పెట్రోలు దొంగల అరెస్ట్
Published Mon, Apr 3 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
రాజంపేట రూరల్: గూడ్స్ వ్యాగిన్లు, ట్యాంకర్ల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దొంగలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ను దొంగలించే కనకయ్య, ఓబులమ్మను డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల ఎదుట సోమవారం హాజరు పరిచారు. డీఎస్పీ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడపలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతానికి చెందిన కనకయ్యశెట్టి, అంగడివీధికి చెందిన పెద్దఓబులమ్మ గతంలో కడప రైల్వేస్టేషన్ దగ్గర ఆగే గూడ్స్ వ్యాగిన్ల నుంచి పెట్రోలు, డీజిల్‌ను దొంగలించి లారీలు, ఆటోలకు అమ్ముకుంటుండే వారు. ఇటీవల కాలంలో కడప రైల్వేస్టేషన్ దగ్గర నుంచి ఐఓసీ, హెచ్‌పీసీఎల్ కంపెనీలను ఎత్తివేసి భాకరాపేట వద్ద హెచ్‌పీసీఎల్ కంపెనీని స్థాపించి, అక్కడి నుంచే పెట్రోలు, డీజిల్‌ను ట్యాంకర్ల ద్వారా పెట్రోలు బంకులకు సరఫరా చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ను దొంగలించడానికి అలవాటు పడ్డ కనకయ్యశెట్టి, పెద్దఓబులమ్మ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లకు డబ్బును ఎరగా చూపి.. హెచ్‌పీసీఎల్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ట్యాంకర్ల నుంచి అక్రమంగా తీసుకునే వారు. లారీలకు, ఆటోలకు పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధర కంటే ఒకటి, రెండు రూపాయలకు తగ్గించి అమ్ముకునే వారు. కొందరు అందించిన సమాచారం మేరకు ఈ విషయంపై కూపీ లాగగా అక్రమ దందా వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. ఈ చోరీలో కనకయ్యశెట్టి రెండవ భార్య వెంకటసుబ్బమ్మ అలియాస్ బుజ్జమ్మ సహకారం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు సహకరించిన గుంతకల్లుకు చెందిన ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్లు అయిన చంద్రశేఖర్, రఫిక్, ఆరీఫ్, ఎస్‌ఏ.ఖాదర్, ఖాదర్‌వలీ, మహమ్మద్, జిలానీ, అస్లాంబాషా, షఫి, అబ్దుల్‌రహిమాన్, వీరేష్, శివను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో ఒంటిమిట్ట సీఐ రవికుమార్, సిద్దవటం ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారని వివరించారు.
Advertisement