పటాన్‌చెరు పారిశ్రామికవాడలో నీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతో భూగర్భ జలాలకు డిమాండ్ పెరిగి వందల సంఖ్యలో ఆర్వో నీటి శుద్ధి కేంద్రాలు వెలిశాయి. వీటిలో ఏ ఒక్క దానికీ అనుమతి లేదు. రెవెన్యూ అధికారులకు ఠంచనుగా మామూళ్లు అందిస్తున్న నిర్వాహకులు యథేచ్ఛగా నీళ్ల దందా నిర్వహిస్తున్నారు. సీఎం సొంత జిల్లా.. రాష్ట్ర రాజధానికి పక్కనే ఉన్న పటాన్‌చెరులో ‘రెవెన్యూ’ పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బోరు నీటినే.. శుద్ధి చేసిన జలమని చెబుతూ విక్రయిస్తున్నారు.
ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితమే తేల్చారు. కానీ వీటినే ఆర్వో ప్లాంట్లలో ఫిల్టర్ చేశామని చెబుతున్న వ్యాపారులు 12వేల లీటర్ల ట్యాంకర్ల పరిణామాల్లో విక్రయిస్తున్నారు. ఈ నీటిని స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో రసాయనాల తయారీకి, తాగునీటి కోసం వాడుతున్నారు. పాశమైలారం పారిశ్రామికవాడలో చాలా రసాయన పరిశ్రమల్లో భూగర్భ జలాలు లేవు. దీంతో దూర ప్రాంతాల నుంచి వాడుక, తాగు నీటి అవసరాల కోసం నీటి వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు పనిలో పనిగా వాటర్ బబూల్స్ (20 లీటర్ల బాటిళ్లు) ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇస్నాపూర్, ముత్తంగి, పాటిలో తయారు చేస్తున్న నీరు శేరిలింగంపల్లి వరకు అమ్ముతున్నారు. చిన్న సైజు బాటిళ్లు, ప్యాకెట్ల రూపంలో కూడా విక్రయిస్తున్నారు. వంద గజాల నిడివిలో నాలుగు బోర్లు వేసి ఆ నీటిని ట్యాంకుల్లోకి ఎక్కించి సరఫరా చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల అండ...
గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఒకరి సూచన మేరకు ముత్తంగి చర్చి ముందు వైపు ఉన్న వాటర్ ప్లాంట్ కోసం ఓ మైనార్టీ నేత కోరిక మేరకు ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించారు. అక్కడ వ్యవసాయం లేదు. కనీసం ఆవాసాలు కూడా లేవు. కేవలం వాటర్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. వీటికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్లకు స్థానిక రెవెన్యూ అధికారుల పూర్తి సహకారం అందిస్తున్నారు. ముత్తంగిలో ప్రధాన రహదారిపై, రైస్‌మిల్లు, కట్టెల మిల్లు దగ్గర నిత్యం వందలాది ట్యాంకర్లు నిలబడి ఉన్నా అధికారులు మాత్రం కనీసం వాటిని పట్టించుకోవడంలేదు.
పాశమైలారంలో నీటి వ్యాపారం కోసం చేసిన నిర్మాణాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. ఇంద్రకరణ్(సంగారెడ్డి) మండలం వైపు వేసిన బోర్ల నుంచి పైప్‌లైన్లు వేసి పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ సంపులను నింపుతున్నారు. 24 గంటలు మోటర్లు పెట్టి నీటిని ఉపరితల ట్యాంకులకు ఎక్కిస్తుంటారు. పైవైపున్న ట్యాంకుల కింద ట్యాంకర్లను నిలబెట్టి క్షణాల్లో నింపే ఏర్పాట్లు చేశారు. వందలాది లారీల్లో రాత్రింబవళ్లు సరఫరా కొనసాగుతూనే ఉంటుంది. ముత్తంగిలో కూడా ఇదే పరిస్థితి.
ముత్తంగి చర్చి ముందు దాదాపు డజనుకుపైగా నీటి వ్యాపార క్షేత్రాలు కొనసాగుతున్నాయి. అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువులో శిఖంలోనే వాటర్ ట్యాంకర్ క్షేత్రాలు నిర్వహిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. వీటితో తమ బోర్లు ఎండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల అధికారులు కూడా అది తమ పరిధిలోనిది కాదని చేతులెత్తేస్తుండటంతో వ్యాపారులకు అడ్డు లేకుండా పోయింది.
దాడులు చేస్తాం...
దీనిపై తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి అడగగా గతంలో కూడా ఇవే ఆరోపణలు వచ్చాయన్నారు. అప్పట్లో వాటర్ ప్లాంట్లపై దాడులు చేశామని తెలిపారు. రెండుమూడు రోజుల్లో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి దాడులు చేస్తామని చెప్పారు. అక్రమంగా కొనసాగుతున్న నీటి క్షేత్రాలను పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు.
యథేచ్ఛగా వాటర్ ప్లాంట్ల నిర్వహణ
Published Thu, Nov 27 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement
Advertisement