Private tankers
-
అవినీటి వ్యాపారం
దారితప్పించి.. హోటళ్లకు ట్యాంకర్ల తరలింపు రూ. కోట్లలో నీటి వ్యాపారం శివారులో క‘న్నీటి’కష్టాలు బస్తీల్లో వారాకి ఒకరోజు సరఫరా నగరంలో నీటి వ్యాపారం ‘మూడు ట్యాంకర్లు.. ఆరు ఫిల్టర్‌ప్లాంట్లు’ అన్నట్లుగా కొనసాగుతోంది. అసలే వేసవి ఎండలతో భూగర్భజలం అడుగంటింది. శివారు ప్రాంతాల్లో లక్షలాది మందికి జలమండలి నల్లా కనెక్షన్లు లేక...మంచినీళ్లు దొరక్క నానాపాట్లు పడుతున్నారు. బస్తీలకు వెళ్లాల్సిన మంచినీటి ట్యాంకర్లు బడాబాబులకు, వాణిజ్య సంస్థలకు తరలుతున్నాయి. దీంతో నిరుపేదల గొంతెండుతోంది. తప్పనిసరి పరిస్థితిలో జనం ప్రైవేట్ ట్యాంకర్లను, ఫిల్టర్ ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. తద్వారా నెలకు దాదాపు రూ.100 కోట్లకు పైగానే నీటికోసం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాల్లోని నీటి సమస్యపై సాక్షి ఫోకస్.... - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: జలమండలి మంచినీటి సరఫరా వ్యవస్థ లేని శివారు ప్రాంతాలు మండువేసవిలో తాగునీటికి విలవిల్లాడుతున్నాయి. బస్తీలకు వెళ్లాల్సిన మంచినీటి ట్యాంకర్లు బడాబాబులకు, వాణిజ్య సంస్థలకు సరఫరా అవుతుండడంతో నిరుపేదల గొంతెండుతోంది. జలమండలి నల్లా కనెక్షన్లేని లక్షలాది కుటుంబాలు ప్రైవేటు ట్యాంకర్నీళ్లు, ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిని ఆశ్రయించి నెలకు రూ.వంద కోట్లకు పైగానే ఖర్చు చేయక తప్పని దుస్థితి తలెత్తింది. కన్నీటి కష్టాలివిగో.. కాప్రా సర్కిల్ పరిధిలోని సాయిరాంనగర్, సాయిబాబానగర్, ఇందిరానగర్, ఆర్టీసీ కాలనీ, శ్రీశ్రీనగర్, వంపుగూడ, వినాయక్‌నగర్, శాంతివి హార్, అయోధ్యనగర్, గ్రీన్‌పార్కు, న్యూ శ్రీనివాసన గర్, గణేష్‌నగర్, నెహ్రూనగర్, సోనియాగాంధీనగర్, ఆదర్శ్‌నగర్, ఇందిరమ్మ గహకల్ప, బీఎన్‌రెడ్డినగర్, బీజేఆర్నగర్, హనుమాన్‌నగర్, భరత్‌నగర్, గోకుల్‌నగర్, బాబానగర్, ఏపీపుడ్స్ గుడిసెలు, అనాధ హాస్టల్, బ్రహ్మపురి కాలనీ సహా మొత్తం 30 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ 50 వేల మందికిపైగా నివసిస్తున్నారు. 27 టా ్యంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. ఒక్కో ట్యాంకర్ రోజుకు 8 ట్రిప్పులు వేయాలి. కానీ నాలుగుతోనే సరిపెడుతున్నారు. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా దారి మళ్లిస్తున్నారు. సాయిబాబానగర్‌లో ‘మాకు నా లుగు రోజులకు ఒక ట్యాంకర్ రావాల్సి ఉండగా అది ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. దీంతో నీటి కోసం పనులు మానుకోవాల్సి వస్తంది. ట్యాంకర్ నీళ్లకోసం కూలీ డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తోంది’అని కాప్రాకు చెందిన ధనమ్మ వాపోయింది. ‘రాధికా రిజర్వాయర్ రికార్డులో ట్యాంకర్ మా పాయింట్ వద్దకు వచ్చినట్లు ఉంది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో తెలీదు. ఇంటికి బంధువులు వస్తే.. ఎవరైనా సంతోషిస్తారు. కానీ మా పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ సమయంలో ఎందుకొచ్చారా? అని బాధపడాల్సి వస్తోంది’ అని కనకయ్య వాపోయాడు. వచ్చిన వారికి కడుపునిండా అన్నం పెట్టగలుగుతున్నాం కానీ...దాహమేస్తే మంచినీరు ఇవ్వలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాలానగర్, ఫతేనగర్ డివిజన్ లోని వెయ్యి మందికిపైగా ఉండే కార్మికనగర్‌కు రోజుకు ఒక ట్రిప్పు చొప్పున, ఐదు వేల మంది కిై పెగా ఉండే లంబాడీ బస్తీలో రోజుకు నాలుగు ట్రిప్పుల చొప్పున, నవజీవన్నగర్లో రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా చేస్తుండ గా, బాలానగర్, ఫతేనగర్ ఫరిధిలోని దిల్‌ఖుష్‌నగర్‌కు ప్రతి ఆదివారం, రాజుకాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలోని వారికి ప్రతి గురువారం మాత్రమే మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఉప్పల్ శివారులోని కురుమానగర్, ఉప్పల్ హిల్స్, లక్ష్మీనర్సింహా కాలనీలకు పది రోజులకు ఒకసారి మాత్రమే ట్యాంకర్ల ద్వారా ఉచిత మంచినీరు సరఫరా అవుతోంది.నగరంలో ఒక వైపు నీటి కొరత వేధిస్తుంటే..మరో వైపు ఐడీపీఎల్,హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్, అల్వాల్, షాపూర్‌నగర్, బాలా నగర్, షాపూర్‌నగర్‌లో ప్రధాన పైప్‌లైన్‌కు ఏర్పడిన లీకేజీలను అరికట్టడంలో జలమండలి అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు. యాప్రాల్ శ్యామల లక్ష్మినగర్, రాజీవ్గహకల్ప, బర్షిపేట, కౌకూర్ కిందబస్తి కాలనీల్లో 5 రోజులకు ఒక సారి మంచినీటి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా అవుతుంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాల వద్ద ప్రైవేటు నీటి విక్రయాలు జోరందుకున్నాయి. ఒక్కో ట్యాంకర్ రూ.1500 చొప్పున విక్రయిస్తున్నారు. గోపన్‌పల్లి, నానక్‌రాంగూడ, మాదాపూర్, కొండాపూర్, ఖానామెట్, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, ప్రకాశ్‌నగర్ తదితర ప్రాంతాలలో వాటర్ మాఫియా విస్తరించుకుంది. గోపన్‌పల్లి తండాలో దాదాపు 10 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో వాటర్ ప్లాంటు నుంచి రోజు 20 వేల లీటర్ల నీటిని తాగు నీటి పేరిట తరలిస్తున్నారు. గోపన్‌పల్లిలో ఆర్ఓ ప్లాంట్ల ద్వారా తరలిస్తున్న నీటినే చాలా మంది తాగేందుకు వినియోగిస్తున్నారు. కానీ అపరిశుభ్రమైన వాతావరణంలో, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా శుద్ధిచేసి తరలిస్తున్న ఈ నీళ్లు కలుషిత జలాలేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కుత్బుల్లాపూర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా 500కు పైగా నీటి ఫిల్టర్ ప్లాంట్లు వెలిశాయి. భగత్‌సింగ్‌నగర్, చంద్రానగర్, విజయ్‌నగర్‌కాలనీ, బోళాశంకర్ నగర్, భూమిరెడ్డి కాలనీ, సుభాష్‌నగర్, భాగ్యలక్ష్మికాలనీ, కురుమ బస్తీ, సీపీఆర్ కాలనీ,తదితర ప్రాంతాల్లో ఎలాంటి నాణ్యతాప్రమాణాలు లేని నీటినే క్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇరుకు గదుల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో నీటి ప్లాంట్లు పెట్టారు. ఇంటి అద్దెలతో సమానంగా నీటి ఖర్చు.. కొండాపూర్‌లోని గౌతమీ ఎన్‌క్లేవ్‌లో 55 అపార్ట్మెంట్లున్నాయి. ప్రతి రోజు 100 ట్యాంకర్ల నీళ్ల కొనుగోలుకు లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు .ప్రతి అపార్ట్‌మెంట్‌కు రోజుకు కనీసం 25 వేల లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారు. వీరు ఇంటి అద్దెలతో సమానంగా నీటికి డబ్బులు చెల్లిస్తున్నారు. నిజాంపేట్‌లో నీటి ఎద్దడి థార్ ఎడారిని తలపిస్తోంది. ఇక్కడ 1500 బహుళ అంతస్తుల భవనాలున్నాయి. ప్రతి అపార్ట్మెంట్లో 20 ప్లాట్లున్నాయి. నిజాంపేట్‌లో ప్రతి రోజు 3000 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ప్రతి అపార్ట్‌మెంట్‌కు రోజుకు 2 ట్యాంకర్లు వినియోగిస్తున్నారు. ఒక్క బండారి లే అవుట్లో 225 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు 400 ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఒక్కో అపార్ట్మెంట్ వారు నీటి కోసమే నెలకు సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి ఫ్లాట్ యజమాని ట్యాంకర్ నీళ్లకు రూ.3 వేల చొప్పున, తాగు నీళ్ల కోసం మరో మరో రూ.600 చొప్పున ఖర్చు చేస్తున్నారు. -
వాటర్ వార్
నగరంలో నీటి కష్టాలు రోడ్డెక్కిన జనం వివిధ ప్రాంతాల్లో ఆందోళన జలమండలి కార్యాలయంపై రాళ్ల దాడి సాక్షి, సిటీబ్యూరో, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్:పెరుగుతున్న ఎండలు .. వట్టిపోయిన బోరుబావులు.. చుక్క నీరు రాల్చని జలమండలి కుళాయిలు...సమయానికి రాని ట్యాంకర్లు....వేళాపాళా లేని నీటి సరఫరా.. జేబులు గుల్ల చేస్తున్న ప్రైవేటు ట్యాంకర్లు.. వీటికి తోడు పులిమీద పుట్రలా ఉసురు తీస్తున్న కలుషిత జలాలు....ఇవీ నగర వాసుల నీటి కష్టాలు. దీనికితోడు కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా నగరానికి వచ్చే 180 ఎంజీడీల జలాల సరఫరాను ఇటీవల 24 గంటల పాటు నిలిపివేయడంతో శివార్లలోని స్టోరేజి రిజర్వాయర్లు ఖాళీ అయిపోయాయి. వీటిని నింపడం ఆలస్యం కావడంతో సరఫరా నిలిచిపోయి...జనం అష్టకష్టాలు పడ్డారు. నీటి సరఫరా పునరుద్ధరించామని ఓవైపు అధికారులు చెబుతుంటే...నాలుగు రోజులుగా గుక్కెడు నీరు లేక అల్లాడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. నీరు రాకపోవడంతో జనంలో కోపం కట్టలు తెంచుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం నిరసన తెలిపారు. చింతల్‌లోని జలమండలి కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు. రాజేంద్రనగర్, మూసాపేట్, మారేడ్‌పల్లి, మంగళ్‌హాట్ తదితర ప్రాంతాల్లో నీటి కోసం ఆందోళన బాట పట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని వందలాది కాలనీల్లో నీటి కష్టాలు తీవ్రమవుతుండడంతో నిరసనలు మిన్నంటుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఆందోళనలు ఇలా... కుత్బుల్లాపూర్.. ‘జీఎం డౌన్.. డౌన్.. జీఎం, డీజీఎంలను బదిలీ చేయండి..’ అంటూ జలం కోసం జనం గళమెత్తారు. ఖాళీ బిందెలతో ప్రదర్శనగా వెళ్లి... చింతల్ డీజీఎం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో సోమవారం వివిధ కాలనీలు, బస్తీల నుంచి తరలివచ్చిన జనం ఆందోళనలో పాల్గొన్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీఎం ప్రవీణ్‌కుమార్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆందోళన చేసినా...మారని అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జీఎం ప్రవీణ్‌కుమార్, డీజీఎం రంగారావు కేవలం కనెక్షన్లు, కలెక్షన్ల కోసం ఇక్కడ పని చేస్తున్నారని, ప్రజలకు నీటి సరఫరా చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఒక దశలో సహనం కోల్పోయిన ఆందోళనకారులు కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు పగిలి ఆందోళన చేస్తున్న వారిపై పడ్డాయి. ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. కొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న వారిపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించగా... టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారంది. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వివేకానంద్ ఆందోళనకారులను శాంతింపజేసి... కార్యాలయంలో ఉన్న జీఎం ప్రవీణ్‌కుమార్‌ను బయటకు రప్పించి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై జీఎం స్పందిస్తూ 15 రోజుల్లో కృష్ణా మూడోదశ ద్వారా నగరానికి అదనంగా అందే నీటిని దశల వారీగా ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్‌లో.. మంచినీటిని అందించాలని, చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ శివరాంపల్లి వికర్సెక్షన్ కాలనీ ప్రజలు సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారాన్ని ముసివేసి ఆందోళనకు దిగారు. ఇన్చార్జి ఉపక మిషనర్ దశరథ్ కాలనీ ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలపడంతో వారు ఆందోళన విరమించారు. వీకర్ సెక్షన్ కాలనీలో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా జరగడంలేదు. స్థానికం గా ఉన్న నాలుగు బోర్లు పనిచేయడం లేదు. దీంతో ప్రజ లు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సర్కిల్ అధికారులతో పాటు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మారేడ్‌పల్లి.. కలుషిత జలాల సరఫరాను నియంత్రించి... డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ సికింద్రాబాద్ ప్రాంత టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. మారేడుపల్లిలోని జలమండలి కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పలువురు మహిళలు ఖాళీ కుండ లతో హాజరై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా సక్రమంగా లేక జనం గొంతెండుతోందని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా అరకొరగా అవుతున్న నీటి సరఫరా, కలుషిత జలాలతో సతమతమవుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. మూసాపేట్.. స్థానిక శక్తి నగర్ కాలనీలో కలుషిత జలాల సరఫరాపై బస్తీవాసులు నిరసన వ్యక్తం చేశారు. మూసాపేట సెక్షన్ వాటర్‌వర్క్స్ మెనేజర్ వెంకటేశ్వర్లును కలిసి సమస్యలు విన్నవించారు. మురుగు నీరు కలిసిన బాటిల్‌ను చూపించారు. మూడేళ్లుగా ఈ సమస్య నెలకొందని, మంచినీరు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. -
ఫ్లాట్లు.. నీటి పాట్లు
అపార్ట్మెంట్ల జలఘోష తడిసి మోపెడవుతున్న నీటి ఖర్చు అరకొరగా జలమండలి నీటి సరఫరా ప్రైవేటు ట్యాంకర్ల జల దోపిడీ గ్రేటర్ లో 35 వేల అపార్ట్మెంట్లపై రూ.105 కోట్ల భారం పట్టించుకోని జలమండలి, జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో: మండువేసవిలో అపార్ట్మెంట్ వాసులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. జలమండలి అరకొరగా సరఫరా చేస్తున్న కుళాయి, ట్యాంకర్ నీళ్లు సరి పోకపోవడం, బోరుబావులు బావురుమనడంతో ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మహానగరం పరిధిలో సుమారు 50 వేల అపార్ట్‌మెంట్లుండగా వీటిలో సుమారు 35 వేల అపార్ట్మెంట్లలో ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నీటి కోసం ఒక్కో ఫ్లాట్ యజ మాని నెలకు రూ.2500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీరని దాహార్తి గ్రేటర్ పరిధిలో సుమారు 22 లక్షల భవనాలుండగా.. జలమండలి కేవలం 8 లక్షల కుళాయిలకే నల్లా నీళ్లు సరఫరా చేస్తోంది. మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలో లక్షలాది భవనాలు, బహుళ అంతస్తుల భవంతులకు జలమండలి కుళాయి కనెక్షన్లు లేవంటే అతిశయోక్తి కాదు. వీరంతా బోరు బావులను, ప్రైవేటు ట్యాంకర్ నీళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ వేసవిలో భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల నీటికి మరింత డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. వీరిపై ప్రభుత్వపరమైన నియంత్రణ లేకపోవడంతో ఐదు వేల లీటర్ల ట్యాంకర్ నీళ్లను రూ.వెయ్యి, పదివేల లీటర్ల ట్యాంకర్ నీళ్లను రూ. రెండు వేల చొప్పున విక్రయిస్తూ జేబులు నింపుకుంటూ ఉండటం గమనార్హం. ఫ్లాట్ల యజమానులకు గుదిబండ ప్రైవేటు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్న అపార్ట్మెంట్ వినియోగదారులు అదనపు భారంతో కుదేలవుతున్నారు. సుమారు 12 ఫ్లాట్లున్న అపార్ట్‌మెంట్‌కు నిత్యం ఐదువేల లీటర్లు కలిగిన ప్రైవేటు ట్యాంకర్ నీటిని కొనుగోలు చేసినా.. రోజుకు వేయి రూపాయలు..నెలకు రూ.30 వేల చొప్పున ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ఒక్కో ఫ్లాటు యజమానికి నెలకు నీటి కోసమే రూ.2500 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్న మాట. మొత్తంగా చూస్తే.. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 35 వేల అపార్ట్మెంట్ల వినియోగదారులు నీటి కోసం నెలకు సుమారు రూ.105 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న మాట. ఏప్రిల్, మే నెలల్లో నీటి కోసం అదనపు ఖర్చు తప్పడం లేదని నిజాంపేట్, మదీనాగూడా, సైనిక్‌పురి, చందానగర్, సిక్‌విలేజ్, మల్కాజిగిరి, బోయిన్పల్లి, కూకట్పల్లి, ఉప్పల్, నాగోల్ తదితర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల జలదోపిడీని అడ్డుకోవడంలో జలమండలి, జీహెచ్ఎంసీలు విఫలమౌతున్నాయని ఆరోపిస్తున్నారు. కనీసం రూ.500 చొప్పున వసూలు చేసి జలమండలి అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని.. బుక్ చేసిన రెండు గంటల్లోనే ట్యాంకర్‌ను పంపాలని కోరుతున్నారు. జలమండలి ట్యాంకర్లను నమ్ముకుంటే అంతే జలమండలికి సంబంధించిన 56 మంచినీటి ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఉండే 674 ట్యాంకర్లు నిత్యం సరఫరా నెట్వర్క్ లేని ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నాయి. కానీ ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు. ఉదాహరణకు ఈ నెల ఒకటో తేదీ నుంచి 22 వరకు 32 వేల ట్యాంకర్ ట్రిప్పుల కోసం వినియోగదారుల నుంచి బుకింగ్‌లు అందాయి. వీరందరికీ సరఫరా అందించేందుకు 48 గంటలు పట్టింది. అంటే వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యం ఏమిటో అర్థమౌతోంది. జలమండలి ట్యాంకర్లను నమ్ముకుంటే దాహార్తి తీరడం లేదని పలువురు శివారు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.