నిన్న క్లోనింగ్... నేడు స్ఫూఫింగ్ | Cloning yesterday ... today sphuphing | Sakshi
Sakshi News home page

నిన్న క్లోనింగ్... నేడు స్ఫూఫింగ్

Published Sun, Nov 16 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

నిన్న క్లోనింగ్... నేడు స్ఫూఫింగ్

నిన్న క్లోనింగ్... నేడు స్ఫూఫింగ్

గాలం
 
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కొత్త తరహా నేరం వెలుగులోకి వచ్చింది. టార్గెట్ చేసిన వ్యక్తుల్ని నేరుగా కలవకుండా, ఏమాత్రం శారీరక శ్రమ లేకుండా ‘కిడ్నాప్’ చేసేస్తున్నారు. ఆపై వారి కుటుంబీకులకు ఫోన్ చేసి డబ్బు దండుకుంటున్నారు. హైటెక్ పద్దతిలో జరుగుతున్న ఈ డ్రామా వెనుక ఆసక్తికరమైన, అప్రమత్తంగా ఉండవలసిన అంశాలెన్నో ఉన్నాయి.
 
ముంబైలో సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న పలువురికి ఇటీవల +371, +375తో మొదలయ్యే నెంబర్ల నుంచి ఫోన్లు, మిస్ట్ కాల్స్ వచ్చాయి. వీటిని స్పందించిన, కాల్ బ్యాక్ చేసిన వారిలో హైఎండ్ ఫోన్లు వినియోగిస్తు వారి ఫోన్లలో ఉన్న కాంటాక్ట్స్ లిస్ట్‌ను ముష్కరులు సంగ్రహించేశారు. హ్యాండ్‌సెట్‌ను ఫోన్ కాల్ ద్వారా హ్యాక్ చేయడంతో ఇది సాధ్యమౌతోంది.
 
తర్వాతేం జరుగుతుందంటే...

టార్గెట్‌గా పెట్టుకున్న వ్యక్తికి ‘స్ఫూఫింగ్’ విధానంలో ఫోన్ చేస్తున్న దుండగులు సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ వచ్చినట్లు భ్రమ కలిగిస్తారు. ఇంటర్‌నెట్ ద్వారా చేసే ఈ ఫోన్‌కాల్‌ను అందుకున్న వ్యక్తికి సర్వీస్ ప్రొవైడర్‌కు చెందిన నెంబరే డిస్‌ప్లే అవుతుంది. కాల్ సెంటర్ ఉద్యోగుల మాదిరిగా మాట్లాడుతూ ‘మీ నెంబర్‌కు 20 నుంచి 30 జీబీ ఇంటర్‌నెట్ డేటా ఉచితంగా ఇస్తున్నాం’ అంటూ వల వేస్తారు. ఈ మాటలు నమ్మిన వారికి ఆఫర్ అమలు వర్తించాలంటే గంట నుంచి రెండు గంటల పాటు ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసి ఉంచాల్సివస్తుంది. ఆఫర్‌కు ఆశపడి ఎవరైనా ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేస్తే అప్పుడు సైబర్ నేరగాళ్లు అసలు వ్యవహారం మొదలుపెడతారు.
 
ముందే సంగ్రహించిన కాంటాక్ట్స్ ఆధారంగా వారి తల్లిదండ్రులు, సంబంధీకుల నెంబర్లను తెలుసుకున్న దుండగులు వారికి కాల్ చేసి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశామంటూ బెదిరిస్తారు.. కంగారుపడిన కుటుంబీకులు సంబంధీకులతో మాట్లాడాలని ప్రయత్నించి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో కంగారుపడిపోతారు. కొద్దిసేపటికే దుండగులు మరోసారి ఫోన్ చేసి బందీని సురక్షితంగా విడిచిపెట్టడానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు డిమాండ్ చేసి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటారు. నిర్ణీత సమయం తరవాత తమ ఫోన్ స్విచ్ఛాన్ చేసిన ‘ఆఫర్ పొందిన వ్యక్తులు’ జరిగింది కుటుంబీకుల ద్వారా తెలుసుకుని పోలీసుల వద్దకు పరుగుపెడతారు.
 
ఇలా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగుల నుంచి వచ్చిన ఫోన్ నెంబర్లలో + 371, +375తో కూడినవి  లాట్వియా, ఆఫ్ఘనిస్థాన్‌లోని బెలారస్‌లకు చెందినవిగా గుర్తించారు. నగదు జమవుతున్న బ్యాంకు ఖాతాలు తప్పుడు చిరుమానాలతో తెరిచినట్లు, వాటిలో జమ అయిన మొత్తాలను ఏటీఎం కేంద్రాల ద్వారా డ్రా చేసినట్లు నిర్ధారించుకున్నారు.
 
ఏమిటీ స్ఫూఫింగ్..?

ఇంటర్‌నెట్‌లో విరివిగా లభిస్తున్న కాల్ స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్ వల్లే ఇలాంటివి సాధ్యం. ఒకప్పుడు శత్రుదేశాల నిఘా సంస్థలు, ఉగ్రవాదులకు మాత్రమే పరిమితమై ఉన్న ఈ టెక్నాలజీ ఇప్పుడు మోసగాళ్లు, సైబర్ నేరగాళ్లు కూడా వినియోగించేస్తున్నారు. కేవలం కాల్ స్ఫూఫింగ్ మాత్రమే కాకుండా ఈ-మెయిల్స్ స్ఫూఫింగ్‌కు పాల్పడుతూ ఉద్యోగాల పేరుతో ఎర వేసి మోసం చేస్తున్నారు.  ఒకప్పుడు సిమ్‌కార్డుల క్లోనింగ్ జోరుగా జరిగేది. అంటే మీ సిమ్‌కార్డును పోలినదాన్ని మరోటి సృష్టించి అక్రమంగా వినియోగించడం. దాని ద్వారా చేసే ఫోన్ కాల్స్ అన్నీ మీ నెంబర్ నుంచే వెళ్తాయి.

ఇలా చేయడానికి కచ్చితంగా సిమ్‌కార్డుకు సంబంధించిన ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ (ఐఎంఎస్‌ఈ) నెంబర్ తెలిసి ఉండటం తప్పనిసరి. దీన్ని తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అయినప్పటికీ అనేక సందర్భాల్లో సిమ్‌కార్డు క్లోనింగ్స్ చోటు చేసుకున్నాయి. ఈ విధానాన్ని తలదన్నేదిగా ఇంటర్‌నెట్‌లో అందుబాటులోకి వచ్చిందే స్ఫూఫింగ్.  కొన్నేళ్ల క్రితం సదరా కోసం ‘సాఫ్ట్ మేధావులు’ రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు ఉగ్రవాదులు, అసాంఘికశక్తులతో పాటు మోసగాళ్లుకు సైతం వరంగా మారింది.
 
స్ఫూఫింగ్ చేస్తారిలా...

నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్‌వేర్, సదుపాయాన్ని అందించే వెబ్‌సైట్లు ఇంటర్‌నెట్‌లో అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇది ఇంటర్‌నెట్ ద్వారా చేసే కాల్. దీనిలోకి ఎంటర్ అయిన తరవాత సదరు వ్యక్తి ఫోన్ నెంబర్‌తో పాటు ఫోన్‌కాల్‌ను అందుకోవాల్సిన వ్యక్తిది, ఫోన్ రిసీవ్ చేసుకునేప్పుడు ఇతడికి సెల్‌ఫోన్‌లో ఎవరి నెంబర్ డిస్‌ప్లే కావాలో అది కూడా పొందుపరుస్తారు. ఇదే రకంగా ఈ-మెయిల్ ఐడీ స్ఫూఫింగ్ వెబ్‌సైట్లలో మెయిల్ ఐడీలను రిజిస్టర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రముఖ కంపెనీ నుంచి కాల్ చేసినట్లు, ఆయా కంపెనీలే ఈ-మెయిల్ పంపినట్లు భ్రమ కలిగించొచ్చు. ఈ ‘స్ఫూఫర్ల’కు అడ్డుకట్ట వేయడం ఎలా అనే విషయంపై ఇటు పోలీసులు, అటు సైబర్ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.

- శ్రీరంగం కామేష్, ‘సాక్షి’ ప్రతినిధి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement