Madanapalle town
-
Madanapalle: మదనపల్లెకు కొత్త మాస్టర్ ప్లాన్
సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి సంబంధించి కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అమృత్ పథకంలో భాగంగా పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ(పీకేఎం–ఉడా) ఆధ్వర్యంలో స్కై గ్రూప్ కన్సల్టెంట్ సహకారంతో జీఐఎస్(జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఆధారిత మాస్టర్‌ప్లాన్–2041 రూపకల్పన జరిగింది. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి రూపొందించే మాస్టర్‌ప్లాన్‌ను పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, పట్టణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్రంగా తయారుచేయించారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రజల పరిశీలన కోసం 15 రోజుల పాటు పీకేఎం–ఉడా కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు తెలపాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో చేయాల్సిన మార్పులపై సుమారు 25వరకు అర్జీలు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరణ చేసిన ప్లాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్(డీటీసీపీ)కు పంపుతామని, అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త మాస్టర్‌ప్లాన్ ఆధారంగా చేసుకుని నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం. జిల్లాలో అతిపెద్ద పట్టణం మదనపల్లె. 35వార్డులు, 44 వార్డు సచివాలయాలు, 14.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. సుమారు 2లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పట్టణంలో గృహ, వాణిజ్యసముదాయాల నిర్మాణాలకు సంబంధించి జీఓ.ఎం.ఎస్.నెం.447, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.5.10.2001న ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌ను ఆధారంగా చేసుకుని అనుమతులు మంజూరుచేస్తున్నారు. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలుకు ముందు డ్రాఫ్ట్‌ప్లాన్‌ను ప్రజల పరిశీలనకు ఉంచి, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డీటీసీపీ అనుమతులతో అమలుచేయాల్సి ఉంటుంది. మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించి రానున్న 20 ఏళ్లలో ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ పథకం కింద అధునాతన సాంకేతికత సహాయంతో జియోగ్రాఫిక్ ఇన్ఫరేషన్ సిస్టమ్(జీఐఎస్) పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్–2041ను సిద్ధంచేశారు. రూపకల్పన జరిగిందిలా.. మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా స్కై గ్రూప్ ఏజెన్సీ వారు మొదట పట్టణాన్ని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. పట్టణ అభివృద్ధి దృష్ట్యా మెయిన్‌రోడ్లు ఎంత వెడల్పు ఉండాలో అంచనా వేసుకున్నారు. మున్సిపల్ లిమిట్స్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్డ్ యూజ్, ఇండస్ట్రియల్, పబ్లిక్, సెమీపబ్లిక్, రిక్రియేషన్ జోన్లను గుర్తించారు. గతానికి, ఇప్పటికి చేయాల్సిన మార్పులను గుర్తించి, వాటిని కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పరిధి 14.20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అలాగే కనపరుస్తూ విస్తరణ చేయాలనుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఏఓఐ(ఏరియా ఆఫ్ ఇంటరెస్ట్) కింద అన్నివైపులా మూడుకిలోమీటర్ల రేడియస్ పెంపుతో 37.26 చదరపుకిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కొత్త మాస్టర్ ప్లాన్‌లో మార్పులు పట్టణంలోని కోమటివానిచెరువు పాతమాస్టర్‌ప్లాన్‌లో రిక్రియేషన్ గ్రీన్‌లో ఉండేది. కొత్తప్లాన్‌లో చెరువుచుట్టూ ప్రాంతాన్ని బఫర్‌జోన్‌గా మార్చారు. గతంలో రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న కదిరిరోడ్డు, చౌడేశ్వరిగుడి పరిసరప్రాంతాలు, గొల్లపల్లెరోడ్డు, నిమ్మనపల్లెరోడ్డు, సీటీఎంరోడ్డు, బెంగళూరురోడ్డు, పుంగనూరురోడ్డు ప్రాంతాలన్నీ కమర్షియల్‌లోకి మార్పు జరిగాయి. ఇన్నాళ్లు వీటిలో రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు జరపాలంటే టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై ఆ సమస్య ఉండదు. రెడ్డెప్పనాయుడు కాలనీలో కొంతభాగం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేది. ప్రస్తుతం దాన్ని రెసిడెన్షియల్ జోన్లోకి మార్చారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 40–60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్స్‌గా ఏర్పాటుచేశారు. 60అడుగుల రోడ్లను 80–100 అడుగులుగా, పట్టణం మీదుగా వెళుతున్న స్టేట్ హైవేను 100 అడుగుల రోడ్లు చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. (క్లిక్: థ్యాంక్యూ.. సీఎం సార్) సమగ్రంగా పరిశీలించాకే ఫైనల్ ప్లాన్ ఖరారు.. పట్టణ మాస్టర్‌ప్లాన్–2041కు సంబంధించి ప్రధానంగా పట్టాభూములను రిక్రియేషన్ జోన్లో పెట్టారని, వాటిని డిలీట్ చేయాల్సిందిగా, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అనుమతిలేని లేఔట్లను మార్చమని, రోడ్ల వెడల్పు మార్చాల్సిందిగా, జోనింగ్‌లకు సంబంధించి, ఎగ్జిస్టింగ్ రోడ్లను మాస్టర్‌ప్లాన్‌రోడ్డుగా చేయమని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పీకేఎం–ఉడా అధికారులకు పంపాం. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్నాక సవరణలు చేసి డీటీసీపీ అనుమతులకు పంపి ఫైనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రకటిస్తారు. – కే.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, మదనపల్లె -
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. యువకుడి మృతి
మదనపల్లె టౌన్: బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో.. ఓ యువకుడు మృతి చెందగా, సోదరుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ సంఘటన మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె అప్పారావు తోటకు చెందిన అయూబ్‌బాషా కదిరి రోడ్డులోని నీరుగట్టువారిపల్లె టమాట మార్కెట్ వద్ద బిర్యానీ హోటల్ నడుపుతున్నాడు. బిర్యానీకి అవసరమైన మసాలాను తీసుకురావాలని తన ఇద్దరు కుమారులు ఆరీఫ్, అమీర్‌ఖాన్(18)కు చెప్పాడు. వారు బైక్‌పై తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోని సంఘం ఫంక్షన్ హాల్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. వారు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అమీర్‌ఖాన్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధాలపై నిలదీస్తోందని...!
సాక్షి, మదనపల్లె టౌన్ : మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధాలపై భార్య రోజూ నిలదీస్తోందనే ఆగ్రహంతో కట్టుకున్నోడే హంతకుడయ్యాడు. కత్తితో గొంతు కోసి దారుణంగా భార్యను హతమార్చాడు. నిందితుడు అంజాద్(36)ను శనివారం టూటౌన్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి, సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ విలేకరులకు వెల్ల డించారు. వారి కథనం.. స్థానిక తారకరామా సినిమా థియేటర్ సమీపంలోని నర్సింగ్‌హోం వీధిలో నివాసం ఉంటున్న దంపతులు అంజాద్, తహశీన్‌లది ఓ సాధారణ కుటుంబం. అంజాద్ మౌజాన్‌గా పని చేయడమే కాకుండా దుకాణం పెట్టుకుని మంత్రతంత్రాలు, క్షుద్ర పూజలు చేస్తూ సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి మూడేళ్ల లోపు వయసున్న ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తన దుకాణానికి వచ్చిపోయే వారికి మంత్రాలు, తంత్రాలతో పాటు తాయత్తులు కడుతూ మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. ఇది తెలుసుకున్న తహశీన్ తన భర్తను పలుమార్లు మందలించినా అతడి తీరు మారలేదు. విషయం తెలుసుకున్న ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న అంజాద్ తల్లి గురువారం ఉదయం కొడుకు, కోడలి వద్దకు వచ్చి ఇద్దరినీ మందలించింది. అయినా వారిద్దరూ ఆమె ఎదుటే మరోసారి గొడవ పడ్డారు. దీంతో వారికి సర్దిచెప్పలేక ఆమె తిరిగి ఆదే రోజు సాయంత్రమే తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. అంజాద్ తన భార్య పరువు తీస్తోందని, ఆమె అడ్డు తొలగించుకోవాలని వ్యూహరచన చేశాడు. ఈ మేరకు తన ముగ్గురు పిల్లలను గురువారం సాయంత్రం ఇంటికి సమీపంలోని ఓ ట్యూషన్‌కు పంపేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యను పదునైన కత్తితో కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు. అనంతరం ఎవరో ఆగంతకులు ఇంట్లో చొరబడి ఈ దురాగతానికి ఒడిగట్టారంటూ కథ అల్లాడు. రక్తపు మడుగులో పడివున్న భార్యను కాపాడేందుకు 108కు ఫోన్‌చేయాలని స్థానికులను కోరాడు. 108 సిబ్బంది అక్కడికి వచ్చే సరికే తహశీన్ చనిపోయిందని వారు వెనుదిరిగారు. సమాచారం అందడంతో టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అంజాద్, కుటుంబ సభ్యులు చెప్పే పొంతన లేని సమాధానాలపై పోలీసులు అనుమానించారు. చిత్తూరు నుంచి వేలి ముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించింది. 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. తహశీన్‌ను ఆమె భర్తే కడతేర్చినట్లు విచారణలో తేలింది. ఈ హత్యకు ఎవరెవరు సహకరించారో దర్యాప్తులో తేలాల్సి ఉందని డీఎస్పీ చెప్పారు. హత్యకేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన టూటౌన్ సీఐ, వన్ టౌన్ సీఐ తమీమ్ అహ్మద్, ఎస్ఐలు ఈ.బాబు, హరి హర ప్రసాద్‌తో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
కట్టుకున్నోడే కడతేర్చాడు?
సాక్షి, మదనపల్లె టౌన్ : మదనపల్లెలో తీవ్ర సంచలనం రేకెత్తించిన వివాహిత హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసును సవాలుగా తీసుకున్న డీఎస్పీ ఎం.చిదానంద రెడ్డి, టూటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌తో పాటు చిత్తూరు నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందానికి దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయి. హతురాలి భర్తే ఆమెను గొంతు కోసి కడతేర్చినట్లు పోలీసులు ఓ నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ సాగిస్తున్నారని సమాచారం. స్థానిక తారకరామ సినిమా థియేటర్ రోడ్డు (నర్సింగ్ హోమ్ వీధి)లోని ఓ ఇంటిలో మూడవ అంతస్తులో కాపురం ఉంటున్న మౌజ్ షేక్ అంజాద్ భార్య ఎస్.తహశీన్ (28) గురువారం రాత్రి ఇంటిలోనే దారుణ హత్యకు గురవడం విదితమే. పోలీసులు ఈ హత్య ఛేదనకు అన్నిరకాల సాంకేతిక పద్ధతులు ఉపయోగించారు. తెల్లవారు జామున 12.20కి చిత్తూరు నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం హత్య జరిగిన ఇంటిలో క్షుణ్ణంగా వేలిముద్రలు సేకరించారు. అనంతరం పోలీస్ జాగిలం తహశీన్ మృతదేహం వద్ద వాసన చూసి అక్కడి నుంచి తారకరామ సినిమా థియేటర్ రోడ్డు, వారపు సంత వరకు పరుగులు తీసింది. అక్కడి నుంచి తిరిగి మహిళ హత్యకు గురైన ఇంటి వద్దకే చేరుకుంది. అక్కడే కొంతసేపు చుట్టూ చక్కర్లు కొట్టింది. అదే సమయంలో తహశీన్ భర్త అంజాద్ అక్కడే కూర్చుని ఉండడంతో పోలీసులు అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు, ఇతర ప్రాథమిక ఆధారాలతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఆధారాల మూలంగా అంజాదే నిందితుడని తేల్చినట్టు తెలియవచ్చింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. హత్యకు గురైన తహశీన్ (ఫైల్) కన్నీరుమున్నీరైన తహశీన్ తల్లిదండ్రులు తమ కుమార్తె తహశీన్ దారుణ హత్యకు గురైందనే సమాచారం అందడంతో కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మ ఇళ్ల నుంచి మహ్మద్, షాహీనా దంపతులు నర్సింగ్ హోమ్ వీధికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తహశీన్ ముగ్గురు బిడ్డలను పట్టుకుని భోరున విలపించడం పలువురినీ కంటతడి పెట్టించింది. షాహీనా ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అంజాద్ క్షుద్రపూజలు చేసేవాడా..? హతురాలు తహశీన్ భర్త అంజాద్ పట్టణంలోని పలు మసీదుల్లో మౌజ్గా పనిచేయడమే కాకుండా క్షుద్ర పూజలు చేసేవాడని ప్రచారంలోకి వచ్చింది. పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంజాద్ ఇంటికి రకరకాల కొత్త వ్యక్తులు వచ్చేవారనీ క్షుద్రపూజలు తన ఇంటిలోనే కాకుండా అవసరమైతే పిలిచిన వారి ఇళ్లకు కూడా వెళ్లి చేసేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో మతి చలించిన అంజాద్ భార్యను కిరాతకంగా హతమార్చాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటు అడగలేదని పోలింగ్ బహిష్కరణ
మదనపల్లె : పేదలు నివసించే ప్రాంతమని వివక్ష చూపుతూ, కనీసం ఓటు అడిగేందుకు రాకపోవడంతో మూకుమ్మడిగా అందరూ కలిసి ఓట్లు వేసేందుకు వెళ్లమని పోలింగ్‌ను బహిష్కరించిన సంఘటన పట్టణంలోని విజయనగర్ కాలనీలో జరిగింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్థానిక విజయనగర్ కాలనీ సిమెంట్ రోడ్డు ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మహిళలు ఓటు వేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2, 3 వార్డుల పరిధిలో తమ కాలనీ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు అడిగేందుకు తమ వార్డులకు రాలేదన్నారు. నాయకులు వస్తే వారికి తమ సమస్యలను చెప్పి, గెలిచిన తర్వాత పరిష్కరించమని అడుగుదామనుకుంటే ఎవరూ అటువైపు చూడకపోవడంతో మా ఓట్లు వారికి అవసరం లేదనుకున్నారేమోనని ఓటుకు వెళ్లడం మానుకున్నామని చెప్పారు. -
విరగబూసిన మామిడి పూత
సాక్షి, రామసముద్రం : చిత్తూరూ జిల్లా మదనపల్లె మండలం రామసముద్రంలో మామిడి పూత విరగబూసింది. తీవ్ర వర్షాభావంతో చాలా వరకు మామిడి చెట్లు నీరు లేక ఎండిపోయాయి. కొందరు రైతులు అష్టకష్టాలు పడుతూ నీరు అందిస్తున్నారు. అలాగే మందులు పిచికారీ చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ క్రమంలో మామిడి పూత బాగా పూయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 250 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం చెట్లలో పూత, పిందె విరగబూసింది. పూత, పిందె రాలిపోకుండా నిలిస్తే మంచి దిగుబడి వస్తుందని, మామిడి ధరలు ఆశాజకంగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు. -
కొంటేనే నీళ్లు!
- మదనపల్లెలో జోరుగా నీటి వ్యాపారం - ఒక్కో ట్యాంకర్ నీళ్లు రూ.700లు - రోజుకు 650 ట్రిప్పుల నీళ్ల కొనుగోళ్లు - నెలకు రూ.83 లక్షల ఖర్చు జిల్లాలో పడమటి మండలాల ప్రజలు గుక్కెడు నీళ్లు దొరకక అల్లాడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ట్యాంకర్ల యజమానులు రోజుకో రేటు చొప్పున అడ్డం గా దోచేస్తున్నారు. మదనపల్లె పట్టణంలో నెలకు రూ.7.3 కోట్ల మేర నీటి వ్యాపారం సా గుతోందంటే ఇక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చే సుకోవచ్చు. మదనపల్లె : మదనపల్లె పట్టణంలో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. నాలుగేళ్లుగా వర్షాలు లేకపోవడంతో మంచినీటి బోర్లు, బావులన్నీ దాదాపుగా ఎండిపోయాయి. పట్టణవాసులు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుగోలుచేసి గొంతుతడుపుకోవాల్సి వస్తోంది. మదనపల్లెలో పట్టణంలో మొత్తం 300 ప్రైవేట్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో మున్సిపల్ అధికారులు 112 ట్యాంకులు వినియోగించుకుంటున్నారు. రోజుకు 650 ట్రిప్పులను 13 సంపులకు నింపుతున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.430 చొప్పున ప్రైవేటు ట్యాంకర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు రూ.2.79 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అంటే నెలకు దాదాపుగా రూ.83 లక్షలపైమాటే ఖర్చుచేస్తున్నారు. ట్యాంకర్ల యజమానులకు డబ్బేడబ్బు మదనపల్లె పట్టణంలో దాదాపు 200 దాకా ప్రయివేట్ ట్యాంక ర్లు ఉన్నాయి. ఒక్కో ట్యాంకర్ నీళ్లు రూ.600 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్యాంకరు రోజుకు 15 ట్రిప్పులు వరకూ తోలుతుంటాయి. ఈ లెక్కన 200 ట్యాంకర్లు 3000 ట్రిప్పుల వరకు తోలుతుంటాయి. ఇలా రోజుకు దాదాపు రూ.24 లక్షల వరకు గడిస్తున్నారు. అంటే నెలకు రూ.6.3 కోట్లుదాకా రాబడి వస్తోంది. పట్టణం మొత్తం మీద ఒక్క మంచినీటి కోసమే దాదాపు 7.13 కోట్ల దాకా వెచ్చించాల్సి వస్తోంది. మున్సిపల్ కొళాయిలు ఉన్నా.. మున్సిపల్ పవర్ బోర్లు 264 ఉండగా వాటిలో 70 మాత్రమే పనిచేస్తున్నాయి. 140 హ్యాండ్ బోర్లకుగాను 55 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక కొళాయిలు ఉన్నా అంతంతమాత్రమే. అందులో 10, 15 రోజులకోసారిగానీ నీరు రాని పరిస్థితి. ఎంతకు కొనుగోలు చేస్తారంటే.. ట్యాంకర్ యజమానులు బోర్ల వద్ద ట్యాంకరు నీరు రూ.300 చొప్పున కొనుగోలు చెస్తారు. అదే ట్యాంకరు నీరు కరెంటు లేకపోతే జనరేటర్ ద్వారా నింపితే రూ.350 చొప్పున బోర్ల యజమానులు వసూలు చేస్తుంటారు. అక్కడి నుంచి పట్టణంలో దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకూ నీటిని సరఫరా చేస్తారు. ట్యాంకరు నిర్వాహకులు డ్రైవర్ బత్తా, డీజిల్ ఖర్చు, మెయింటెనెన్స్ కలిపి ట్యాంకరు నీటిని రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు. నీళ్లు కొనలేకపోతున్నాం.. ట్యాంకరు నీటికి రూ700 వెచ్చించాల్సి వస్తోంది. తాగునీటి సమస్య కొన్నేళ్లుగా ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. పాలకులు, అధికారుల హామీలు నీటిమూటలుగా మారుతున్నాయి. - కుమార్, మదనపల్లె