లక్ష్యం రూ.17 వేల కోట్లు.. ఇచ్చింది రూ.6 వేల కోట్లు | Target of Rs17,000 crore given Rs 6,000 crore | Sakshi
Sakshi News home page

లక్ష్యం రూ.17 వేల కోట్లు.. ఇచ్చింది రూ.6 వేల కోట్లు

Published Fri, Aug 5 2016 2:21 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

Target of Rs17,000 crore given Rs 6,000 crore

ఖరీఫ్ రుణాల పంపిణీలో బ్యాంకుల మొండిచెయ్యి
వర్షాలు ఊపందుకోవడంతో పెద్ద్ద ఎత్తున రైతుల రాక

హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఖరీఫ్ పంటల సాగులో రైతులు మునిగిపోయారు. మరోవైపు రుణాల కోసం రైతులు బ్యాంకులకు పోటెత్తుతున్నారు. బ్యాంకుల్లో మాత్రం సకాలంలో రుణాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవైపు సాంకేతిక సమస్యలు... మరోవైపు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకులు రైతులకు మొండిచెయ్యి చూపిస్తున్నాయి.

ఈ ఖరీఫ్‌లో బ్యాంకులు రూ. 17,460 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు రూ. 6,114 కోట్లకు మించి ఇవ్వలేదు. అంతేకాదు మొత్తం 36 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటారని అంచనా వేయగా...  13.50 లక్షల మందికే రుణాలు ఇచ్చినట్లు అధికారులు తేల్చారు. ఖరీఫ్ కీలక తరుణంలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు అప్పుల వైపు వెళ్లకతప్పడంలేదు.

ఆన్‌లైన్ నమోదుతో మరింత ఆలస్యం...
రైతులకు పంట రుణాలు విడుదల చేయడంలో సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయని బ్యాంకులు వ్యవసాయ శాఖకు చెబుతున్నాయి. బ్యాంకుల్లో సిబ్బంది కొరత కూడా కారణమేనని అంటున్నారు. ఆన్‌లైన్ కారణంగా రైతుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేయాల్సి వస్తోంది. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియకు అధిక సమయం తీసుకుంటుండటంతో రైతుల తాకిడిని తట్టుకునే పరిస్థితి లేకుండాపోయింది. వర్షాలు ఎక్కువగా కురుస్తుండటంతో పెద్ద ఎత్తున రైతులు బ్యాంకులకు తరలి వస్తున్నారు. ఆన్‌లైన్ సమస్య కారణంగా తక్కువ మందికే రుణాలు ఇస్తున్నామని బ్యాంకు వర్గాలు వ్యవసాయశాఖకు విన్నవించాయి. సాధారణంగా చేతి రాతతో రుణాలు ఇచ్చేట్లయితే ఇంత సమస్య ఉండేది కాదని అంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement