మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం
సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి సంబంధించి కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. అమృత్ పథకంలో భాగంగా పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ(పీకేఎం–ఉడా) ఆధ్వర్యంలో స్కై గ్రూప్ కన్సల్టెంట్ సహకారంతో జీఐఎస్(జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) ఆధారిత మాస్టర్‌ప్లాన్–2041 రూపకల్పన జరిగింది. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి రూపొందించే మాస్టర్‌ప్లాన్‌ను పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, పట్టణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్రంగా తయారుచేయించారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రజల పరిశీలన కోసం 15 రోజుల పాటు పీకేఎం–ఉడా కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచి అభ్యంతరాలు తెలపాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో చేయాల్సిన మార్పులపై సుమారు 25వరకు అర్జీలు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సవరణ చేసిన ప్లాన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్(డీటీసీపీ)కు పంపుతామని, అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కొత్త మాస్టర్‌ప్లాన్ ఆధారంగా చేసుకుని నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం.
జిల్లాలో అతిపెద్ద పట్టణం మదనపల్లె. 35వార్డులు, 44 వార్డు సచివాలయాలు, 14.2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. సుమారు 2లక్షలకు పైగా జనాభా ఉన్నారు. పట్టణంలో గృహ, వాణిజ్యసముదాయాల నిర్మాణాలకు సంబంధించి జీఓ.ఎం.ఎస్.నెం.447, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.5.10.2001న ఆమోదించిన మాస్టర్‌ప్లాన్‌ను ఆధారంగా చేసుకుని అనుమతులు మంజూరుచేస్తున్నారు. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, క్షేత్రస్థాయిలో అమలుకు ముందు డ్రాఫ్ట్‌ప్లాన్‌ను ప్రజల పరిశీలనకు ఉంచి, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని డీటీసీపీ అనుమతులతో అమలుచేయాల్సి ఉంటుంది. మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించి రానున్న 20 ఏళ్లలో ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ పథకం కింద అధునాతన సాంకేతికత సహాయంతో జియోగ్రాఫిక్ ఇన్ఫరేషన్ సిస్టమ్(జీఐఎస్) పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్–2041ను సిద్ధంచేశారు.
రూపకల్పన జరిగిందిలా..
మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా స్కై గ్రూప్ ఏజెన్సీ వారు మొదట పట్టణాన్ని క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. పట్టణ అభివృద్ధి దృష్ట్యా మెయిన్‌రోడ్లు ఎంత వెడల్పు ఉండాలో అంచనా వేసుకున్నారు. మున్సిపల్ లిమిట్స్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్‌డ్ యూజ్, ఇండస్ట్రియల్, పబ్లిక్, సెమీపబ్లిక్, రిక్రియేషన్ జోన్లను గుర్తించారు. గతానికి, ఇప్పటికి చేయాల్సిన మార్పులను గుర్తించి, వాటిని కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పరిధి 14.20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అలాగే కనపరుస్తూ విస్తరణ చేయాలనుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఏఓఐ(ఏరియా ఆఫ్ ఇంటరెస్ట్) కింద అన్నివైపులా మూడుకిలోమీటర్ల రేడియస్ పెంపుతో 37.26 చదరపుకిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
కొత్త మాస్టర్ ప్లాన్‌లో మార్పులు
పట్టణంలోని కోమటివానిచెరువు పాతమాస్టర్‌ప్లాన్‌లో రిక్రియేషన్ గ్రీన్‌లో ఉండేది. కొత్తప్లాన్‌లో చెరువుచుట్టూ ప్రాంతాన్ని బఫర్‌జోన్‌గా మార్చారు. గతంలో రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న కదిరిరోడ్డు, చౌడేశ్వరిగుడి పరిసరప్రాంతాలు, గొల్లపల్లెరోడ్డు, నిమ్మనపల్లెరోడ్డు, సీటీఎంరోడ్డు, బెంగళూరురోడ్డు, పుంగనూరురోడ్డు ప్రాంతాలన్నీ కమర్షియల్‌లోకి మార్పు జరిగాయి. ఇన్నాళ్లు వీటిలో రెసిడెన్షియల్ ప్లాన్ తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు జరపాలంటే టౌన్‌ప్లానింగ్ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై ఆ సమస్య ఉండదు. రెడ్డెప్పనాయుడు కాలనీలో కొంతభాగం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేది. ప్రస్తుతం దాన్ని రెసిడెన్షియల్ జోన్‌లోకి మార్చారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 40–60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్స్‌గా ఏర్పాటుచేశారు. 60అడుగుల రోడ్లను 80–100 అడుగులుగా, పట్టణం మీదుగా వెళుతున్న స్టేట్ హైవేను 100 అడుగుల రోడ్లు చేయాలని ప్రతిపాదనలు పెట్టారు. (క్లిక్: థ్యాంక్యూ.. సీఎం సార్)
సమగ్రంగా పరిశీలించాకే ఫైనల్ ప్లాన్ ఖరారు..
పట్టణ మాస్టర్‌ప్లాన్–2041కు సంబంధించి ప్రధానంగా పట్టాభూములను రిక్రియేషన్ జోన్‌లో పెట్టారని, వాటిని డిలీట్ చేయాల్సిందిగా, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అనుమతిలేని లేఔట్లను మార్చమని, రోడ్ల వెడల్పు మార్చాల్సిందిగా, జోనింగ్‌లకు సంబంధించి, ఎగ్జిస్టింగ్ రోడ్లను మాస్టర్‌ప్లాన్‌రోడ్డుగా చేయమని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పీకేఎం–ఉడా అధికారులకు పంపాం. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్నాక సవరణలు చేసి డీటీసీపీ అనుమతులకు పంపి ఫైనల్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రకటిస్తారు.
– కే.ప్రమీల, మున్సిపల్ కమిషనర్, మదనపల్లె
Comments
Please login to add a commentAdd a comment