
ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లలో ఎక్కువగా కనిపించే హైరైజ్ నిర్మాణాలు క్రమంగా హైదరాబాద్‌లోనూ జోరందుకుంటున్నాయి. అత్యంత ఎత్తులో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరగడం, భవనాల ఎత్తుకు నిబంధనలు లేకపోవడం వంటి కారణాలతో నగరంలో ఆకాశహర్మ్యాలు పెరుగుతున్నాయి. గతేడాది హైదరాబాద్‌లో 10, అంతకంటే ఎత్తయిన హైరైజ్ ప్రాజెక్ట్‌లు 57 ప్రారంభం కాగా.. బెంగళూరులో 51, చెన్నైలో 10 ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలోనే భాగ్యనగరం ప్రథమ స్థానంలో నిలిచిందని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. హైదరాబాద్‌లో ఏటా సగటున 1,400 అపార్ట్‌మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తుల పైన ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాలుంటాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులపైన ప్రాజెక్ట్‌లుంటాయి. – సాక్షి, సిటీబ్యూరో
ఆధునిక హంగులతో ఆకాశహర్మ్యాలు
హైరైజ్ ప్రాజెక్ట్‌లలో నివాసానికి కస్టమర్ల ఆసక్తి
నగరంలో విలాసవంతమైన గృహాలకు ఆదరణ
ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లలో భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్‌కు ఆ సమస్య లేదు. ఔటర్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఆకాశహర్మ్యాలు పెరగడానికి కారణం సిటీలోనే ఉండాలని ఎక్కువ
మంది కోరుకోవడమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డెవలపర్లు కూడా స్కై స్క్రాపర్లను నిర్మించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఐదేళ్లలో భూముల ధరలు బాగా పెరిగాయి. ప్రభుత్వమే వీటిని వేలం వేయడంతో ఈ ప్రభావం ధరల పెరుగుదలకు కారణమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వెస్ట్‌లోనే ఎక్కువ..
వెస్ట్ హైదరాబాద్‌లోని హైరైజ్ ప్రాజెక్ట్‌లలో నివసించేందుకు నివాసితులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్‌ఏఎస్, బ్రిగేడ్, అపర్ణా, ప్రణీత్ గ్రూప్, పౌలోమీ, రాఘవ, మైహోమ్, వాసవి, ఐరా రియాల్టీ, హానర్ వంటి సంస్థలు నగరం నలువైపులా హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి.
కోకాపేట వంటి ప్రాంతాల్లో ఎకరా ధర రూ.50 కోట్లకు చేరింది. మరోవైపు అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్‌ఎస్‌ఐ)తో ఎన్ని అంతస్తులైనా నిర్మించుకునే వెసులుబాటు ఏర్పడింది. దీంతో ఎకరా రూ.10 కోట్లు ఉన్న చోట పది అంతస్తులు, రూ.20 కోట్లుంటే 20 ఫ్లోర్లు.. ఇలా పెంచుకుంటూ పోతున్నారు. కోకాపేట, రాయదుర్గం, శేరిలింగంపల్లి, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, గోపన్‌పల్లి, మదీనాగూడ, మియాపూర్, తెల్లాపూర్, పుప్పాల్‌గూడ వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి.
ఇలా నియంత్రించాలి..
➤ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తయితే అక్కడ జనసాంద్రత, వాహనాల రద్దీ తట్టుకోలేం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ మౌలిక వసతులను కల్పించాలి. వ్యయాలలో ఆయా ప్రాంతాల్లోని నిర్మాణ సంస్థలనూ ఇందులో భాగస్వామ్యం చేయాలి.
➤ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 20 శాతంలోపు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు
వినియోగించాలి.
➤సాధారణ భవన నిర్మాణలతో పోలిస్తే హైరైజ్ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ, పర్యవేక్షణ అవసరం. పర్మిషన్ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం.
➤ప్రతి అంతస్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి ఇతరత్రా అంశాలను తనిఖీ చేయాలి.
➤హైరైజ్ భవనాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణంలో నాణ్యతను పరిశీలించాలి.
➤ఇతర మెట్రో నగరాలలో అందుబాటులో ఉన్నంత స్థాయిలో హైదరాబాద్‌లో మెయింటనెన్స్, సపోర్టింగ్ సర్వీస్‌లు అందించే కన్సల్టెన్సీలు అందుబాటులో లేవు. అందుకే కనీసం ఐదేళ్ల పాటు హైరైజ్ భవనాల నిర్వహణ నిర్మాణ సంస్థలే సామాజిక బాధ్యతలా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మెయింటనెన్స్‌లలో బిల్డర్లకు ఉన్నంత అనుభవం నివాసిత సంఘాలకు ఉండవు.
హోదా, అద్దె ఆదాయం కోసం..
హైరైజ్ అపార్ట్‌మెంట్‌లలో నివాసం ఉండటాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. మెరుగైన రాబడి, అద్దెలు వస్తాయని మంచి పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, దగ్గర్లో విద్యా, వైద్య సదుపాయాలు ఉండటం అన్నింటికీ మించి సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆకాశమంత ఎత్తులో అపార్ట్‌మెంట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment