జలగండం
ముంచుకొస్తున్న నీటిముప్పు
జిల్లాలో నీటి సమస్య ఉన్న గ్రామాలు 1,713
పడమటి మండలాల్లో పరిస్థితి మరింత దారుణం
ప్రయివేటు నీటి వ్యాపారం రూ.కోట్లలో
తరుముకొస్తున్న వేసవి పరిష్కారం చూపని సీఎం
తాగునీటి ఇక్కట్లు తీరేదెట్టా?
జిల్లాలోని పూతలపట్టు, కుప్పం, తంబళ్లపల్లె, గంగాధర నెల్లూరు, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల పరిధిలో గతంలో 1,713 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండేది. తాజాగా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. వారం రోజులకు ఒక్కసారి కూడా ప్రభుత్వ పథకాల ద్వారా నీరు అందడం లేదు. ఆర్థిక స్థోమత ఉన్న వారు నీళ్లు కొనుక్కుంటుండగా, లేని వారు నానా తిప్పలు పడుతున్నారు.
వేసవి తరుముకొస్తోంది. జిల్లాలో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాభావం వల్ల భూగర్భజలాలు పాతాళంలోకి అడుగంటాయి. అరకొరగా ఉన్న బోరుబావులు సైతం ఒట్టిపోయాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాదాపు రెండువేల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వేసవి తీవ్రత పెరిగే నాటికి ఉన్న బోరుబావులు కూడా నీటిని అందించే పరిస్థితి కానరావడం లేదు. అధికారులు వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిన దాఖలాలు లేవు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటికే బిల్లులు ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. ముఖ్యమంత్రి పైసా నిధులివ్వక మాటలతోనే సరిపెడుతున్నారు. దీంతో మరో రెండు మూడు నెలల తర్వాత పరిస్థితి ఊహించుకుంటే భయమేస్తోంది.
స్పందించని ముఖ్యమంత్రి
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జిల్లా తాగునీటి సమస్యను గాలికి వదిలేశారు. హంద్రీ-నీవా పూర్తయితేకానీ జిల్లాలో నీటి సమస్య తీరదు. ఇటీవల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే నీటి సమస్యను పరిష్కరిస్తానని మళ్లీ చంద్రబాబు హామీఇచ్చారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న పడమటి మండలాల్లో నీటి సమస్య తీరాలంటే హంద్రీ-నీవా రావాలి. హంద్రీ-నీవా పూర్తిచేయాలంటే 4,500 కోట్లు నిధులు అవసరం. చంద్రబాబు ప్రభుత్వం 2014-15 బడ్జెట్‌లో కేవలం *780 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తం కాంట్రాక్టర్ల పాత బకాయిలకే సరిపోతుంది. ఈ లెక్కన రాబోయే నాలుగేళ్లలో హంద్రీ-నీవా పూర్తిచేయడం అసాధ్యం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.7,390 కోట్లతో కండలేరు నుంచి నీటిని తరలించే విధంగా మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. రూ.5,900 కోట్లతో టెండర్లు పిలిచారు. కొంత అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారు. బాబు ఆ పథకాన్ని తుంగలో తొక్కారు.
జిల్లాలో నీటిసరఫరా స్కీములు
జిల్లావ్యాప్తంగా 8,596 వివిధ రకాల బోర్లు, స్కీములు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటి 255 బోర్లు ఎండిపోగా 2వేల బోర్లు సీజనల్‌గా మారాయి. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో ఆ బోర్లు కూడా సక్రమంగా పనిచేయడంలేదు. తాజాగా ప్రభుత్వం జిల్లాకు ఎన్‌ఆర్‌డబ్ల్యు కింద *8 కోట్ల 13లక్షల 45 వేలు, గ్రామీణ నీటి సరఫరా విపత్తుల నిర్వహణ కింద మరో *24.78 కోట్లు మొత్తం *32 కోట్ల 91లక్ష 45 వేలు మంజూరు చేసింది. ఇందులో తాగునీటి సరఫరాకు సంబంధించిన పాత బకాయిలకు *7.41 కోట్లు చెల్లించాల్సి ఉంది. వేసవి నీటి ఎద్దడి నివారణకు ఈ నిధులు సరిపోయే పరిస్థితి లేదు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తక్షణం ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. యుద్ధ ప్రాతిపాదికన జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. కొత్త బోర్లు తవ్వడం మాని నీళ్లున్న బోరు బావులను వినియోగించుకోవాలి. అధికారులు చిత్తశుద్ధితో ఈ కాార్యక్రమం నిర్వహిస్తేనే వేసవి తాగునీటి కష్టాల నుంచి ప్రజలు గట్టేక్కే అవకాశముంది.
ప్రైవేటు వ్యాపారం జోరు
జిల్లా నీటి సమస్యను చాలామంది వ్యాపారంగా మార్చుకున్నారు. బిందె నీళ్లు 3 నుంచి 5 రూపాయలకు అమ్ముతున్నారు. రోజూ 800 నుంచి 1000 ట్యాంకర్ల వరకు నీటి వ్యాపారం జరుగుతోంది. ఒక్క ట్యాంకు రూ.400 చొప్పున అమ్ముతుండడంతో జిల్లావ్యాప్తంగా నెలకు రూ.7 కోట్ల పైగా నీటి వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.