భూమ్మీద మూడొంతులు ఉండేది నీరే. కానీ పేద దేశం నుంచి పెద్ద దేశం దాకా చాలా ప్రాంతాల్లో .. వినియోగించతగ్గ నీటికి కటకటే. 2025 నాటికి 180 కోట్ల మంది పైగా ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉంటుందని అంచనాలున్నాయి. దీంతో.. వ్యవసాయం సహా ఇతరత్రా అవసరాల కోసం వర్షాభావ ప్రాంతాల్లో నీటి కొనుగోళ్లు భారీగా పెరగనున్నాయి. అలాగే రేటూ పెరగనుంది. ఈ నేపథ్యంలో నీరు అరుదైన వనరుగానే కాకుండా మార్కెట్ వస్తువుగానూ మారిపోతోంది. తాజాగా షికాగో మర్కెంటైల్ ఎక్సే్ఛంజీ (సీఎంఈ).. బంగారం, ముడి చమురు మొదలైన కమోడిటీల్లాగా నీటి ఫ్యూచర్స్‌లోనూ ట్రేడింగ్ ప్రారంభించింది. ఎన్‌క్యూహెచ్2ఓ టికర్‌తో దీన్ని ప్రవేశపెట్టింది.
ఎందుకంటే..
అంతర్జాతీయంగా నీటిని అత్యధికంగా వినియోగించే దేశాల్లో అమెరికా రెండో స్థానంలో ఉంది. యావత్ అమెరికా రోజు వారీ నీటి వినియోగంలో కాలిఫోర్నియా వాటా 9%. మిగతా ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా కాలిఫోర్నియా నీటి మార్కెట్ 4 రెట్లు అధికంగా ఉంటుంది. 2012–2019 మధ్య కాలంలో నీటికి సంబంధించి 2.6 బిలియన్ డాలర్ల పైగా విలువ చేసే లావాదేవీలు జరిగాయి. నీటి వినియోగం అత్యధికంగా ఉండే కాలిఫోర్నియా తరచూ కరువు బారిన కూడా పడుతుంటుంది. అడపాదడపా వానలు, సుదీర్ఘ కాలం పాటు వర్షాభావం పరిస్థితుల కారణంగా నీటి ఎద్దడి ఏర్పడి, రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయని నాస్డాక్ గ్లోబల్ ఇండెక్సెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఎక్సే్ఛంజీల్లో బహిరంగంగా నీటి ట్రేడింగ్ నిర్వహిస్తే మార్కెట్లో పారదర్శకత పెరుగుతుందని, కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా ఉంటుం దని పేర్కొన్నాయి. వర్షాభావ సంవత్సరాల్లో కాలిఫోర్నియా స్పాట్ మార్కెట్లో వ్యవసాయ రంగంతో పాటు ఇతరత్రా తయారీ సంస్థలు, మున్సిపాలిటీలు కూడా అత్యధికంగా నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. నీటి వినియోగం ఎక్కువగా ఉండే బాదం పప్పు, పిస్తా వంటి పంటల సాగు ఇటీవల పెరుగుతుండటంతో.. నీటి కొనుగోళ్లు సైతం పెరుగుతున్నాయి. సాధారణంగా నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న ఇతర ప్రాంతాల్లోని రైతులు, మున్సిపాలిటీలు విక్రయిస్తుంటాయి.
ట్రేడింగ్ ఇలా..
రెండేళ్ల క్రితం ప్రారంభించిన నాస్డాక్ వెలస్ కాలిఫోర్నియా వాటర్ సూచీకి అనుసంధానంగా ఈ కాంట్రాక్టులు ఉంటాయి. కాలిఫోర్నియాలో నీటి లావాదేవీలు భారీగా జరిగే అయిదు అతి పెద్ద స్పాట్ మార్కెట్లలో రేట్ల సగటును తీసుకుని ప్రామాణిక రేటు నిర్ణయిస్తారు. ఒకో కాంట్రాక్టు విలువ 10 ఏసీఎఫ్ (ఎకర్ పర్ ఫీట్ ఆఫ్ వాటర్)గా ఉంటుంది. ఎకరం పొలాన్ని ఒక్క అడుగు మేర నింపేందుకు అవసరమైన నీటిని ఏసీఎఫ్‌గా వ్యవహరిస్తారు. 10 ఎకరాలకు సుమారు 3.26 మిలియన్ల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. ప్రస్తుతం 2022 దాకా త్రైమాసిక కాంట్రాక్టులున్నాయి. రేట్ల పెరుగుదలకు హెడ్జింగ్ సాధనంగా ఈ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రాబోయే మూణ్నెల్లలో వర్షాల్లేక నీటి రేటు పెరుగుతుందేమోనన్న అంచనాలు ఉన్న రైతు ఫ్యూచర్స్ కాంట్రాక్టును 500 డాలర్లకు కొనుక్కున్నారనుకుందాం. ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితే ఏర్పడి రేటు 550 డాలర్లకు పెరిగిందంటే రైతుకు 50 డాలర్ల లాభం వచ్చినట్లు. ఆ కాంట్రాక్టుని విక్రయించేసి .. ఆ డబ్బుతో స్పాట్ మార్కెట్లో నీరు కొనుక్కోవచ్చు. ఈ విధంగా రేటు భారీ పెరుగుదల నుంచి ఉపశమనం కోసం ఫ్యూచర్స్ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. మరోవైపు, కీలక వనరైన నీటితో ట్రేడింగ్ అనర్థదాయకంగా మారుతుందని కొన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
‘ఫ్యూచర్’ నీటినీ కొని అమ్ముకోవచ్చు!
Published Tue, Dec 15 2020 3:21 AM | Last Updated on Tue, Dec 15 2020 11:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment