- మదనపల్లెలో జోరుగా నీటి వ్యాపారం
- ఒక్కో ట్యాంకర్ నీళ్లు రూ.700లు
- రోజుకు 650 ట్రిప్పుల నీళ్ల కొనుగోళ్లు
- నెలకు రూ.83 లక్షల ఖర్చు
జిల్లాలో పడమటి మండలాల ప్రజలు గుక్కెడు నీళ్లు దొరకక అల్లాడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ట్యాంకర్ల యజమానులు రోజుకో రేటు చొప్పున అడ్డం గా దోచేస్తున్నారు. మదనపల్లె పట్టణంలో నెలకు రూ.7.3 కోట్ల మేర నీటి వ్యాపారం సా గుతోందంటే ఇక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చే సుకోవచ్చు.
మదనపల్లె : మదనపల్లె పట్టణంలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో మంచినీటి బోర్లు, బావులన్నీ దాదాపుగా ఎండిపోయాయి. పట్టణవాసులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలుచేసి గొంతుతడుపుకోవాల్సి వస్తోంది. మదనపల్లెలో పట్టణంలో మొత్తం 300 ప్రైవేట్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో మున్సిపల్ అధికారులు 112 ట్యాంకులు వినియోగించుకుంటున్నారు. రోజుకు 650 ట్రిప్పులను 13 సంపులకు నింపుతున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.430 చొప్పున ప్రైవేటు ట్యాంకర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ.2.79 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అంటే నెలకు దాదాపుగా రూ.83 లక్షలపైమాటే ఖర్చుచేస్తున్నారు.
ట్యాంకర్ల యజమానులకు డబ్బేడబ్బు మదనపల్లె పట్టణంలో దాదాపు 200 దాకా ప్రయివేట్ ట్యాంక ర్లు ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్ నీళ్లు రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకరు రోజుకు 15 ట్రిప్పులు వరకూ తోలుతుంటాయి. ఈ లెక్కన 200 ట్యాంకర్లు 3000 ట్రిప్పుల వరకు తోలుతుంటాయి. ఇలా రోజుకు దాదాపు రూ.24 లక్షల వరకు గడిస్తున్నారు. అంటే నెలకు రూ.6.3 కోట్లుదాకా రాబడి వస్తోంది. పట్టణం మొత్తం మీద ఒక్క మంచినీటి కోసమే దాదాపు 7.13 కోట్ల దాకా వెచ్చించాల్సి వస్తోంది.
మున్సిపల్ కొళాయిలు ఉన్నా..
మున్సిపల్ పవర్ బోర్లు 264 ఉండగా వాటిలో 70 మాత్రమే పనిచేస్తున్నాయి. 140 హ్యాండ్ బోర్లకుగాను 55 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక కొళాయిలు ఉన్నా అంతంతమాత్రమే. అందులో 10, 15 రోజులకోసారిగానీ నీరు రాని పరిస్థితి.
ఎంతకు కొనుగోలు చేస్తారంటే..
ట్యాంకర్ యజమానులు బోర్ల వద్ద ట్యాంకరు నీరు రూ.300 చొప్పున కొనుగోలు చెస్తారు. అదే ట్యాంకరు నీరు కరెంటు లేకపోతే జనరేటర్ ద్వారా నింపితే రూ.350 చొప్పున బోర్ల యజమానులు వసూలు చేస్తుంటారు. అక్కడి నుంచి పట్టణంలో దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకూ నీటిని సరఫరా చేస్తారు. ట్యాంకరు నిర్వాహకులు డ్రైవర్ బత్తా, డీజిల్ ఖర్చు, మెయింటెనెన్స్ కలిపి ట్యాంకరు నీటిని రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు.
నీళ్లు కొనలేకపోతున్నాం..
ట్యాంకరు నీటికి రూ700 వెచ్చించాల్సి వస్తోంది. తాగునీటి సమస్య కొన్నేళ్లుగా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. పాలకులు, అధికారుల హామీలు నీటిమూటలుగా మారుతున్నాయి.
- కుమార్, మదనపల్లె
కొంటేనే నీళ్లు!
Published Sat, May 23 2015 5:34 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM
Advertisement
Advertisement