దగదర్తి (బిట్రగుంట): దగదర్తి మండలం ఉలవపాళ్ల నుంచి సున్నపుబట్టీ వరకు జాతీయ రహదారి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారింది. డీజిల్, పెట్రోల్ నుంచి వివిధ రకాల రసాయనాలకు సంబంధించి కొందరు అక్రమ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న దాబా హోటళ్లు, టైర్లకు పంక్చర్లు వేసే దుకాణాలు ఇందుకు వేదికగా మారుతున్నాయి.
వీటి పక్కనే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుంటున్న అక్రమార్కులు ట్యాంకర్ల నుంచి సేకరిస్తున్న డీజిల్, పెట్రోల్‌ను కిరోసిన్, ఇతర రసాయనాలతో కల్తీ చేసి గ్రామాల్లోని దుకాణాలకు తరలిస్తున్నారు. వీటితో పాటు కల్తీ పామాయిల్, ఎముకల నుంచి తీసిన ఆయిల్‌ను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి నాణ్యమైన పామాయిల్‌గా డబ్బాల్లో నింపి దాబా హోటళ్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఉలవపాళ్ల నుంచి సున్నపుబట్టి వరకూ ఆరు కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి అక్రమ స్టాక్ పాయింట్లు పది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో స్టాక్ పాయింట్ నుంచి పోలీసులకు నెలనెలా భారీ స్థాయిలో ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉలవపాళ్ల వద్ద దాబా హోటల్ పక్కనే ఉన్న పెట్రోల్, డీజిల్ అక్రమ స్టాక్ పాయింట్‌పై కొద్ది నెలల క్రితం ఫిర్యాదులు వెల్లువెత్తడంతో దగదర్తి రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. డీజిల్, పెట్రోల్‌ను భారీ స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. అంతలోనే నిర్వాహకులు తమదైన శైలిలో పావులు కదపడంతో కేసు లేకుండానే వదిలేశారు. ప్రస్తుతం ఈ స్టాక్ పాయింట్‌లోరోజూ 500 నుంచి వెయ్యి లీటర్ల వరకూ డీజిల్, పెట్రోల్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
డీజిల్, పెట్రోల్ సేకరించేదిలా..
నెల్లూరు వైపు వెళ్లే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లతో అక్రమ స్టాక్ పాయింట్ నిర్వాహకులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ బయలుదేరిన వెంటనే డ్రైవర్ స్టాక్ పాయింట్ నిర్వాహకుడికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. అనంతరం స్టాక్ పాయింట్ల వద్ద ట్యాంకర్లను నిలిపి 25 లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ సేకరిస్తారు. ఇందుకు గాను డ్రైవర్, క్లీనర్‌లకు లీటరు డీజిల్‌కు రూ.35, పెట్రోల్‌కు రూ.45 వంతున చెల్లిస్తారు. ఇలా సేకరించిన పెట్రోల్, డీజిల్‌ను కిరోసిన్, ఇతర రసాయనాలతో కల్తీ చేసి గ్రామాల్లోని విక్రేతలకు డీజిల్ లీటరు రూ.50 వంతున, పెట్రోల్ రూ.60 వంతున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈఅక్రమ స్టాక్ పాయింట్‌లపై ఎస్పీకి నేరుగా ఫిర్యాదులు అందటంతో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది రహస్యంగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
దాడులు నిర్విహ స్తాం..
గతంలో ఉలవపాళ్లలో పెట్రోల్, డీజిల్ అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాం. కేసులు కూడా నమోదు చేశాం. ఇటీవల కాలంలో మళ్లీ విక్రయాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. మరోమారు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ దందాను అడ్డుకుంటాం. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుంటాం.
-వెంకట్రావు, దగదర్తి ఎస్‌ఐ
జాతీయ రహదారిపై స్టాక్ దందా
Published Mon, Dec 22 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement