అనూహ్య హత్యకు సుపారీ ఇచ్చారా?
సాక్షి, ముంబై: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్యను తెలిసినవారే హత్య చేశారా? అందుకు సుపారీ (డబ్బులు) కూడా ఇచ్చారా? ముంబై పోలీసులు ఈ దిశగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య మృతదేహం లభించి 18 రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో పెద్దగా పురోగతి సాధించలేదు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోయినా అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జనవరి 4న అనూహ్యకు భోజనం అందించిన ఆమె స్నేహితుడు హేమంత్ పాత్రతోపాటు ఆమెకు తెలిసినవారి గురించి ఆరా తీస్తున్నారు.
అనూహ్యను తెలిసినవారే నేరుగా హత్య చేయనప్పటికీ ఎవరికైనా డబ్బులిచ్చి చేయించారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్టేషన్‌లో దిగిన తర్వాత ఎవరైనా దుండగులు అపహరించి తీసుకువెళ్లారా.. అనూహ్య ప్రతిఘటించడంతో చంపేసి, రోడ్డు పక్కన పొదల్లో వదిలేసి పారిపోయారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అనూహ్య కుర్లా రైల్వేస్టేషన్ లో దిగిన తర్వాత ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్లింది. ఆ సమయంలో ఎవరితో మాట్లాడిందో తెలి స్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు లు చెబుతున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే కీలక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.