భారత్‌కు మళ్ళీ టెర్రర్ ముప్పు?
దేశానికి మరోసారి ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిఘావర్గాలకు అందిన సమాచారం నిజమైతే.. భారీ ఎత్తున దాడులు చేసేందుకు ఉగ్రవాదులు పక్కాగా ప్లాన్ చేశారు. పెద్దమొత్తంలో ఆయుధాలతో ఉగ్రవాదులు కశ్మీర్‌వైపు కదులుతున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందంది. వాళ్లు ప్రధానంగా అర్ధరాత్రి సమయంలోనే కదులుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పాకిస్తాన్ నుంచి ఉగ్రదాడుల ముప్పు ఉందంటూ పంజాబ్ లోని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ వెల్లడించారు. ఢిల్లీ పోలీసుల నుంచి అందిన సమాచారంతో హై అలర్ట్ ప్రకటించారు. మందుగుండు సామగ్రితో కూడిన ఓ కారుతో పాటు ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదులు ఢిల్లీ, ముంబై, గోవాలే లక్ష్యంగా చొరబడే ప్రయత్నంలో ఉన్నట్లు ఏజెన్సీల నుంచి తమకు వార్తలు అదినట్లు అధికారులు చెబుతున్నారు.
ఓ బూడిద రంగు స్విఫ్ట్ డిజైర్ కారులో (నెం.జెకె-01 ఏబీ-2654) ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులతో పాటు, ఓ కాశ్మీరీ కూడా ప్రయాణిస్తున్నట్లు తమకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల నుంచి సమాచారం అందిందని చండీగఢ్ శాంతిభద్రతల డీజీపీ తెలిపారు. దాడులకు కావలసిన ఆయుధాలతో పాటు, మందుగుండు సామగ్రిని కూడా ఉగ్రవాదులు తీసుకెళ్తున్నారని, వారి వద్ద బహుశా ఆత్మాహుతి బెల్ట్ కూడ ఉన్నట్లు పోలీసుల సమాచారం ప్రకారం తెలుస్తోందని ఆయనన్నారు. ఆయుధాలు, సామగ్రితో కూడిన ఆ ప్రత్యేక వాహనంలో పాక్ తీవ్రవాదులు బుధవారం రాత్రి తర్వాత బనిహాల్ టన్నెల్ దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని, మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని డీజీపీ వివరించారు.