వాటర్ వార్
నగరంలో నీటి కష్టాలు
రోడ్డెక్కిన జనం
వివిధ ప్రాంతాల్లో ఆందోళన
జలమండలి కార్యాలయంపై రాళ్ల దాడి
సాక్షి, సిటీబ్యూరో, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్:పెరుగుతున్న ఎండలు .. వట్టిపోయిన బోరుబావులు.. చుక్క నీరు రాల్చని జలమండలి కుళాయిలు...సమయానికి రాని ట్యాంకర్లు....వేళాపాళా లేని నీటి సరఫరా.. జేబులు గుల్ల చేస్తున్న ప్రైవేటు ట్యాంకర్లు.. వీటికి తోడు పులిమీద పుట్రలా ఉసురు తీస్తున్న కలుషిత జలాలు....ఇవీ నగర వాసుల నీటి కష్టాలు. దీనికితోడు కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా నగరానికి వచ్చే 180 ఎంజీడీల జలాల సరఫరాను ఇటీవల 24 గంటల పాటు నిలిపివేయడంతో శివార్లలోని స్టోరేజి రిజర్వాయర్లు ఖాళీ అయిపోయాయి. వీటిని నింపడం ఆలస్యం కావడంతో సరఫరా నిలిచిపోయి...జనం అష్టకష్టాలు పడ్డారు.
నీటి సరఫరా పునరుద్ధరించామని ఓవైపు అధికారులు చెబుతుంటే...నాలుగు రోజులుగా గుక్కెడు నీరు లేక అల్లాడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. నీరు రాకపోవడంతో జనంలో కోపం కట్టలు తెంచుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం నిరసన తెలిపారు. చింతల్‌లోని జలమండలి కార్యాలయంపై రాళ్ల దాడికి దిగారు. రాజేంద్రనగర్, మూసాపేట్, మారేడ్‌పల్లి, మంగళ్‌హాట్ తదితర ప్రాంతాల్లో నీటి కోసం ఆందోళన బాట పట్టారు. మరోవైపు జీహెచ్‌ఎంసీలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలోని వందలాది కాలనీల్లో నీటి కష్టాలు తీవ్రమవుతుండడంతో నిరసనలు మిన్నంటుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఆందోళనలు ఇలా...
కుత్బుల్లాపూర్..
‘జీఎం డౌన్.. డౌన్.. జీఎం, డీజీఎంలను బదిలీ చేయండి..’ అంటూ జలం కోసం జనం గళమెత్తారు. ఖాళీ బిందెలతో ప్రదర్శనగా వెళ్లి... చింతల్ డీజీఎం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో సోమవారం వివిధ కాలనీలు, బస్తీల నుంచి తరలివచ్చిన జనం ఆందోళనలో పాల్గొన్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీఎం ప్రవీణ్‌కుమార్ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆందోళన చేసినా...మారని అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జీఎం ప్రవీణ్‌కుమార్, డీజీఎం రంగారావు కేవలం కనెక్షన్లు, కలెక్షన్ల కోసం ఇక్కడ పని చేస్తున్నారని, ప్రజలకు నీటి సరఫరా చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
ఒక దశలో సహనం కోల్పోయిన ఆందోళనకారులు కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కిటికీ అద్దాలు పగిలి ఆందోళన చేస్తున్న వారిపై పడ్డాయి. ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. కొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది బయటకు వచ్చి ఆందోళన చేస్తున్న వారిపై దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించగా... టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారంది. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే వివేకానంద్ ఆందోళనకారులను శాంతింపజేసి... కార్యాలయంలో ఉన్న జీఎం ప్రవీణ్‌కుమార్‌ను బయటకు రప్పించి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై జీఎం స్పందిస్తూ 15 రోజుల్లో కృష్ణా మూడోదశ ద్వారా నగరానికి అదనంగా అందే నీటిని దశల వారీగా ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
రాజేంద్రనగర్‌లో..
మంచినీటిని అందించాలని, చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ శివరాంపల్లి వికర్‌సెక్షన్ కాలనీ ప్రజలు సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారాన్ని ముసివేసి ఆందోళనకు దిగారు. ఇన్‌చార్జి ఉపక మిషనర్ దశరథ్ కాలనీ ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలపడంతో వారు ఆందోళన విరమించారు. వీకర్ సెక్షన్ కాలనీలో గత కొన్ని రోజులుగా మంచినీటి సరఫరా జరగడంలేదు. స్థానికం గా ఉన్న నాలుగు బోర్లు పనిచేయడం లేదు. దీంతో ప్రజ లు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సర్కిల్ అధికారులతో పాటు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
మారేడ్‌పల్లి..
కలుషిత జలాల సరఫరాను నియంత్రించి... డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ సికింద్రాబాద్ ప్రాంత టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. మారేడుపల్లిలోని జలమండలి కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పలువురు మహిళలు ఖాళీ కుండ లతో హాజరై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా సక్రమంగా లేక జనం గొంతెండుతోందని ఆరోపించారు. మరికొన్ని ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా అరకొరగా అవుతున్న నీటి సరఫరా, కలుషిత జలాలతో సతమతమవుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు.
మూసాపేట్..
స్థానిక శక్తి నగర్ కాలనీలో కలుషిత జలాల సరఫరాపై బస్తీవాసులు నిరసన వ్యక్తం చేశారు. మూసాపేట సెక్షన్ వాటర్‌వర్క్స్ మెనేజర్ వెంకటేశ్వర్లును కలిసి సమస్యలు విన్నవించారు. మురుగు నీరు కలిసిన బాటిల్‌ను చూపించారు. మూడేళ్లుగా ఈ సమస్య నెలకొందని, మంచినీరు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు.