water business
-
‘ఫ్యూచర్’ నీటినీ కొని అమ్ముకోవచ్చు!
భూమ్మీద మూడొంతులు ఉండేది నీరే. కానీ పేద దేశం నుంచి పెద్ద దేశం దాకా చాలా ప్రాంతాల్లో .. వినియోగించతగ్గ నీటికి కటకటే. 2025 నాటికి 180 కోట్ల మంది పైగా ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని అంచనాలున్నాయి. దీంతో.. వ్యవసాయం సహా ఇతరత్రా అవసరాల కోసం వర్షాభావ ప్రాంతాల్లో నీటి కొనుగోళ్లు భారీగా పెరగనున్నాయి. అలాగే రేటూ పెరగనుంది. ఈ నేపథ్యంలో నీరు అరుదైన వనరుగానే కాకుండా మార్కెట్ వస్తువుగానూ మారిపోతోంది. తాజాగా షికాగో మర్కెంటైల్ ఎక్సే్ఛంజీ (సీఎంఈ).. బంగారం, ముడి చమురు మొదలైన కమోడిటీల్లాగా నీటి ఫ్యూచర్స్‌లోనూ ట్రేడింగ్ ప్రారంభించింది. ఎన్క్యూహెచ్2ఓ టికర్‌తో దీన్ని ప్రవేశపెట్టింది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా నీటిని అత్యధికంగా వినియోగించే దేశాల్లో అమెరికా రెండో స్థానంలో ఉంది. యావత్ అమెరికా రోజు వారీ నీటి వినియోగంలో కాలిఫోర్నియా వాటా 9%. మిగతా ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా కాలిఫోర్నియా నీటి మార్కెట్ 4 రెట్లు అధికంగా ఉంటుంది. 2012–2019 మధ్య కాలంలో నీటికి సంబంధించి 2.6 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే లావాదేవీలు జరిగాయి. నీటి వినియోగం అత్యధికంగా ఉండే కాలిఫోర్నియా తరచూ కరువు బారిన కూడా పడుతుంటుంది. అడపాదడపా వానలు, సుదీర్ఘ కాలం పాటు వర్షాభావం పరిస్థితుల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడి, రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయని నాస్డాక్ గ్లోబల్ ఇండెక్సెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఎక్సే్ఛంజీల్లో బహిరంగంగా నీటి ట్రేడింగ్ నిర్వహిస్తే మార్కెట్లో పారదర్శకత పెరుగుతుందని, కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉంటుం దని పేర్కొన్నాయి. వర్షాభావ సంవత్సరాల్లో కాలిఫోర్నియా స్పాట్ మార్కెట్లో వ్యవసాయ రంగంతో పాటు ఇతరత్రా తయారీ సంస్థలు, మున్సిపాలిటీలు కూడా అత్యధికంగా నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. నీటి వినియోగం ఎక్కువగా ఉండే బాదం పప్పు, పిస్తా వంటి పంటల సాగు ఇటీవల పెరుగుతుండటంతో.. నీటి కొనుగోళ్లు సైతం పెరుగుతున్నాయి. సాధారణంగా నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని రైతులు, మున్సిపాలిటీలు విక్రయిస్తుంటాయి. ట్రేడింగ్ ఇలా.. రెండేళ్ల క్రితం ప్రారంభించిన నాస్డాక్ వెలస్ కాలిఫోర్నియా వాటర్ సూచీకి అనుసంధానంగా ఈ కాంట్రాక్టులు ఉంటాయి. కాలిఫోర్నియాలో నీటి లావాదేవీలు భారీగా జరిగే అయిదు అతి పెద్ద స్పాట్ మార్కెట్లలో రేట్ల సగటును తీసుకుని ప్రామాణిక రేటు నిర్ణయిస్తారు. ఒకో కాంట్రాక్టు విలువ 10 ఏసీఎఫ్ (ఎకర్ పర్ ఫీట్ ఆఫ్ వాటర్)గా ఉంటుంది. ఎకరం పొలాన్ని ఒక్క అడుగు మేర నింపేందుకు అవసరమైన నీటిని ఏసీఎఫ్‌గా వ్యవహరిస్తారు. 10 ఎకరాలకు సుమారు 3.26 మిలియన్ల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం 2022 దాకా త్రైమాసిక కాంట్రాక్టులున్నాయి. రేట్ల పెరుగుదలకు హెడ్జింగ్ సాధనంగా ఈ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రాబోయే మూణ్నెల్లలో వర్షాల్లేక నీటి రేటు పెరుగుతుందేమోనన్న అంచనాలు ఉన్న రైతు ఫ్యూచర్స్ కాంట్రాక్టును 500 డాలర్లకు కొనుక్కున్నారనుకుందాం. ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితే ఏర్పడి రేటు 550 డాలర్లకు పెరిగిందంటే రైతుకు 50 డాలర్ల లాభం వచ్చినట్లు. ఆ కాంట్రాక్టుని విక్రయించేసి .. ఆ డబ్బుతో స్పాట్ మార్కెట్లో నీరు కొనుక్కోవచ్చు. ఈ విధంగా రేటు భారీ పెరుగుదల నుంచి ఉపశమనం కోసం ఫ్యూచర్స్ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. మరోవైపు, కీలక వనరైన నీటితో ట్రేడింగ్ అనర్థదాయకంగా మారుతుందని కొన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. -
కెమెరాకు చిక్కిన ఎమ్మెల్యే అనుచరుల నిర్వాకం
గిద్దలూరు : అధికారంలో తమ ప్రభుత్వమే... దీంతో తాము ఏం చేసినా అడిగేవారు ఉండరనే ధీమా. వెరసి అవకాశం వస్తే రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారనే విషయంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనుచరులు మరోసారి నిరూపిస్తున్నారు. స్థానిక ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించిన మంచి నీటిని ఎమ్మెల్యే అనుచరులు ట్యాంకర్ల ద్వారా పక్క దారి పట్టిస్తున్న వైనం కెమెరా కంటికి చిక్కింది. వ్యక్తిగతంగా తనకు చెందిన ట్యాంకర్లను ప్రజలకు తన స్వంత డబ్బుతో సరఫరా చేస్తున్నట్టు జనాన్ని మభ్యపెట్టడమే కాక ఆ వాహనాలపై నిబంధనలకు విరుద్ధంగా తాటికాయంత అక్షరాలతో గుమ్మడికాయ అంత ఫోటో వేసుకుని మరీ తిరుగుతున్న వైనం చూసి స్థానికులు ఈసడించుకుంటున్నారు. దానికి తోడు సరఫరా చేయడానికి ఉద్దేశించిన మంచి నీటిని స్వార్థ ప్రయోజనాల కోసం స్థానికంగా పేరున్న ఓ ప్రముఖ రెస్టారెంట్ కు ఇవే ట్యాంకర్ల ద్వారా వ్యాపారం చేయటం కూడా కెమెరాకు చిక్కింది. ఇలా సామాన్యులకు అందాల్సిన కనీస హక్కు అయినా మంచి నీటిని ఇలా లాభాపేక్ష కోసం అమ్ముకోవడం నీచమని స్థానికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. స్థానికులు కనీస తాగునీటి అవసరాలకు కూడా నీరు లేక అలమటిస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఇలా బజారులో అమ్ముకోవడంపై భగ్గుమంటున్నారు. ప్రజల క్షేమం పట్టని ఇలాంటి నాయకులు ఉంటే క్షామం తప్పదని మరోసారి అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు రుజువు చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. మరి సదరు ఎమ్మెల్యే దీనికి ఏం సమాధానం ఇస్తారో చూడాలి. -
నీటి దోపిడీ
- తాగునీటి ధరలు పెంచేసిన నిర్వాహకులు - బిందె రూ.10 చొప్పున అమ్ముతున్న వైనం - శ్రీరామిరెడ్డి పథకంపై అంతు లేని నిర్లక్ష్యం హిందూపురం అర్బన్ : పట్టణంతో తాగునీటి పేరుతో నిలువుదోపిడీ జరుగుతోంది. డిమాండ్ ఆధారంగా ట్యాంకర్ల నిర్వాహకులు బిందె రూ.10కు అమ్ముతున్నారు. దీంతో సామాన్య ప్రజలు శుద్ధజలం కొనలేకపోతున్నారు. హిందూపురం ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. 1000 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు లభించే పరిస్థితి లేదు. దీంతో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది. పట్టణంలో 1.60 లక్షల జనాభాకు రోజుకు సుమారు 12 ఎంఎల్డీ నీరు అవసరం. అయితే పీఏబీఆర్ నుంచి 3, మున్సిపాల్టీ పరిధిలోని 9 బోర్ల నుంచి 2 ఎంఎల్డీ నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమార్జనకు తెరలేపారు. బిందె తాగునీరు రూ.10కు పెంచేశారు. పట్టణంలో సుమారు 42 వేల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి నీటికోసం రోజుకు రూ.20 ఖర్చవుతోంది. ఈప్రకారం ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ల వద్ద తాగునీటి కోసం ప్రతినెలా సుమారు రూ.2.40 కోట్లు వ్యయం చేసి నీటిని కొనుగోలు చేస్తున్నారు. అయినా ప్రజల దాహార్తి తీరడం లేదు. శ్రీరామిరెడ్డి పథకంపై అలసత్వం ఆసియాలోనే అతిపెద్దదైన నీలకంఠాపురం శ్రీరామిరెడ్డి నీటిపథకం నిర్వహణ లోపంతో నిర్వీర్యమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకాన్ని సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వ అధికారులు అంతు లేని అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా హిందూపురం మున్సిపాల్టీతో పాటు 6 నియోజకవర్గాల ప్రజలు తీవ్ర దాహార్తితో అల్లాడిపోతున్నారు. పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి సుమారు 14 వందల కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయించి మంచినీరు అందించేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. కానీ సమర్థంగా నిర్వహించలేకపోతున్నారు. ప్రతి ఏటా రూ.కోట్లు వ్యయం చేస్తున్నా పథకాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ట్రిప్పునకు రూ.400 ఇస్తాం హిందూపురం పట్టణంలో తాగునీటి ఇబ్బందుల దృష్యా మున్సిపాల్టీకి కాంట్రాక్టు పద్ధతిన ట్యాంకర్లకు ఇస్తున్న అద్దెను రూ.300 బదులు రూ.400 ఇవ్వడానికి కలెక్టర్ అంగీకరించారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, చైర్పర్సన్ ఆర్.లక్ష్మితో పాటు ఇంజినీరింగ్ అ«ధికారులు అనంతపురం తరలివెళ్లి కలెక్టర్ కోన శశిధర్‌తో తాగునీటి ఎద్దడి ట్యాంకర్ల కాంట్రాక్టర్ల డిమాండ్‌ను తెలియజేశారు. స్పందించిన కలెక్టర్ రూ.400 ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. -
వాల్టా.. ఇక్కడ ఉల్టా
గాజువాక : నగరంలో నీటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తోసిరాజని సాగుతున్న ఈ వ్యాపారం పట్ల సంబంధిత అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో వ్యాపారులకు లాభాల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే నగరానికి నీటి లభ్యత తగ్గిపోయి జనం దాహం కేకలు వేస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క వ్యాపారులు సబ్ మెర్సిబుల్ పంపులతో భూగర్భ జలాలను తోడేస్తుండటంతో నగరంలో వేల బోర్లు పనిచేయకుండా మూలకు చేరిపోయాయి. ఇంకోపక్క ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ పేరుతో మరికొంతమంది వ్యాపారులు, సర్వీసింగ్ సెంటర్ల పేరుతో మరికొంతమంది భూ గర్భ జలాలను హరించేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చట్టాలను అమలు చేసి జల సంరక్షణకు నడుం బిగించాల్సిన యంత్రాంగం కిమ్మనకపోవడం నగర ప్రజలకు శాపంగా మారింది. విచ్చలవిడిగా నీటి అమ్మకం...: నగరంలో భూగర్భ జలాలతో విచ్చలవిడి వ్యాపారం సాగుతోంది. ప్రైవేట్ నీటి హ్యాకర్ల సంఖ్య నగరం మొత్తంమీద వందల్లో ఉన్నట్టు చెబుతున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక, అగనంపూడి, ఆటోనగర్, చినగంట్యాడ, మింది రామ్‌నగర్, మల్కాపురం తదితర ప్రాంతాల్లో పలువురు వ్యాపారులకు నీటి అమ్మకమే ప్రధాన వ్యాపకంగా ఉంది. ఆరు, ఎనిమిది అంగుళాల బోర్లను తవ్వించి భూగర్భ జలాలను సబ్ మెర్సిబుల్ పంపులతో తోడేస్తున్నారు. కొంతమంది రోజుకు 20 వేల కిలో లీటర్ల సామర్థ్యంగల సుమారు 150 ట్యాంకర్ల నీటిని తోడి అమ్మేస్తున్నారు. దీంతో సంబంధిత ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి వ్యక్తిగత బోర్లు పని చేయని పరిస్థితి నెలకొంది. అర్బన్ ప్రాంతంలో సుమారు 35 ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ప్లాంట్లు ఉన్నాయి. వాటికి తోడు ఇటీవల కాలంలో మినరల్ వాటర్ పేరుతో వీధికొకటి వెలసిన విషయం తెలిసిందే. ఫర్మ్ రిజిస్ట్రేషన్ విభాగం వద్ద నమోదు చేయించుకొని నెలకొల్పినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని పలు సందర్భాల్లో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. వాల్టా చట్టం ప్రకారం...: వాల్టా చట్టం ప్రకారం ప్రైైవేట్ నీటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వరు. ఎవరైనా నీటి వ్యాపారానికి పాల్పడితే ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అధికారులకు అన్ని అధికారాలూ ఉన్నాయి. మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా మూసేయాల్సిందిగా ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి జిల్లాలో ఉన్న పలు మినరల్ వాటర్ ప్లాంట్లను మూయించాలంటూ ఐదేళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ ఆదేశాలను అమలు చేయడానికి కూడా జీవీఎంసీ అధికారులకు తీరిక లేకుండా పోయింది. నీటి వ్యాపారాన్ని అరికట్టాల్సిన అధికారులు హాకర్లతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
అవినీటి వ్యాపారం
దారితప్పించి.. హోటళ్లకు ట్యాంకర్ల తరలింపు రూ. కోట్లలో నీటి వ్యాపారం శివారులో క‘న్నీటి’కష్టాలు బస్తీల్లో వారాకి ఒకరోజు సరఫరా నగరంలో నీటి వ్యాపారం ‘మూడు ట్యాంకర్లు.. ఆరు ఫిల్టర్‌ప్లాంట్లు’ అన్నట్లుగా కొనసాగుతోంది. అసలే వేసవి ఎండలతో భూగర్భజలం అడుగంటింది. శివారు ప్రాంతాల్లో లక్షలాది మందికి జలమండలి నల్లా కనెక్షన్లు లేక...మంచినీళ్లు దొరక్క నానాపాట్లు పడుతున్నారు. బస్తీలకు వెళ్లాల్సిన మంచినీటి ట్యాంకర్లు బడాబాబులకు, వాణిజ్య సంస్థలకు తరలుతున్నాయి. దీంతో నిరుపేదల గొంతెండుతోంది. తప్పనిసరి పరిస్థితిలో జనం ప్రైవేట్ ట్యాంకర్లను, ఫిల్టర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. తద్వారా నెలకు దాదాపు రూ.100 కోట్లకు పైగానే నీటికోసం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లోని నీటి సమస్యపై సాక్షి ఫోకస్.... - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: జలమండలి మంచినీటి సరఫరా వ్యవస్థ లేని శివారు ప్రాంతాలు మండువేసవిలో తాగునీటికి విలవిల్లాడుతున్నాయి. బస్తీలకు వెళ్లాల్సిన మంచినీటి ట్యాంకర్లు బడాబాబులకు, వాణిజ్య సంస్థలకు సరఫరా అవుతుండడంతో నిరుపేదల గొంతెండుతోంది. జలమండలి నల్లా కనెక్షన్లేని లక్షలాది కుటుంబాలు ప్రైవేటు ట్యాంకర్నీళ్లు, ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని ఆశ్రయించి నెలకు రూ.వంద కోట్లకు పైగానే ఖర్చు చేయక తప్పని దుస్థితి తలెత్తింది. కన్నీటి కష్టాలివిగో.. కాప్రా సర్కిల్ పరిధిలోని సాయిరాంనగర్, సాయిబాబానగర్, ఇందిరానగర్, ఆర్టీసీ కాలనీ, శ్రీశ్రీనగర్, వంపుగూడ, వినాయక్‌నగర్, శాంతివి హార్, అయోధ్యనగర్, గ్రీన్‌పార్కు, న్యూ శ్రీనివాసన గర్, గణేష్‌నగర్, నెహ్రూనగర్, సోనియాగాంధీనగర్, ఆదర్శ్‌నగర్, ఇందిరమ్మ గహకల్ప, బీఎన్‌రెడ్డినగర్, బీజేఆర్నగర్, హనుమాన్‌నగర్, భరత్‌నగర్, గోకుల్‌నగర్, బాబానగర్, ఏపీపుడ్స్ గుడిసెలు, అనాధ హాస్టల్, బ్రహ్మపురి కాలనీ సహా మొత్తం 30 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ 50 వేల మందికిపైగా నివసిస్తున్నారు. 27 టా ్యంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. ఒక్కో ట్యాంకర్ రోజుకు 8 ట్రిప్పులు వేయాలి. కానీ నాలుగుతోనే సరిపెడుతున్నారు. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా దారి మళ్లిస్తున్నారు. సాయిబాబానగర్‌లో ‘మాకు నా లుగు రోజులకు ఒక ట్యాంకర్ రావాల్సి ఉండగా అది ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. దీంతో నీటి కోసం పనులు మానుకోవాల్సి వస్తంది. ట్యాంకర్ నీళ్లకోసం కూలీ డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తోంది’అని కాప్రాకు చెందిన ధనమ్మ వాపోయింది. ‘రాధికా రిజర్వాయర్ రికార్డులో ట్యాంకర్ మా పాయింట్ వద్దకు వచ్చినట్లు ఉంది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో తెలీదు. ఇంటికి బంధువులు వస్తే.. ఎవరైనా సంతోషిస్తారు. కానీ మా పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ సమయంలో ఎందుకొచ్చారా? అని బాధపడాల్సి వస్తోంది’ అని కనకయ్య వాపోయాడు. వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టగలుగుతున్నాం కానీ...దాహమేస్తే మంచినీరు ఇవ్వలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాలానగర్, ఫతేనగర్ డివిజన్ లోని వెయ్యి మందికిపైగా ఉండే కార్మికనగర్‌కు రోజుకు ఒక ట్రిప్పు చొప్పున, ఐదు వేల మంది కిై పెగా ఉండే లంబాడీ బస్తీలో రోజుకు నాలుగు ట్రిప్పుల చొప్పున, నవజీవన్నగర్లో రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా చేస్తుండ గా, బాలానగర్, ఫతేనగర్ ఫరిధిలోని దిల్‌ఖుష్‌నగర్‌కు ప్రతి ఆదివారం, రాజుకాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలోని వారికి ప్రతి గురువారం మాత్రమే మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఉప్పల్ శివారులోని కురుమానగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీనర్సింహా కాలనీలకు పది రోజులకు ఒకసారి మాత్రమే ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీరు సరఫరా అవుతోంది.నగరంలో ఒక వైపు నీటి కొరత వేధిస్తుంటే..మరో వైపు ఐడీపీఎల్,హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, షాపూర్‌నగర్, బాలా నగర్, షాపూర్‌నగర్‌లో ప్రధాన పైప్‌లైన్‌కు ఏర్పడిన లీకేజీలను అరికట్టడంలో జలమండలి అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు. యాప్రాల్ శ్యామల లక్ష్మినగర్, రాజీవ్గహకల్ప, బర్షిపేట, కౌకూర్ కిందబస్తి కాలనీల్లో 5 రోజులకు ఒక సారి మంచినీటి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా అవుతుంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల వద్ద ప్రైవేటు నీటి విక్రయాలు జోరందుకున్నాయి. ఒక్కో ట్యాంకర్ రూ.1500 చొప్పున విక్రయిస్తున్నారు. గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొండాపూర్, ఖానామెట్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, ప్రకాశ్‌నగర్ తదితర ప్రాంతాలలో వాటర్ మాఫియా విస్తరించుకుంది. గోపన్‌పల్లి తండాలో దాదాపు 10 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో వాటర్ ప్లాంటు నుంచి రోజు 20 వేల లీటర్ల నీటిని తాగు నీటి పేరిట తరలిస్తున్నారు. గోపన్‌పల్లిలో ఆర్ఓ ప్లాంట్ల ద్వారా తరలిస్తున్న నీటినే చాలా మంది తాగేందుకు వినియోగిస్తున్నారు. కానీ అపరిశుభ్రమైన వాతావరణంలో, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శుద్ధిచేసి తరలిస్తున్న ఈ నీళ్లు కలుషిత జలాలేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కుత్బుల్లాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా 500కు పైగా నీటి ఫిల్టర్ ప్లాంట్లు వెలిశాయి. భగత్‌సింగ్‌నగర్, చంద్రానగర్, విజయ్‌నగర్‌కాలనీ, బోళాశంకర్ నగర్, భూమిరెడ్డి కాలనీ, సుభాష్‌నగర్, భాగ్యలక్ష్మికాలనీ, కురుమ బస్తీ, సీపీఆర్ కాలనీ,తదితర ప్రాంతాల్లో ఎలాంటి నాణ్యతాప్రమాణాలు లేని నీటినే క్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇరుకు గదుల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో నీటి ప్లాంట్లు పెట్టారు. ఇంటి అద్దెలతో సమానంగా నీటి ఖర్చు.. కొండాపూర్‌లోని గౌతమీ ఎన్‌క్లేవ్‌లో 55 అపార్ట్మెంట్లున్నాయి. ప్రతి రోజు 100 ట్యాంకర్ల నీళ్ల కొనుగోలుకు లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు .ప్రతి అపార్ట్‌మెంట్‌కు రోజుకు కనీసం 25 వేల లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారు. వీరు ఇంటి అద్దెలతో సమానంగా నీటికి డబ్బులు చెల్లిస్తున్నారు. నిజాంపేట్‌లో నీటి ఎద్దడి థార్ ఎడారిని తలపిస్తోంది. ఇక్కడ 1500 బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ప్రతి అపార్ట్మెంట్లో 20 ప్లాట్లున్నాయి. నిజాంపేట్‌లో ప్రతి రోజు 3000 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కు రోజుకు 2 ట్యాంకర్లు వినియోగిస్తున్నారు. ఒక్క బండారి లే అవుట్లో 225 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 400 ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఒక్కో అపార్ట్మెంట్ వారు నీటి కోసమే నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి ఫ్లాట్ యజమాని ట్యాంకర్ నీళ్లకు రూ.3 వేల చొప్పున, తాగు నీళ్ల కోసం మరో మరో రూ.600 చొప్పున ఖర్చు చేస్తున్నారు. -
యథేచ్ఛగా నీటి దందా
- జేబులు నింపుకుంటున్న వ్యాపారులు - రోజురోజుకు పెరిగిపోతున్న నీటి వ్యాపారం - ఏటా తగ్గిపోతున్న భూగర్భజలాలు - కాలనీల్లో నీటి కొరత - ఇబ్బంది పడుతున్న జనం - పట్టించుకోని అధికారులు పటాన్చెరు: పట్టణంలో ట్యాంకర్లతో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పటాన్చెరు శాంతినగర్‌లో బోర్లలో నీరు తగ్గుతోంది. శాంతినగర్ పక్కన దాదాపు వందెకరాల శిఖంతో ఉన్న సాకి చెరువులో నీరు తగ్గింది. వర్షాలు లేక పోవడంతో చెరువులో ఉండాల్సిన నీరు లేదు. అలాగే పటాన్చెరు పట్టణంలో భూగర్భ జలాల లభ్యత ఉన్న కారణంగా ఈ ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు బోరు నీటిని తోడి అమ్ముకునే వ్యాపార సంస్థలు ఎక్కువయ్యాయి. పటాన్చెరు పట్టణంలోని పెట్రోలు బంక్‌లో బోరు వేసి నీటిని రాత్రింబవళ్లు తోడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శాంతినగర్‌లో ప్రైవేటు వ్యక్తులు ఆర్వో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ వాటర్ ప్లాంట్ల కారణంగా సమస్యలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అక్రమ పద్ధతుల్లో నీటిని తోడుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్‌ను వివరణ కోరగా ఆయన నీటి వ్యాపార కేంద్రాలను వెంటనే గుర్తించి వాటిని తొలగిస్తామన్నారు. తమ దృష్టికి అలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదన్నారు. స్థానికులు తాజాగా ఫిర్యాదు చేశారని దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాల్టా చట్టం అమలు చేయరా? పటాన్చెరు పట్టణంలో వాల్టా చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రోజురోజుకూ నీటి వ్యాపారం పెరుగుతోంది. 24 గంటలూ బోర్లు నడుపుతుండడంతో భూగర్భజలాలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - జగన్‌రెడ్డి, శాంతినగర్ పటాన్చెరు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు. నీటి వ్యాపార కేంద్రాల నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నీటి వ్యాపార నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరితే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. - చిదంబరం, శాంతినగర్ -
కొంటేనే నీళ్లు!
- మదనపల్లెలో జోరుగా నీటి వ్యాపారం - ఒక్కో ట్యాంకర్ నీళ్లు రూ.700లు - రోజుకు 650 ట్రిప్పుల నీళ్ల కొనుగోళ్లు - నెలకు రూ.83 లక్షల ఖర్చు జిల్లాలో పడమటి మండలాల ప్రజలు గుక్కెడు నీళ్లు దొరకక అల్లాడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ట్యాంకర్ల యజమానులు రోజుకో రేటు చొప్పున అడ్డం గా దోచేస్తున్నారు. మదనపల్లె పట్టణంలో నెలకు రూ.7.3 కోట్ల మేర నీటి వ్యాపారం సా గుతోందంటే ఇక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చే సుకోవచ్చు. మదనపల్లె : మదనపల్లె పట్టణంలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో మంచినీటి బోర్లు, బావులన్నీ దాదాపుగా ఎండిపోయాయి. పట్టణవాసులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలుచేసి గొంతుతడుపుకోవాల్సి వస్తోంది. మదనపల్లెలో పట్టణంలో మొత్తం 300 ప్రైవేట్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో మున్సిపల్ అధికారులు 112 ట్యాంకులు వినియోగించుకుంటున్నారు. రోజుకు 650 ట్రిప్పులను 13 సంపులకు నింపుతున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.430 చొప్పున ప్రైవేటు ట్యాంకర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ.2.79 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అంటే నెలకు దాదాపుగా రూ.83 లక్షలపైమాటే ఖర్చుచేస్తున్నారు. ట్యాంకర్ల యజమానులకు డబ్బేడబ్బు మదనపల్లె పట్టణంలో దాదాపు 200 దాకా ప్రయివేట్ ట్యాంక ర్లు ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్ నీళ్లు రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకరు రోజుకు 15 ట్రిప్పులు వరకూ తోలుతుంటాయి. ఈ లెక్కన 200 ట్యాంకర్లు 3000 ట్రిప్పుల వరకు తోలుతుంటాయి. ఇలా రోజుకు దాదాపు రూ.24 లక్షల వరకు గడిస్తున్నారు. అంటే నెలకు రూ.6.3 కోట్లుదాకా రాబడి వస్తోంది. పట్టణం మొత్తం మీద ఒక్క మంచినీటి కోసమే దాదాపు 7.13 కోట్ల దాకా వెచ్చించాల్సి వస్తోంది. మున్సిపల్ కొళాయిలు ఉన్నా.. మున్సిపల్ పవర్ బోర్లు 264 ఉండగా వాటిలో 70 మాత్రమే పనిచేస్తున్నాయి. 140 హ్యాండ్ బోర్లకుగాను 55 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక కొళాయిలు ఉన్నా అంతంతమాత్రమే. అందులో 10, 15 రోజులకోసారిగానీ నీరు రాని పరిస్థితి. ఎంతకు కొనుగోలు చేస్తారంటే.. ట్యాంకర్ యజమానులు బోర్ల వద్ద ట్యాంకరు నీరు రూ.300 చొప్పున కొనుగోలు చెస్తారు. అదే ట్యాంకరు నీరు కరెంటు లేకపోతే జనరేటర్ ద్వారా నింపితే రూ.350 చొప్పున బోర్ల యజమానులు వసూలు చేస్తుంటారు. అక్కడి నుంచి పట్టణంలో దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకూ నీటిని సరఫరా చేస్తారు. ట్యాంకరు నిర్వాహకులు డ్రైవర్ బత్తా, డీజిల్ ఖర్చు, మెయింటెనెన్స్ కలిపి ట్యాంకరు నీటిని రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. నీళ్లు కొనలేకపోతున్నాం.. ట్యాంకరు నీటికి రూ700 వెచ్చించాల్సి వస్తోంది. తాగునీటి సమస్య కొన్నేళ్లుగా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. పాలకులు, అధికారుల హామీలు నీటిమూటలుగా మారుతున్నాయి. - కుమార్, మదనపల్లె -
అవి‘నీటి’ జలగలు
అన్ని మాఫియాల్లాగే నీటి మాఫియా కూడా తెలంగాణ రాజధానిలో మూడు పూవులు ఆరుకాయలుగా విస్తరించినా అధికారులు మాత్రం మత్తులో జోగుతూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఈ అవి‘నీటి’ వ్యాపారం విలువ అక్షరాలా 300 కోట్ల రూపాయలు. రాజధానిలో ఎక్కడ పడితే అక్కడ యథేచ్చగా బోర్లు వేసి అక్రమంగా నీటిని అమ్మేసుకుంటున్నారు. వేసవి వచ్చిందంటే వాళ్లకు పండుగలాగా అవు తోంది. ఒక చట్టం అంటూ లేనేలేదు. నియమనిబంధనలు గాలికి వదిలి జంటనగరాల్లో సామాన్య ప్రజల నీటి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఈ నీటి వ్యాపారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే జలమం డలిలోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకునే నాధుడే లేకపోవడం గమనార్హం. కొంత మంది ఎందుకొచ్చిన తంటా అని ఎక్కువ రేటుకు కొనుక్కుంటూ అలాగే ఇబ్బందిపడుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా ఈ అక్రమ నీటి వ్యాపారాన్ని మాత్రం అరికట్టలేకపోవడంతో, అటు జలమండలి అధికారులు ఇటు ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యా యి. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం అక్రమ నీటి మాఫియాపై ఉక్కు పాదం మోపి నీటి వ్యాపారానికి పూర్తిగా అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్. పద్మావతి వివేక్‌నగర్, హైదరాబాద్ -
జలగండం
ముంచుకొస్తున్న నీటిముప్పు జిల్లాలో నీటి సమస్య ఉన్న గ్రామాలు 1,713 పడమటి మండలాల్లో పరిస్థితి మరింత దారుణం ప్రయివేటు నీటి వ్యాపారం రూ.కోట్లలో తరుముకొస్తున్న వేసవి పరిష్కారం చూపని సీఎం తాగునీటి ఇక్కట్లు తీరేదెట్టా? జిల్లాలోని పూతలపట్టు, కుప్పం, తంబళ్లపల్లె, గంగాధర నెల్లూరు, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల పరిధిలో గతంలో 1,713 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండేది. తాజాగా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. వారం రోజులకు ఒక్కసారి కూడా ప్రభుత్వ పథకాల ద్వారా నీరు అందడం లేదు. ఆర్థిక స్థోమత ఉన్న వారు నీళ్లు కొనుక్కుంటుండగా, లేని వారు నానా తిప్పలు పడుతున్నారు. వేసవి తరుముకొస్తోంది. జిల్లాలో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాభావం వల్ల భూగర్భజలాలు పాతాళంలోకి అడుగంటాయి. అరకొరగా ఉన్న బోరుబావులు సైతం ఒట్టిపోయాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాదాపు రెండువేల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వేసవి తీవ్రత పెరిగే నాటికి ఉన్న బోరుబావులు కూడా నీటిని అందించే పరిస్థితి కానరావడం లేదు. అధికారులు వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిన దాఖలాలు లేవు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటికే బిల్లులు ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. ముఖ్యమంత్రి పైసా నిధులివ్వక మాటలతోనే సరిపెడుతున్నారు. దీంతో మరో రెండు మూడు నెలల తర్వాత పరిస్థితి ఊహించుకుంటే భయమేస్తోంది. స్పందించని ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జిల్లా తాగునీటి సమస్యను గాలికి వదిలేశారు. హంద్రీ-నీవా పూర్తయితేకానీ జిల్లాలో నీటి సమస్య తీరదు. ఇటీవల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే నీటి సమస్యను పరిష్కరిస్తానని మళ్లీ చంద్రబాబు హామీఇచ్చారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న పడమటి మండలాల్లో నీటి సమస్య తీరాలంటే హంద్రీ-నీవా రావాలి. హంద్రీ-నీవా పూర్తిచేయాలంటే 4,500 కోట్లు నిధులు అవసరం. చంద్రబాబు ప్రభుత్వం 2014-15 బడ్జెట్లో కేవలం *780 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తం కాంట్రాక్టర్ల పాత బకాయిలకే సరిపోతుంది. ఈ లెక్కన రాబోయే నాలుగేళ్లలో హంద్రీ-నీవా పూర్తిచేయడం అసాధ్యం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.7,390 కోట్లతో కండలేరు నుంచి నీటిని తరలించే విధంగా మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. రూ.5,900 కోట్లతో టెండర్లు పిలిచారు. కొంత అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారు. బాబు ఆ పథకాన్ని తుంగలో తొక్కారు. జిల్లాలో నీటిసరఫరా స్కీములు జిల్లావ్యాప్తంగా 8,596 వివిధ రకాల బోర్లు, స్కీములు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటి 255 బోర్లు ఎండిపోగా 2వేల బోర్లు సీజనల్‌గా మారాయి. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో ఆ బోర్లు కూడా సక్రమంగా పనిచేయడంలేదు. తాజాగా ప్రభుత్వం జిల్లాకు ఎన్ఆర్డబ్ల్యు కింద *8 కోట్ల 13లక్షల 45 వేలు, గ్రామీణ నీటి సరఫరా విపత్తుల నిర్వహణ కింద మరో *24.78 కోట్లు మొత్తం *32 కోట్ల 91లక్ష 45 వేలు మంజూరు చేసింది. ఇందులో తాగునీటి సరఫరాకు సంబంధించిన పాత బకాయిలకు *7.41 కోట్లు చెల్లించాల్సి ఉంది. వేసవి నీటి ఎద్దడి నివారణకు ఈ నిధులు సరిపోయే పరిస్థితి లేదు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తక్షణం ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. యుద్ధ ప్రాతిపాదికన జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. కొత్త బోర్లు తవ్వడం మాని నీళ్లున్న బోరు బావులను వినియోగించుకోవాలి. అధికారులు చిత్తశుద్ధితో ఈ కాార్యక్రమం నిర్వహిస్తేనే వేసవి తాగునీటి కష్టాల నుంచి ప్రజలు గట్టేక్కే అవకాశముంది. ప్రైవేటు వ్యాపారం జోరు జిల్లా నీటి సమస్యను చాలామంది వ్యాపారంగా మార్చుకున్నారు. బిందె నీళ్లు 3 నుంచి 5 రూపాయలకు అమ్ముతున్నారు. రోజూ 800 నుంచి 1000 ట్యాంకర్ల వరకు నీటి వ్యాపారం జరుగుతోంది. ఒక్క ట్యాంకు రూ.400 చొప్పున అమ్ముతుండడంతో జిల్లావ్యాప్తంగా నెలకు రూ.7 కోట్ల పైగా నీటి వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.