దొరికి...తప్పించుకున్నారు..!
చోరీ చేసిన వాహనంపై స్నాచింగ్‌లు
అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై దాడి
కానిస్టేబుల్ వాహనంతో పారిపోయిన దుండగులు
దుండగులను గుర్తించిన పోలీసులు
ఒంటరిగా నడుచుకుంటువెళ్తున్న మహిళను ఇద్దరు వ్యక్తులు టార్గెట్ చేశారు.ఆమె వెనకాలే వెళ్తున్న వారిని ఓ కానిస్టేబుల్ గుర్తించి.. స్కూటీపై అనుసరించాడు.. అరగంటపాటు వారి వ్యవహార శైలిని గమనించిన ఆయన ఎవరు మీరు అని నిలదీశాడు..దీంతో వారు కానిస్టేబుల్‌పై దాడి చేసి అతని వాహనంపైనే పరారయ్యారు.. ఈ సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది.. వివరాలు ఇలా ఉన్నాయి..
నాగోలు: సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సమ్మయ్య సోమవారం మధ్యాహ్నం కర్మన్‌ఘాట్ ఆంప్రోకాలనీలోని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం (ఏపీ25ఏఎం 0642)పై ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని ఆమె వెనుకాల వెళ్తుండటాన్ని గమనించిన కానిస్టేబుల్ వారిని స్కూటీ (టీఎస్08ఈజే 7564)పై అనుసరించాడు. బైరామల్‌గూడ సమీప కాలనీల్లో అతను వారి వెంట వెంటపడ్డాడు. బైరామల్‌గూడ చెరువు సమీపంలో రాగానే నిందితులకు బైకు అడ్డం పెట్టి ఆపి వారి వివరాలను ఆరా తీశారు.వారు ప్రయాణిస్తున్న పల్సర్ తాళంచెవిని స్వాధీనం చేసుకున్నాడు. అయితే సమ్మయ్య మఫ్టీలో ఉండడంతో స్నాచర్లు అతనితో గొడవకు దిగారు. దీంతో వీరి మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. ఒక వ్యక్తిని పట్టుకుని తాను పోలీసునని, వీరు దొంగలని అరచినా స్థానికులు అతనికి సహకరించకపోవడంతో స్నాచర్లు సమ్మయ్యను పక్కకు తోసేసి అతని స్కూటీపై పారిపోయారు.
దీనిపై సమ్మయ్య ముందుగానే సరూర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించినా వారు సకాలంలో స్పందించకపోవడంతో దొంగలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు, క్రైం సిబ్బంది దొంగలు వదిలేసిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ సంఘటనపై ఎల్‌బీనగర్ సీఐ కాశిరెడ్డి, కానిస్టేబుల్ సమ్మయ్యలను సైబరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ తన కార్యాలయానికి పిలిచి వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
చోరీ చేసిన వాహనంపైనే స్నాచింగ్‌లు...
సీసీ కెమెరాల ఆధారంగా కానిస్టేబుల్‌పై దాడిచేసిన వారు పాత నేరస్తులని పోలీసులు గుర్తించారు. దొంగలు వదిలేసిన ద్విచక్ర వాహనం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నామానంద గ్రామానికి చెందిన శ్రీకాంత్‌దిగా గుర్తించారు. ఈ వాహనం 2014 జూన్, 30న నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీకి గురైంది. అప్పటి నుంచి నిందితులు ఈ వాహనంపైనే స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎల్‌బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు తెలిపారు. కానిస్టేబుల్ సమ్మయ్య స్నాచర్లను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు.