ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
Published Wed, May 17 2017 11:26 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
– జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ
కర్నూలు(అర్బన్): జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడిని నివారించేందుకు వీలుగా ఇప్పటికే 43 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ చెప్పారు. బుధవారం విజయవాడలోని ప్రభుత్వ సీఎస్ కార్యాలయం నుంచి పీఆర్, ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాగునీరు, ఇతర ప్రజా సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 36 కరువు మండలాలున్నాయని, ఇప్పటికే ఉపాధి హామీ ద్వారా 1.93 లక్షల మంది ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తున్నామని చెప్పారు.
ఉపాధి కూలీల బకాయిలు బ్యాంకుల్లో జమయ్యాయని, ప్రతి వారం బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహిస్తు బకాయిలు పెండింగ్ లేకుండా చూస్తున్నామని సమాధానమిచ్చారు. కాగా తాగునీటి పైప్‌లైన్లు, స్కీముల మరమ్మతులకు నాన్ సీఆర్‌ఎఫ్ కింద రూ.5.88 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని, ఇంకా నిధులు విడుదల కావాల్సి ఉందని చెప్పారు. ఆదోని డివిజన్‌లో నీటి ఎద్దడి అధికంగా ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటూ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ జే హరిబాబు, డ్వామా పీడీ డా.సీహెచ్ పుల్లారెడ్డి, డీపీఓ పార్వతీ పాల్గొన్నారు.
Advertisement