ఫ్లాట్లు.. నీటి పాట్లు | .. Water pot for sale | Sakshi
Sakshi News home page

ఫ్లాట్లు.. నీటి పాట్లు

Published Sat, May 24 2014 3:58 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

ఫ్లాట్లు.. నీటి పాట్లు - Sakshi

ఫ్లాట్లు.. నీటి పాట్లు

  •       అపార్ట్‌మెంట్ల జలఘోష
  •      తడిసి మోపెడవుతున్న నీటి ఖర్చు
  •      అరకొరగా జలమండలి నీటి సరఫరా
  •      ప్రైవేటు ట్యాంకర్ల జల దోపిడీ
  •      గ్రేటర్ లో 35 వేల అపార్ట్‌మెంట్లపై రూ.105 కోట్ల భారం
  •      పట్టించుకోని జలమండలి, జీహెచ్‌ఎంసీ
  •  సాక్షి, సిటీబ్యూరో: మండువేసవిలో అపార్ట్‌మెంట్ వాసులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. జలమండలి అరకొరగా సరఫరా చేస్తున్న కుళాయి, ట్యాంకర్ నీళ్లు సరి పోకపోవడం, బోరుబావులు బావురుమనడంతో ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మహానగరం పరిధిలో సుమారు 50 వేల అపార్ట్‌మెంట్లుండగా వీటిలో సుమారు 35 వేల అపార్ట్‌మెంట్లలో ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. నీటి కోసం ఒక్కో ఫ్లాట్ యజ మాని నెలకు రూ.2500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
     
    తీరని దాహార్తి

    గ్రేటర్ పరిధిలో సుమారు 22 లక్షల భవనాలుండగా.. జలమండలి కేవలం 8 లక్షల కుళాయిలకే నల్లా నీళ్లు సరఫరా చేస్తోంది. మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాల్టీల పరిధిలో లక్షలాది భవనాలు, బహుళ అంతస్తుల భవంతులకు జలమండలి కుళాయి కనెక్షన్లు లేవంటే అతిశయోక్తి కాదు. వీరంతా బోరు బావులను, ప్రైవేటు ట్యాంకర్ నీళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది.

    ఈ వేసవిలో భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల నీటికి మరింత డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. వీరిపై ప్రభుత్వపరమైన నియంత్రణ లేకపోవడంతో ఐదు వేల లీటర్ల ట్యాంకర్ నీళ్లను రూ.వెయ్యి, పదివేల లీటర్ల ట్యాంకర్ నీళ్లను రూ. రెండు వేల చొప్పున విక్రయిస్తూ జేబులు నింపుకుంటూ ఉండటం గమనార్హం.
     
    ఫ్లాట్ల యజమానులకు గుదిబండ

    ప్రైవేటు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేస్తున్న అపార్ట్‌మెంట్ వినియోగదారులు అదనపు భారంతో కుదేలవుతున్నారు. సుమారు 12 ఫ్లాట్లున్న అపార్ట్‌మెంట్‌కు నిత్యం ఐదువేల లీటర్లు కలిగిన ప్రైవేటు ట్యాంకర్ నీటిని కొనుగోలు చేసినా.. రోజుకు వేయి రూపాయలు..నెలకు రూ.30 వేల చొప్పున ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ఒక్కో ఫ్లాటు యజమానికి నెలకు నీటి కోసమే రూ.2500 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్న మాట. మొత్తంగా చూస్తే.. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న 35 వేల అపార్ట్‌మెంట్ల వినియోగదారులు నీటి కోసం నెలకు సుమారు రూ.105 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న మాట.

    ఏప్రిల్, మే నెలల్లో నీటి కోసం అదనపు ఖర్చు తప్పడం లేదని నిజాంపేట్, మదీనాగూడా, సైనిక్‌పురి, చందానగర్, సిక్‌విలేజ్, మల్కాజిగిరి, బోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, నాగోల్ తదితర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల జలదోపిడీని అడ్డుకోవడంలో జలమండలి, జీహెచ్‌ఎంసీలు విఫలమౌతున్నాయని ఆరోపిస్తున్నారు. కనీసం రూ.500 చొప్పున వసూలు చేసి జలమండలి అదనపు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని.. బుక్ చేసిన రెండు గంటల్లోనే ట్యాంకర్‌ను పంపాలని కోరుతున్నారు.
     
    జలమండలి ట్యాంకర్లను నమ్ముకుంటే అంతే

    జలమండలికి సంబంధించిన 56 మంచినీటి ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఉండే 674 ట్యాంకర్లు నిత్యం సరఫరా నెట్‌వర్క్ లేని ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేస్తున్నాయి. కానీ ఇవి ఏమూలకూ సరిపోవడం లేదు. ఉదాహరణకు ఈ నెల ఒకటో తేదీ నుంచి 22 వరకు 32 వేల ట్యాంకర్ ట్రిప్పుల కోసం వినియోగదారుల నుంచి బుకింగ్‌లు అందాయి. వీరందరికీ సరఫరా అందించేందుకు 48 గంటలు పట్టింది. అంటే వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యం ఏమిటో అర్థమౌతోంది. జలమండలి ట్యాంకర్లను నమ్ముకుంటే దాహార్తి తీరడం లేదని పలువురు శివారు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement