అవినీటి వ్యాపారం
దారితప్పించి.. హోటళ్లకు ట్యాంకర్ల తరలింపు
రూ. కోట్లలో నీటి వ్యాపారం శివారులో క‘న్నీటి’కష్టాలు
బస్తీల్లో వారాకి ఒకరోజు సరఫరా
నగరంలో నీటి వ్యాపారం ‘మూడు ట్యాంకర్లు.. ఆరు ఫిల్టర్‌ప్లాంట్లు’ అన్నట్లుగా కొనసాగుతోంది. అసలే వేసవి ఎండలతో భూగర్భజలం అడుగంటింది. శివారు ప్రాంతాల్లో లక్షలాది మందికి జలమండలి నల్లా కనెక్షన్లు లేక...మంచినీళ్లు దొరక్క నానాపాట్లు పడుతున్నారు. బస్తీలకు వెళ్లాల్సిన మంచినీటి ట్యాంకర్లు బడాబాబులకు, వాణిజ్య సంస్థలకు తరలుతున్నాయి. దీంతో నిరుపేదల గొంతెండుతోంది. తప్పనిసరి పరిస్థితిలో జనం ప్రైవేట్ ట్యాంకర్లను, ఫిల్టర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. తద్వారా నెలకు దాదాపు రూ.100 కోట్లకు పైగానే నీటికోసం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లోని నీటి సమస్యపై సాక్షి ఫోకస్.... - సాక్షి, సిటీబ్యూరో
సిటీబ్యూరో: జలమండలి మంచినీటి సరఫరా వ్యవస్థ లేని శివారు ప్రాంతాలు మండువేసవిలో తాగునీటికి విలవిల్లాడుతున్నాయి. బస్తీలకు వెళ్లాల్సిన మంచినీటి ట్యాంకర్లు బడాబాబులకు, వాణిజ్య సంస్థలకు సరఫరా అవుతుండడంతో నిరుపేదల గొంతెండుతోంది. జలమండలి నల్లా కనెక్షన్‌లేని లక్షలాది కుటుంబాలు ప్రైవేటు ట్యాంకర్‌నీళ్లు, ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని ఆశ్రయించి నెలకు రూ.వంద కోట్లకు పైగానే ఖర్చు చేయక తప్పని దుస్థితి తలెత్తింది.
కన్నీటి కష్టాలివిగో..
కాప్రా సర్కిల్ పరిధిలోని సాయిరాంనగర్, సాయిబాబానగర్, ఇందిరానగర్, ఆర్టీసీ కాలనీ, శ్రీశ్రీనగర్, వంపుగూడ, వినాయక్‌నగర్, శాంతివి హార్, అయోధ్యనగర్, గ్రీన్‌పార్కు, న్యూ శ్రీనివాసన గర్, గణేష్‌నగర్, నెహ్రూనగర్, సోనియాగాంధీనగర్, ఆదర్శ్‌నగర్, ఇందిరమ్మ గహకల్ప, బీఎన్‌రెడ్డినగర్, బీజేఆర్‌నగర్, హనుమాన్‌నగర్, భరత్‌నగర్, గోకుల్‌నగర్, బాబానగర్, ఏపీపుడ్స్ గుడిసెలు, అనాధ హాస్టల్, బ్రహ్మపురి కాలనీ సహా మొత్తం 30 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ 50 వేల మందికిపైగా నివసిస్తున్నారు. 27 టా ్యంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. ఒక్కో ట్యాంకర్ రోజుకు 8 ట్రిప్పులు వేయాలి. కానీ నాలుగుతోనే సరిపెడుతున్నారు. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా దారి మళ్లిస్తున్నారు.
సాయిబాబానగర్‌లో ‘మాకు నా లుగు రోజులకు ఒక ట్యాంకర్ రావాల్సి ఉండగా అది ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. దీంతో నీటి కోసం పనులు మానుకోవాల్సి వస్తంది. ట్యాంకర్ నీళ్లకోసం కూలీ డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తోంది’అని కాప్రాకు చెందిన ధనమ్మ వాపోయింది.
‘రాధికా రిజర్వాయర్ రికార్డులో ట్యాంకర్ మా పాయింట్ వద్దకు వచ్చినట్లు ఉంది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో తెలీదు. ఇంటికి బంధువులు వస్తే.. ఎవరైనా సంతోషిస్తారు. కానీ మా పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ సమయంలో ఎందుకొచ్చారా? అని బాధపడాల్సి వస్తోంది’ అని కనకయ్య వాపోయాడు. వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టగలుగుతున్నాం కానీ...దాహమేస్తే మంచినీరు ఇవ్వలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలానగర్, ఫతేనగర్ డివిజన్ లోని వెయ్యి మందికిపైగా ఉండే కార్మికనగర్‌కు రోజుకు ఒక ట్రిప్పు చొప్పున, ఐదు వేల మంది కిై పెగా ఉండే లంబాడీ బస్తీలో రోజుకు నాలుగు ట్రిప్పుల చొప్పున, నవజీవన్‌నగర్‌లో రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా చేస్తుండ గా, బాలానగర్, ఫతేనగర్ ఫరిధిలోని దిల్‌ఖుష్‌నగర్‌కు ప్రతి ఆదివారం, రాజుకాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలోని వారికి ప్రతి గురువారం మాత్రమే మంచినీరు సరఫరా చేస్తున్నారు.
ఉప్పల్ శివారులోని కురుమానగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీనర్సింహా కాలనీలకు పది రోజులకు ఒకసారి మాత్రమే ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీరు సరఫరా అవుతోంది.నగరంలో ఒక వైపు నీటి కొరత వేధిస్తుంటే..మరో వైపు ఐడీపీఎల్,హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, షాపూర్‌నగర్, బాలా నగర్, షాపూర్‌నగర్‌లో ప్రధాన పైప్‌లైన్‌కు ఏర్పడిన లీకేజీలను అరికట్టడంలో జలమండలి అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు. యాప్రాల్ శ్యామల లక్ష్మినగర్, రాజీవ్‌గహకల్ప, బర్షిపేట, కౌకూర్ కిందబస్తి కాలనీల్లో 5 రోజులకు ఒక సారి మంచినీటి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా అవుతుంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల వద్ద ప్రైవేటు నీటి విక్రయాలు జోరందుకున్నాయి. ఒక్కో ట్యాంకర్ రూ.1500 చొప్పున విక్రయిస్తున్నారు.
గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొండాపూర్, ఖానామెట్, హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీ, ప్రకాశ్‌నగర్ తదితర ప్రాంతాలలో వాటర్ మాఫియా విస్తరించుకుంది. గోపన్‌పల్లి తండాలో దాదాపు 10 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో వాటర్ ప్లాంటు నుంచి రోజు 20 వేల లీటర్ల నీటిని తాగు నీటి పేరిట తరలిస్తున్నారు. గోపన్‌పల్లిలో ఆర్‌ఓ ప్లాంట్ల ద్వారా తరలిస్తున్న నీటినే చాలా మంది తాగేందుకు వినియోగిస్తున్నారు. కానీ అపరిశుభ్రమైన వాతావరణంలో, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శుద్ధిచేసి తరలిస్తున్న ఈ నీళ్లు కలుషిత జలాలేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కుత్బుల్లాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా 500కు పైగా నీటి ఫిల్టర్ ప్లాంట్‌లు వెలిశాయి. భగత్‌సింగ్‌నగర్, చంద్రానగర్, విజయ్‌నగర్‌కాలనీ, బోళాశంకర్ నగర్, భూమిరెడ్డి కాలనీ, సుభాష్‌నగర్, భాగ్యలక్ష్మికాలనీ, కురుమ బస్తీ, సీపీఆర్ కాలనీ,తదితర ప్రాంతాల్లో ఎలాంటి నాణ్యతాప్రమాణాలు లేని నీటినే క్యాన్‌ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇరుకు గదుల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో నీటి ప్లాంట్‌లు పెట్టారు.
ఇంటి అద్దెలతో సమానంగా నీటి ఖర్చు..
కొండాపూర్‌లోని గౌతమీ ఎన్‌క్లేవ్‌లో 55 అపార్ట్‌మెంట్లున్నాయి. ప్రతి రోజు 100 ట్యాంకర్‌ల నీళ్ల కొనుగోలుకు లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు .ప్రతి అపార్ట్‌మెంట్‌కు రోజుకు కనీసం 25 వేల లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారు. వీరు ఇంటి అద్దెలతో సమానంగా నీటికి డబ్బులు చెల్లిస్తున్నారు.
నిజాంపేట్‌లో నీటి ఎద్దడి థార్ ఎడారిని తలపిస్తోంది. ఇక్కడ 1500 బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ప్రతి అపార్ట్‌మెంట్‌లో 20 ప్లాట్‌లున్నాయి. నిజాంపేట్‌లో ప్రతి రోజు 3000 ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కు రోజుకు 2 ట్యాంకర్‌లు వినియోగిస్తున్నారు. ఒక్క బండారి లే అవుట్‌లో 225 అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 400 ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఒక్కో అపార్ట్‌మెంట్ వారు నీటి కోసమే నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి ఫ్లాట్ యజమాని ట్యాంకర్ నీళ్లకు రూ.3 వేల చొప్పున, తాగు నీళ్ల కోసం మరో మరో రూ.600 చొప్పున ఖర్చు చేస్తున్నారు.