ఆక్సిజన్‌ వచ్చేసింది  | Oxygen Tankers Reached From Odisha To Telangana | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ వచ్చేసింది 

Published Mon, Apr 26 2021 8:20 PM | Last Updated on Tue, Apr 27 2021 12:44 AM

Oxygen Tankers Reached From Odisha To Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రోగుల కు అవసరమైన ఆక్సిజన్‌ కొరత లేకుండా చేసే దిశగా ప్రభుత్వ యత్నాలు ఫలించాయి. ఒడిశా నుంచి రాష్ట్రానికి తొలిదఫా 6 ట్యాంకర్లలో 110 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ చేరుకుంది. ట్యాంకర్లు రోడ్డు మార్గాన ఒడిశాలోని అం గూల్‌ ప్లాంట్‌కు వెళ్లి, తిరిగి వచ్చేందుకు వారం రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వేగంగా ఆక్సిజన్‌ రప్పించేందుకు ఖాళీ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో ఒడిశాకు తరలించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌ నింపుకొని రాష్ట్రానికి చేరుకున్న ట్యాం కర్లను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పంపించినట్టు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. 

సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో.. 
రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం, ఆక్సిజన్‌ కొరత మొదలయ్యే పరిస్థితిలో వెంటనే ఎయిర్‌ఫోర్స్‌ సహాయంతో ఆక్సిజన్‌ తెప్పించాలని సీఎం నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాష్ట్ర అధికారులు.. ఎయిర్‌ఫోర్స్‌ అధికారులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 విమానాల్లో తొమ్మిది ఖాళీ ట్యాంకర్లను ఈ నెల 23న హైదరాబాద్‌ నుంచి ఒడిశాలోని అంగూల్‌ ప్లాంట్‌కు పంపారు. ఈ ట్యాంకర్లు అక్కడ ఆక్సిజన్‌ నింపుకొని రోడ్డు మార్గంలో రాష్ట్రానికి బయలుదేరాయి. సోమవారం రాష్ట్రానికి చేరుకున్నాయి. మొదట్లో రూర్కెలా, అంగూల్‌ రెండు ప్లాంట్ల నుంచీ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని భావించినా.. రూర్కెలా ప్లాంట్‌ అక్కడి విమానాశ్రయానికి మరీ దూరంగా ఉండడంతో.. ప్రస్తుతానికి అంగూల్‌ ప్లాంట్‌ నుంచి ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 350 టన్నుల మేర ఆక్సిజన్‌ అవసరమని చెప్పారు. వంద టన్నుల మేర ఇక్కడ ఉత్పత్తి అవుతోందని, మరో 300 టన్నుల మేర దిగుమతి చేసుకోవాల్సి ఉందని వివరించారు. కేంద్రం ఒడిశా నుంచి రాష్ట్రానికి 250 టన్నుల ఆక్సిజన్‌ కేటాయించిందని, ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. 

ఆస్పత్రులకు ఆక్సిజన్‌.. 
రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్‌ను అవసరమైన ఆస్పత్రులకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్యాంకర్లలో ఒకదానితో గచ్చిబౌలిలోని టిమ్స్, ఛాతీ వైద్యశాల, కింగ్‌ కోఠి ఆస్పత్రులకు ఆక్సిజన్‌ అందించారు. ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా పరిస్థితి చేయి దాటుతుండడంతో.. అక్కడి రోగులను, కరోనా బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఆస్పత్రుల్లో పరిస్థితి చక్కబడనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్‌ కొరతతో ఇబ్బంది పడకుండా.. అవసరాల మేరకు సరఫరా చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. 


 
నేడు మరో ఎనిమిది ట్యాంకర్లు అంగూల్‌కు.. 
మంగళవారం మరో ఎనిమిది ఖాళీ ట్యాంకర్లను విమానాల ద్వారా ఒడిశాలోని అంగూల్‌ ప్లాంట్‌కు తరలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ట్యాంకర్లు ఆక్సిజన్‌ నింపుకొని ఈ నెల 30వ తేదీ నాటికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటాయని వెల్లడించాయి. వాటిలో సుమారు 120 టన్నుల ఆక్సిజన్‌ వస్తుందని వివరించాయి. కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరుగుతోందని, ఈ మేరకు కొరత తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నాయి. 
 
‘ఆక్సిజన్‌’ రథసారథులు ఆర్టీసీ డ్రైవర్లే 
ఒడిశాలోని అంగూల్‌లో ఆక్సిజన్‌ నింపుకొన్న ట్యాంకర్లను వందల కిలోమీటర్ల దూరం నడిపి భద్రంగా రాష్ట్రానికి తీసుకొచ్చింది ఆర్టీసీ డ్రైవర్లే. ఈ నెల 23న ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపిన విషయం తెలిసిందే. మండే స్వభావమున్న ఆక్సిజన్‌ను అంత దూరం నుంచి తరలించడం కత్తిమీద సాము వంటిది. ట్యాంకర్లను నిర్దేశిత వేగంతో జాగ్రత్తగా నడపాలి. ఇందుకోసం డ్రైవింగ్‌లో మంచి నైపుణ్యం ఉన్న సీనియర్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ 20 మంది డ్రైవర్లను ఎంపిక చేసింది. అందులో 10 మంది డ్రైవర్లు ఖాళీ ట్యాంకర్లతో విమానంలో ఒడిశాకు వెళ్లారు. విమానాశ్రయం నుంచి అంగూల్‌ ప్లాంట్‌కు ట్యాంకర్లతో వెళ్లి.. ఆక్సిజన్‌ నింపుకొని రాష్ట్రానికి తీసుకువచ్చారు. మంగళవారం ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో ఖాళీ ట్యాంకర్లతో మరికొందరు ఆర్టీసీ డ్రైవర్లు ఒడిశాకు వెళ్తున్నారు.   

చదవండి: మా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెట్టబోం
చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement