యథేచ్ఛగా నీటి దందా
- జేబులు నింపుకుంటున్న వ్యాపారులు
- రోజురోజుకు పెరిగిపోతున్న నీటి వ్యాపారం
- ఏటా తగ్గిపోతున్న భూగర్భజలాలు
- కాలనీల్లో నీటి కొరత
- ఇబ్బంది పడుతున్న జనం
- పట్టించుకోని అధికారులు
పటాన్‌చెరు: పట్టణంలో ట్యాంకర్లతో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పటాన్‌చెరు శాంతినగర్‌లో బోర్లలో నీరు తగ్గుతోంది. శాంతినగర్ పక్కన దాదాపు వందెకరాల శిఖంతో ఉన్న సాకి చెరువులో నీరు తగ్గింది. వర్షాలు లేక పోవడంతో చెరువులో ఉండాల్సిన నీరు లేదు. అలాగే పటాన్‌చెరు పట్టణంలో భూగర్భ జలాల లభ్యత ఉన్న కారణంగా ఈ ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు బోరు నీటిని తోడి అమ్ముకునే వ్యాపార సంస్థలు ఎక్కువయ్యాయి. పటాన్‌చెరు పట్టణంలోని పెట్రోలు బంక్‌లో బోరు వేసి నీటిని రాత్రింబవళ్లు తోడేస్తున్నారు.
దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శాంతినగర్‌లో ప్రైవేటు వ్యక్తులు ఆర్వో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ వాటర్ ప్లాంట్ల కారణంగా సమస్యలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అక్రమ పద్ధతుల్లో నీటిని తోడుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై స్థానిక రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ విశ్వేశ్వర్‌ను వివరణ కోరగా ఆయన నీటి వ్యాపార కేంద్రాలను వెంటనే గుర్తించి వాటిని తొలగిస్తామన్నారు. తమ దృష్టికి అలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదన్నారు. స్థానికులు తాజాగా ఫిర్యాదు చేశారని దానిపై చర్యలు తీసుకుంటామన్నారు.
వాల్టా చట్టం అమలు చేయరా?
పటాన్‌చెరు పట్టణంలో వాల్టా చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రోజురోజుకూ నీటి వ్యాపారం పెరుగుతోంది. 24 గంటలూ బోర్లు నడుపుతుండడంతో భూగర్భజలాలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- జగన్‌రెడ్డి, శాంతినగర్ పటాన్‌చెరు
అధికారులు పట్టించుకోవడం లేదు
అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు. నీటి వ్యాపార కేంద్రాల నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నీటి వ్యాపార నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరితే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు.
- చిదంబరం, శాంతినగర్