ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటికి నోటీసు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని టార్గెట్ చేసి మరోమారు పోలీసులు కక్షసాధింపు చర్యలకు తెరతీశారు. కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న ప్రతి సందర్భంలోనూ బెట్టింగ్ కేసుల్లో విచారణ అంటూ హడావుడిచేసి రాజకీయంగా ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తాజాగా బుధవారం ఎమ్మెల్యే కోటంరెడ్డికి పోలీసులు నోటీసు ఇవ్వడానికి వెళ్లడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అది కూడా గతేడాది మార్చిలో నమోదైన ఓ కేసులో విచారణకు ఇప్పుడు పిలవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉదయం 7.45 గంటకు నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో పోలీసుల బృందం ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇంటికి వెళ్లారు. ఉదయం 7.30గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం కీలకపరిణామాలు చోటుచేసుకున్నాయి.
అసలు ఏం జరిగిందంటే..
ఉదయం 7.45 గంటలకు నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ నేతృత్వంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ రాఘవరెడ్డి, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్.సుధాకర్, ఇన్‌స్పెక్టర్ల బృందం చిల్డ్రన్స్‌పార్కు రాంజీవీధి సాయి సౌజన్య హోమ్స్ అపార్ట్‌మెంట్‌లోని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. రెండోనగర పోలీసుస్టేషన్‌లో నమోదైన 54/2017కేసులో 7.30 గంటలకు బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీచేశారు. దీనిపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.30గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొని 7.45 గంటలకు నోటీసు జారీచేయడం ఏమిటని ప్రశ్నించారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు ఫోన్ చేసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఓ పథకం ప్రకారమే ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిని తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇంతలో నగర డీఎస్పీ ఆదేశాల మేరకు నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. గంటసేపు మల్లగుల్లాలు పడిన పోలీసు అధికారులు గురువారం ఉదయం 9 గంటలకు విచారణ కోసం బాలాజీనగర్ పోలీసుస్టేషన్‌కు రావాలని రెండో నోటీసును జారీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
కేసు ఇదేనట
గతేడాది మార్చి 22వ తేదీన నెల్లూరు తూర్పు రైల్వేక్వార్టర్స్‌లో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు అప్పటి రెండోనగర ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడిచేశారు. దాడిలో బెట్టింగ్ నిర్వాహకులైన జెండావీధికి చెందిన షేక్ రషీద్, రాజీవ్‌గృహకల్పకు చెందిన ఎ.శ్రీనివాసులతో పాటు పంటర్లు రవి, శివ, శ్రీకాంత్, ప్రభు, మనోజ్, వెంకి, రామారావు, జనార్దన్, సతీష్, గణేష్, అక్రమ్, అంకిత్, జ్ఞానయ్యపై 3అండ్4 ఏపీ గేమింగ్ యాక్ట్ కింద(ఎఫ్‌ఆర్‌నెం.54/17)కేసు నమోదు చేశారు. దాడి సమయంలో శ్రీనివాసులు దొరకడంతో అతడ్ని పోలీసులు అరెస్ట్‌చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి పలువుర్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఏడాది అనంతరం సదరు కేసులో మీ ప్రమేయం ఉందంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి నోటీసులు జారీచేయడం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసు నిర్వహించిన సీఐ బదిలీపై వెళ్లిపోయారు. అప్పుడు ఎస్పీగా విశాల్‌గున్నీ ఉన్నారు. ఏడాది తర్వాత కేసులో ప్రమేయం ఉందని పేర్కొనడం వెనుక పోలీసులు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఓ పథకం ప్రకారం ఎమ్మెల్యేను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవసరమైతే ఆమరణదీక్షకు కోటంరెడ్డి
క్రికెట్ బెట్టింగ్ కేసులో గురువారం ఎమ్మెల్యేను విచారించడానికి వీలుగా పోలీసులు నోటీసులు జారీచేశారు. కక్షసాధింపు చర్యలను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యే తన అనుచరులతో బుధవారం సమావేశమయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక, ప్రస్తుతం రాజ్యసభ నామినేషన్ల సమయంలో కేసుల్లో విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పేర్కొన్న ఎమ్మెల్యే గురువారం విచారణకు హాజరయ్యేది లేదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అం దులో భాగంగా తన కార్యాలయంలో కార్యకర్తలతో ఉండనున్నట్లు తెలిసింది. పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తే కార్యాలయం నుంచే ఆమరణదీక్షకు పూనుకోనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment