భూదాహం
- రూ. 30 కోట్ల ఆస్తి కోసం తెలుగు తమ్ముళ్ల ప్రచ్ఛన్న యుద్ధం
- రాజధానికి చేరిన వివాదం
- 15ఎకరాలపై ఇరువర్గాల కన్ను
- దేవాలయ భూములంటున్న ఒక వర్గం.. కాదంటున్న మరో వర్గం
- తహశీల్దార్ విచారణ.. కలెక్టర్‌కు నివేదిక
విజయవాడ : తెలుగు తమ్ముళ్లు భూకబ్జాలకు తెగబడుతున్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, జమీందారీ ఆస్తులపై కన్నేసి గద్దల్లా కారాడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తాత్కాలిక రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు పోటాపోటీగా భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీ వలి కాలంలో జిల్లాలో భూముల విలువలు విపరీతంగా పెరగటంతో పలువురు టీడీపీ నేతలు తమ అనుచరులతో కృష్ణా జిల్లాలో అందుకు జల్లెడపడుతున్నారు. జిల్లాలో జమీందారులు దానధర్మాలు చేసిన భూములను టార్గెట్‌గా చేసుకుని సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి పేషీ నుంచే తెలుగుదేశం నాయకులు పావులు కదుపుతున్నారు.
కోట్ల విలువ చేసే ఈ భూములను కొల్లగొట్టేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. విజయవాడకు సమీపంలోని గన్నవరం, నూజివీడు తదితర ప్రాంతాలలో పురాతన భూముల గురించి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం. నూజివీడు సమీపంలో సుంకొల్లు, గన్నవరం సమీపంలో వెదురుపావులూరులలో రాజుల కాలం నాటి భూములను గుర్తించి వాటిని రెవెన్యూ శాఖ ద్వారా దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సుంకోల్లు దేవాదాయ భూములపై రహస్యంగా ఫైళ్లు కదులుతుండగా వెదురుపావులూరు భూముల వివాదం బజారున పడి రాజధానికి చేరింది.
సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరులమంటూ కొందరు జిల్లాలోని జమిందారీ భూముల గురించి ఆరా తీసి రికార్డులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వెదురుపావులూరు గ్రామంలో ఉన్న 15 ఎకరాల పురాతన ఆస్తులపై వారు దృష్టి సారించటంతో వివాదం చెలరేగింది. తీరా ఆ భూములు టీడీపీకి చెందిన వారి చేతుల్లో ఉండటంతో తెలుగు తమ్ముళ్లు వాటికోసం పరస్పరం తలపడుతున్నారు.
15 ఎకరాల కోసం...
వెదురుపావులూరు గ్రామంలో ఆర్‌ఎస్ నంబరు 895లో 15 ఎకరాల భూమి ఉంది. దీని విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. 1997 నుంచి వేరొకరి ఆధీనంలో ఉన్న ఈ భూములు యనమదల గ్రామంలో శ్రీ సీతారామాంజనేస్వామి ఆలయానికి చెందిన భూములని రెవెన్యూ మంత్రి అనుచరులు వాదిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి గన్నవరం తహశీల్దార్ చాంబర్‌లోకి చొరబడి తాను రెవెన్యూ మంత్రి పీఏను అంటూ సదరు ఆస్తులపై ఆరా తీస్తుండగా వివాదం చెలరేగింది. తహశీల్దార్ మాధురి ఫిర్యాదుపై ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆస్తులు యనమదల గ్రామానికి చెందినవని వాటిని స్వాధీనం చేసుకుని ఆ గ్రామస్తులకు అప్పగించాలని పది రోజుల క్రితం రెవెన్యూ మంత్రి పేషీ నుంచి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి.
ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ భూములపై విచారణ జరిపి నివేదిక తయారుచేశారు. మరోవైపు 1997 నుంచి ఆ భూములు గన్నవరానికి చెందిన గొంది పరంథామయ్య, పత్తిపాటి శ్రీనివాసరావు తదితరుల స్వాధీనంలో ఉన్నాయి. రెవెన్యూ మంత్రి అనుచరులు అక్రమంగా తమ భూములు స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాలూ టీడీపీకి చెందిన వారే కావటంతో వారి మధ్య ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది.
ఆ భూములు ఏ దేవస్థానానికి సంబంధించినవీ కావని, గన్నవరానికి చెందిన టీడీపీ నేతలు రెవెన్యూ అధికారులకు రికార్డులు చూపిస్తున్నారు. తాము కొండా లక్ష్మీనర్సు, కొండా ఫణిరాజు, కాట్రుపాటి శేషాచలం, కాట్రుపాటి లక్ష్మీనరసింహారావు తదితరుల నుంచి 1997లో కొనుగోలు చేశామని వారు చెబుతున్నారు. రాజుల కాలంలో సంక్రమించిన వారి నుంచి ఆస్తులు కొనుగోలు చేశామని, అందుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని వారు చెబుతున్నారు.
ఈ భూములు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏ దేవాలయానికి సంబంధించినవి కావని వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల నుంచి సమాచార హక్కు చట్టం కింద పొందిన పత్రాలను చూపిస్తున్నారు. అదే విధంగా యనమదల గ్రామంలో శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానానికి వెదురుపావులూరులో ఎటువంటి ఆస్తులు లేవని కూడా వారు దేవాదాయ శాఖ నుంచి సర్టిఫికె ట్ కూడా పొందారు.
వివాదం రేపిన ఎఫ్‌ఎల్‌ఆర్ రిజిస్టర్
ఇదిలా ఉంటే.. 1950కి పూర్వం ఉన్న ఎఫ్‌ఎల్‌ఆర్ రెవెన్యూ రిజిస్టర్ వివాదం రేపింది. ఆ రిజిస్టర్‌లో యనమదల సీతారామస్వామి ధర్మకర్తలు కాట్రు శేషాచలపతిరావు వగైరాల భూమిగా రాసి ఉంది. వారి కుటుంబ సభ్యుల నుంచి గన్నవరానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేశారు. తాజాగా పురాతన భూమి రికార్డు చూసిన యనమదల గ్రామస్తులు ఆ భూమి తమ దేవాలయానిదేఅంటూ రెవెన్యూ మంత్రి అనుచరులను కలిశారు.
యనమదల సీతారామస్వామి ఆలయానికి తాము మరమ్మతులు చేసి సీతారామాంజనేయస్వామి ఆలయంగా మార్చామని, ఆ భూములు తమకే దక్కుతాయని వారు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అడంగళ్లలో కూడా ఆలయ భూములుగా ఉన్నాయని యనమదల గ్రామస్తులు చెబుతున్నారు. కాగా.. రెవెన్యూ మంత్రి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు గన్నవరం తహశీల్దార్ మాధురి సదరు ఆస్తులపై పంచనామా చేశారు. గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. రెవెన్యూ పాత రికార్డులను కూడా పరిశీలించారు. ఈ భూములపై నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపారు.