అవినీటి కనెక్షన్లు
- నల్లా కనెక్షన్ల మంజూరులో చేతివాటం
- అపార్ట్‌మెంట్ల కనెక్షన్ల జారీలో గోల్‌మాల్
- క్షేత్రస్థాయి నివేదికలు తారుమారు
- బ్రిగేడ్, సింగిల్ విండో సిబ్బంది నిర్వాకం
- లక్షలాది రూపాయలు పక్కదారి?
సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలోని పలు విభాగాల్లో అవినీతి పేరుకుపోయింది. చేయి తడపనిదే ఏ పనీ కావట్లేదు. కొందరు అధికారులు, సిబ్బంది కక్కుర్తి వల్ల ఖజానాకు పెద్ద మొత్తంలో చిల్లుపడుతోంది. కొందరు అధికారులు బిల్డర్లకు వత్తాసు పలుకుతూ నల్లా కనెక్షన్లను అక్రమంగా జారీ చేస్తున్నారు.
అనుమతులకు సంబంధించి అవసరమైన సర్టిఫికెట్లు లేకపోయినా క్షేత్రస్థాయి నివేదికలను తారుమారు చేసి వారి ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. అదే సామాన్యుడిని మాత్రం నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారు. బహుళ అంతస్తుల భవంతులకు (అపార్ట్‌మెంట్లకు) నల్లా కనెక్షన్ల జారీ వ్యవహారం జలమండలిలోని కొందరు అధికారులు, గ్రీన్‌బ్రిగేడ్ గుత్తేదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.
నిబంధనలకు నీళ్లొదిలి నిర్మాణ విస్తీర్ణాన్ని తక్కువ చూపడమే కాక, క్షేత్రస్థాయి నివేదికలను తారుమారు చేసి కనెక్షన్లు జారీ చేసేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో నెలకు వందకుపైగా బహుళ అంతస్తుల భవంతులకు నల్లా కనెక్షన్లు జారీ చేస్తున్న సింగిల్ విండో సెల్ అధికారులు కొందరు, గ్రీన్‌బ్రిగేడ్ గుత్తేదారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒక్కో కనెక్షన్‌పై రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు సమాచారం.
అంతా ఇష్టారాజ్యమే..
బహుళ అంతస్తుల భవనాలకు జీహెచ్‌ఎంసీ జారీ చేసే ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం, ఇంకుడు గుంత, నిర్మాణపరమైన అనుమతులు లేకున్నా నల్లా కనెక్షన్లు జారీ చేస్తున్నారు. జలమండలి పరిధిలో 8.05 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటితోపాటు ప్రతి నెలా 1,600 వరకు గృహ వినియోగ, బహుళ అంతస్తుల భవనాలకు కనెక్షన్ల కోసం దరఖాస్తులు వస్తుంటాయి.
బహుళ అంతస్తుల భవనానికి నల్లా కనెక్షన్ జారీకి నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి రూ.1.80 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు చార్జీలను జలమండలి వసూలు చేస్తుంది. నిర్మాణ విస్తీర్ణాన్ని కొన్ని చదరపు మీటర్లు తగ్గించి చూపితే బిల్డర్‌కు రూ.లక్ష మిగులుతాయి. ఇదే అదనుగా సింగిల్ విండో విభాగం సిబ్బంది కొందరు బిల్డర్లకు అనుకూలంగా వ్యవహరించి, జేబులు నింపుకొంటున్నట్టు తెలుస్తోంది.
ఇదే తరహాలో క్షేత్రస్థాయి నుంచి నల్లా కనెక్షన్ల జారీకి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి వచ్చే ఫైళ్లలో అవసరమైన పత్రాలను తారుమారు చేసి, కనెక్షన్ జారీ కమిటీ నుంచి నేరుగా అనుమతులు పొందుతున్నట్టు సమాచారం. ఆ తరువాత గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది తక్షణం వాటికి కనెక్షన్ ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తోంది. సింగిల్ విండో సిబ్బందికి అనుకూలంగా ఉండే గ్రీన్‌బ్రిగేడ్ గుత్తేదారులకే ఆ పనులను అప్పగిస్తున్నట్టు సమాచారం.
విజి‘లెన్స్’ అవసరం
బహుళ అంతస్తుల భవనాలకు జారీ చేస్తోన్న కనెక్షన్లపై విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తే అక్రమాల డొంక కదులుతుందని దరఖాస్తుదారులు, వినియోగదారులు చెబుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలకు నల్లా కనెక్షన్ జారీ వ్యవహారంలో క్షేత్ర స్థాయిలో నివేదిక మొదలు, డీజీఎం, జీఎం, సీజీఎం, ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయం, గ్రీన్‌బ్రిగేడ్ గుత్తేదారుల స్థాయిలో జరుగుతున్న అక్రమాలు వెలుగు చూడాలంటే విజిలెన్స్ విచారణ తప్పనిసరని వారంటున్నారు.