
ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది
ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి
తిరుపతి కల్చరల్: అలిపిరికి సమీపంలో టీటీడీకి విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న ముంతాజ్ హోటల్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో సాధువులు, మఠ, పీఠాధిపతులు పెద్ద ఎత్తున బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలకు సమీపంలో ముంతాజ్ హోటల్‌కు అనుమతి ఇవ్వడం దుర్మార్గమన్నారు. దీనిపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విడ్డూరమన్నారు. తాము అధికారంలోకి వస్తే తిరుమలను ప్రక్షాళన చేసి ధర్మాన్ని కాపాడతామని నాడు చంద్రబాబు ప్రకటించారని, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వారాహి డిక్లరేషన్, సనాతన ధర్మ రక్షణే లక్ష్యం, సనాతన ధర్మ రక్షణ బోర్డు తెస్తాం అంటూ ప్రగల్భాలు పలికారన్నారు.
వీరిని నమ్మి తాము ధర్మ రక్షణ కోసం మద్దతు పలికామని చెప్పారు. టూరిజం మంత్రిగా జనసేన పార్టీ నేత ఉండడంతో ముంతాజ్ హోటల్‌కు అనుమతుల వెనుక జనసేన హస్తం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుని ముంతాజ్ హోటల్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసన దీక్షను ఆమరణదీక్షగా కొనసాగిస్తూ తమ ప్రాణాలైనా ఇవ్వడానికి తాము సిద్ధమని హెచ్చరించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment