అయ్యా.. అమ్మా నీళ్లు ఇవ్వండి
ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన
అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు వీసీ ఘెరావ్
యూనివర్సిటీక్యాంపస్: అయ్యా నీళ్లు ఇవ్వండి.. అమ్మానీళ్లు ఇవ్వండి అంటూ ఎస్వీయూలో విద్యార్థులు గొంతెత్తి అరిచారు. నీళ్లు ఇచ్చి ఎండిన గొంతును తడపాలని వేడుకున్నారు. మహిళా వసతి గృహంలో మూడు రోజులుగా తీవ్ర నీటి సమస్య నెలకొంది. తాగడానికి చుక్క నీరు లేదు. మంగళవారం రాత్రి 2 గంటల పాటు ఆందోళన చేశారు. ఫలితం దక్కలేదు. యూని వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉద యం తరగతులు బహిష్కరించి బంద్ నిర్వహించా రు. పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వసతి గృహానికి సరఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడం లేదన్నారు. 80 మందికి రెండు బాత్‌రూమ్‌లే ఉన్నాయని తెలిపారు. పాచిపట్టిన నీటితోనే వంట చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. వార్డెన్‌ను తొలగించాలని, రిజిస్ట్రార్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రదర్శనగా శ్వేత భవనం వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఇన్‌చార్జి వీసీ రాజగోపాల్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు సంతృప్తి చెందకపోవడంతో వీసీ బయలుదేరుతుండగా వాహనాన్ని చుట్టుముట్టారు.
ఆయన కారు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా ఘెరావ్ చేశారు. దారికి అడ్డంగా కూర్చుని కదలకుండా చుట్టుముట్టారు. పోలీసులు వలయంగా ఏర్పడి పరిపాలనా భవనం వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం ఇన్‌చార్జి వీసీ యూనివర్సిటీ అధికారులు, వార్డెన్‌లు, ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, హేమంత్ యాదవ్, హేమంత్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, మాదిగ విద్యార్థి సమాఖ్య, ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, బీవీఎఫ్ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి.