక్సీలకు డిమాండ్ పెరిగింది. దీన్ని అదనుగా చేసుకుని డ్రైవర్లు అందినంత దండుకుని జేబులు నింపుకున్నారు. శివారు ప్రాంతాల నుంచి లోకల్ రైలులో నగరానికి చేరుకున్న ఉద్యోగులకు స్టేషన్ బయట బస్సులు లేకపోవడంతో షేర్ ఆటో, ట్యాక్సీలను ఆశ్రయించారు.

 ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), చర్చిగేట్, లోయర్‌పరేల్, ఎల్ఫిన్‌స్టన్ రోడ్, దాదర్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, అంధేరీ తదితర ప్రాంతాల్లో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు బస్సులు లేక ఇబ్బందులకు గురయ్యారు. ట్యాక్సీ, ఆటో స్టాండ్‌ల వద్ద పొడుగాటి క్యూలు పెరిగాయి. అనుకోకుండా ఏదైన ఓ ట్యాక్సీ అటువస్తే దానికోసం ఉరుకులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలు, వృద్థులు, వికలాంగులు, గర్భిణీల వెతలు వర్ణనాతీతంగా మారాయి.

 దూరప్రాంత ప్రయాణికులకు తిప్పలు...
 దూరప్రాంతాల నుంచి ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైలు దిగిన ప్రయాణికులు ట్యాక్సీలు, ఆటోల కోసం పిల్లపాపలు, లగేజీతో స్టేషన్ బయట వడిగాపులు కాశారు. ట్యాక్సీలు, ఆటోలన్నీ నగర రహదారులపై బిజీగా ఉండడంతో రైల్వే స్టేషన్ ఛాయలకు రాలేకపోయాయి. ఇటు బస్సులు లేక, అటు ట్యాక్సీలు, ఆటోలు రాక నరకయాతన అనుభవించారు. ఇళ్లకు చేరుకునేందుకు నానా తంటాలు పడ్డారు.

 బెస్ట్ కార్మికులకు మద్దతుగా ఆటో, ట్యాక్సీలు..
 బెస్ట్ కార్మిక యూనియన్ తీసుకున్న నిర్ణయానికి బెస్ట్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బెస్ట్ కార్మిక నాయకుడు శరద్ రావ్ నేతృత్వంలో ట్యాక్సీ, ఆటోలు కూడా బుధవారం సమ్మెలో పాల్గొని మద్దత్వినున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement