The problem of water
-
అయ్యా.. అమ్మా నీళ్లు ఇవ్వండి
ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు వీసీ ఘెరావ్ యూనివర్సిటీక్యాంపస్: అయ్యా నీళ్లు ఇవ్వండి.. అమ్మానీళ్లు ఇవ్వండి అంటూ ఎస్వీయూలో విద్యార్థులు గొంతెత్తి అరిచారు. నీళ్లు ఇచ్చి ఎండిన గొంతును తడపాలని వేడుకున్నారు. మహిళా వసతి గృహంలో మూడు రోజులుగా తీవ్ర నీటి సమస్య నెలకొంది. తాగడానికి చుక్క నీరు లేదు. మంగళవారం రాత్రి 2 గంటల పాటు ఆందోళన చేశారు. ఫలితం దక్కలేదు. యూని వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉద యం తరగతులు బహిష్కరించి బంద్ నిర్వహించా రు. పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వసతి గృహానికి సరఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడం లేదన్నారు. 80 మందికి రెండు బాత్రూమ్లే ఉన్నాయని తెలిపారు. పాచిపట్టిన నీటితోనే వంట చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. వార్డెన్‌ను తొలగించాలని, రిజిస్ట్రార్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రదర్శనగా శ్వేత భవనం వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఇన్చార్జి వీసీ రాజగోపాల్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు సంతృప్తి చెందకపోవడంతో వీసీ బయలుదేరుతుండగా వాహనాన్ని చుట్టుముట్టారు. ఆయన కారు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా ఘెరావ్ చేశారు. దారికి అడ్డంగా కూర్చుని కదలకుండా చుట్టుముట్టారు. పోలీసులు వలయంగా ఏర్పడి పరిపాలనా భవనం వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం ఇన్చార్జి వీసీ యూనివర్సిటీ అధికారులు, వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, హేమంత్ యాదవ్, హేమంత్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, మాదిగ విద్యార్థి సమాఖ్య, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్, బీవీఎఫ్ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. -
అర చేతిలో స్వర్గం
అన్నీ హామీలే.. నిధులు శూన్యం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరాల జల్లు కార్యకర్తల్లో మనోధైర్యం నింపే యత్నం తిరుపతి: కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఇన్ని రోజులుగా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం హఠాత్తుగా తిరుపతి నగర అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటిం చడం వెనుక ఎన్నికల వ్యూహం దాగి ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దామినీడు, అవిలాలలో అసంపూర్తిగా ఉన్న పేదల గృహాలకు రూ.250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రెండేళ్లలో బాలాజీ రిజర్వాయర్ పూర్తిచేస్తామని చెప్పారు. తాత్కాలికం గా నీటి సమస్య పరిష్కారం కోసం రూ.25 కోట్లు ఇవ్వాలని టీటీడీని కోరుతామన్నారు. అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేస్తామని హెచ్చరించారు. తిరుపతి నుంచి కల్యాణిడ్యామ్ వరకు భూములను సేకరించి మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీటీడీ భూముల్లో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తిరుపతి నగర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించే యత్నం చేశారు. నిజంగా ఈ సమస్యలన్నీ పరిష్కారమైతే తిరుపతి నగరం రాష్ట్రంలోనే తలమానికంగా మారనుంది. అయితే కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తరువాత ఈ సమస్యల పరిష్కారం అటకెక్కే ప్రమాదముందని జనం చర్చించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. ఆ సంగతి మరువక ముందే తిరుపతి ప్రజలను మరోసారి ముఖ్యమంత్రి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నగర ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేవలం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నగరంలోని సమస్యలపై దృష్టి సారించలేదు. ముఖ్యంగా నగరాన్ని తాగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. దాన్ని అధిగమించేందుకు తాత్కాలిక ఏర్పాట్లను కూడా చేయలేదనే అసహనం వ్యక్తమవుతోంది. అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ పనుల ఊసే ఇంతవరకు లేదు. అర్ధంతరంగా ఆగిపోయిన పేదల ఇళ్ల నిర్మాణాలపై కనీసం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు సమీక్షలు జరిపిన దాఖాలాలు కూడా లేవు. విజయోత్సవ సభలో లుకలుకలు తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సుగుణమ్మ గెలుపుతో విజయోత్సవ సభ పేరుతో కార్యకర్తలను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి అవార్డులు ఇచ్చారు. అయితే ఈ సభలోనే తెలుగుదేశం పార్టీలో లుకలుకలు స్పష్టంగా కనిపించాయి. ఒక గ్రూపునకే ప్రాధాన్యత ఇచ్చారని నిరసనలు సైతం వ్యక్తమయ్యాయి. సన్మానిస్తామని చెప్పి మైనారీటీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలను పిలిచి వారికి వేదికపై చోటు కల్పించపోవడంతో ఆ వర్గాలు అగ్రహం వ్యక్తంచేశాయి. దీనికి తోడు విజయోత్సవ సభకు వచ్చిన వారికి కంటే వేదికపైనే నాయకులు ఎక్కువ ఉన్నారంటూ సాక్షాత్తూ చంద్రబాబే అసహనం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఫొటోలకు ఫోజులు తప్ప పనిచేసేది ఏమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీనికితోడు తిరుపతి నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే ర్యాలీలో స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో అప్పటికప్పుడు కార్యక్రమ షెడ్యూల్‌ను మార్చారు. 19వ తేదీ పద్మావతి అతిథిగృహంలో బస చేయాల్సి ఉన్నా, దానిని రద్దు చేసుకుని తిరుమల కొండకు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలంటూ షెడ్యూల్ మార్చారు. -
జలగండం
ముంచుకొస్తున్న నీటిముప్పు జిల్లాలో నీటి సమస్య ఉన్న గ్రామాలు 1,713 పడమటి మండలాల్లో పరిస్థితి మరింత దారుణం ప్రయివేటు నీటి వ్యాపారం రూ.కోట్లలో తరుముకొస్తున్న వేసవి పరిష్కారం చూపని సీఎం తాగునీటి ఇక్కట్లు తీరేదెట్టా? జిల్లాలోని పూతలపట్టు, కుప్పం, తంబళ్లపల్లె, గంగాధర నెల్లూరు, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల పరిధిలో గతంలో 1,713 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉండేది. తాజాగా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. వారం రోజులకు ఒక్కసారి కూడా ప్రభుత్వ పథకాల ద్వారా నీరు అందడం లేదు. ఆర్థిక స్థోమత ఉన్న వారు నీళ్లు కొనుక్కుంటుండగా, లేని వారు నానా తిప్పలు పడుతున్నారు. వేసవి తరుముకొస్తోంది. జిల్లాలో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాభావం వల్ల భూగర్భజలాలు పాతాళంలోకి అడుగంటాయి. అరకొరగా ఉన్న బోరుబావులు సైతం ఒట్టిపోయాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా దాదాపు రెండువేల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా అరకొర నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వేసవి తీవ్రత పెరిగే నాటికి ఉన్న బోరుబావులు కూడా నీటిని అందించే పరిస్థితి కానరావడం లేదు. అధికారులు వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిన దాఖలాలు లేవు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటికే బిల్లులు ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. ముఖ్యమంత్రి పైసా నిధులివ్వక మాటలతోనే సరిపెడుతున్నారు. దీంతో మరో రెండు మూడు నెలల తర్వాత పరిస్థితి ఊహించుకుంటే భయమేస్తోంది. స్పందించని ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు జిల్లా తాగునీటి సమస్యను గాలికి వదిలేశారు. హంద్రీ-నీవా పూర్తయితేకానీ జిల్లాలో నీటి సమస్య తీరదు. ఇటీవల ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే నీటి సమస్యను పరిష్కరిస్తానని మళ్లీ చంద్రబాబు హామీఇచ్చారు. నీటి సమస్య తీవ్రంగా ఉన్న పడమటి మండలాల్లో నీటి సమస్య తీరాలంటే హంద్రీ-నీవా రావాలి. హంద్రీ-నీవా పూర్తిచేయాలంటే 4,500 కోట్లు నిధులు అవసరం. చంద్రబాబు ప్రభుత్వం 2014-15 బడ్జెట్లో కేవలం *780 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తం కాంట్రాక్టర్ల పాత బకాయిలకే సరిపోతుంది. ఈ లెక్కన రాబోయే నాలుగేళ్లలో హంద్రీ-నీవా పూర్తిచేయడం అసాధ్యం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.7,390 కోట్లతో కండలేరు నుంచి నీటిని తరలించే విధంగా మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. రూ.5,900 కోట్లతో టెండర్లు పిలిచారు. కొంత అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారు. బాబు ఆ పథకాన్ని తుంగలో తొక్కారు. జిల్లాలో నీటిసరఫరా స్కీములు జిల్లావ్యాప్తంగా 8,596 వివిధ రకాల బోర్లు, స్కీములు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటి 255 బోర్లు ఎండిపోగా 2వేల బోర్లు సీజనల్‌గా మారాయి. ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో ఆ బోర్లు కూడా సక్రమంగా పనిచేయడంలేదు. తాజాగా ప్రభుత్వం జిల్లాకు ఎన్ఆర్డబ్ల్యు కింద *8 కోట్ల 13లక్షల 45 వేలు, గ్రామీణ నీటి సరఫరా విపత్తుల నిర్వహణ కింద మరో *24.78 కోట్లు మొత్తం *32 కోట్ల 91లక్ష 45 వేలు మంజూరు చేసింది. ఇందులో తాగునీటి సరఫరాకు సంబంధించిన పాత బకాయిలకు *7.41 కోట్లు చెల్లించాల్సి ఉంది. వేసవి నీటి ఎద్దడి నివారణకు ఈ నిధులు సరిపోయే పరిస్థితి లేదు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తక్షణం ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. యుద్ధ ప్రాతిపాదికన జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. కొత్త బోర్లు తవ్వడం మాని నీళ్లున్న బోరు బావులను వినియోగించుకోవాలి. అధికారులు చిత్తశుద్ధితో ఈ కాార్యక్రమం నిర్వహిస్తేనే వేసవి తాగునీటి కష్టాల నుంచి ప్రజలు గట్టేక్కే అవకాశముంది. ప్రైవేటు వ్యాపారం జోరు జిల్లా నీటి సమస్యను చాలామంది వ్యాపారంగా మార్చుకున్నారు. బిందె నీళ్లు 3 నుంచి 5 రూపాయలకు అమ్ముతున్నారు. రోజూ 800 నుంచి 1000 ట్యాంకర్ల వరకు నీటి వ్యాపారం జరుగుతోంది. ఒక్క ట్యాంకు రూ.400 చొప్పున అమ్ముతుండడంతో జిల్లావ్యాప్తంగా నెలకు రూ.7 కోట్ల పైగా నీటి వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
పంటకు నీరిచ్చి ఆదుకోండి
కలెక్టర్ కు అనంత వెంకటరామిరెడ్డి వినతి అనంతపురం అర్బన్ : మరో పది రోజులు నీటిని విడుదల చేసి పామిడి, పెద్దవడగూరు మండలాల పరిధిలో ఉన్న 17 గ్రామాల రైతులను ఆదుకోవాలని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కలెక్టర్ కోన శశిధర్‌ను కోరారు. శనివారం ఆయన కలెక్టర్‌ను కలిసి పంటల పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పామిడి, పెద్దవడగూరు మండలాల పరిధిలోని పొలాలకు హెచ్చెల్సీ( నార్త్ కెనాల్) ద్వారా సాగునీరు సరఫరా అవుతోందన్నారు. 17 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 3 వేల ఎకరాలలో వరి, వేరుశనగ సాగు చేస్తున్నారన్నారు. పంట మరో 15 రోజుల్లో చేతికొస్తుందని తెలిపారు. ఈ సమయంలో సాగునీరు ఆపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.4 టీఎంసీ నీరు నిల్వ ఉందన్నారు. పంటలకు, రిజర్వాయర్లకు సరిపడే నీరు ఉన్నా అధికారులు నిలుపుదల చేయడం సరికాదన్నారు. 250 క్యూసెక్కులు కాకుండా 350 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తే అటు రైతులకు, ఇటు చాగల్లు రిజర్వాయర్‌కు నీటి పంపిణీ చేయవచ్చునన్నారు. పంటలకు, రిజర్వాయర్లకు సరిపడే నీరు ఉన్నా అధికారులు నిలుపుదల చేయడం సరికాదన్నారు. నార్త్ కెనాల్ 38వ కిలోమీటర్వద్ద డిస్ట్రిబ్యూటరీల వద్ద మట్టి వేశారని, వెంటనే దానిని తొలగించి పంటలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఒకేసారి ఇటు నార్త్ కెనాల్ ఆయకట్టుకు, చాగల్లుకు నీటిని విడుదల చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. దీనివల్ల చాగల్లుకు ఎలాంటి ఇబ్బంది రాదని వివరించారు. వ్యక్తుల ప్రయోజనాల కోసం కాకుండా.. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పొట్ట, వెన్ను దశల్లో ఉన్న పంటలకు నీరివ్వాలని హితవుపలికారు. కరువు జిల్లాకు అదనంగా నీటిని తీసుకురావడానికి ప్రయత్నం చేయకపోగా వచ్చిన నీటికోసం రాజకీయాలు చేయడం తగదన్నారు. రైతుల శ్రేయస్సు కోసం అందరూ ఆలోచించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులతో సమావేశం నిర్వహించి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎంపీ హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావును కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై ఎస్ఈ సానుకూలంగా స్పందించారు. మరో తడి నీరివ్వడానికి చర్యలు తీసుకుంటామని హామిఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, నీలం నల్లపరెడ్డి, పామిడి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన 17 గ్రామాల రైతులు పాల్గొన్నారు.