ప్రజలకు చేరువగా పరిశోధనలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష
ఐఈఏ సదస్సు ప్రారంభం
పలు ఆర్థిక అంశాలపై చర్చ
మూడు రోజుల పాటు సదస్సు
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో మూడు రోజులు జరిగే ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 99వ వార్షిక సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సుకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమావేశంలో రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో పోటీతత్వం పెరగాలని, గ్రేడింగ్ విధానం అమలు కావాలని చెప్పారు. వివిధ విభాగాల్లో నిర్వహించే పరిశోధనలు సామాన్యప్రజలకు చేరువకావాలని పిలుపుని చ్చారు. ఎస్వీయూనివర్సిటీ పురోగతిలో పయనిస్తోం దని కితాబు ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు నిధుల సమీకరణపై దృష్టి సారించాలని, కన్సల్టెన్సీల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. తాను పీజీ విద్యార్థిగా ఎస్వీయూలో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటును వివరించారు. ప్రతి గ్రామాన్నీ డిజిటల్ విలేజ్‌గా మార్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
ఐఈఏ కీలక భూమిక
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఈఏ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌థోరట్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వి«ధానాల రూపకల్పనలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఐఈఏ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక జర్నల్‌ను రూపొందించి అందజేస్తున్నామని చెప్పారు. ఐఈఏ సెక్రటరీ అనిల్‌కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ ఐఈఏ వార్షిక సదస్సుల ద్వారా ఆర్‌బీఐ, నీతి అయోగ్, ఐసీఎస్‌ఎస్‌ఆర్ తదితర సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు హాజరై సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు.
హైదరాబాద్‌లోని చెస్ సంస్థ చైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా అనేక ఆర్థిక అంశాలపై విశేష చర్చ జరుగుతుందని, బ్యాంకింగ్, వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ప్రత్యేకంగా వ్యవసాయాభివృద్ధిపై చర్చించేందుకు ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్ యూనివర్సిటీ చాన్సలర్ వైకె అలగ్ కీలకోపన్యాసం ఇచ్చారు. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. ఈసందర్భంగా ఎకనామిక్స్ అసోసియేషన్ రూపొందించిన సావనీర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఎస్వీయూ వీసీ దామోదరం మాట్లాడుతూ వర్సిటీ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఈ సదస్సు బుధ గురువారాలో కూడా జరగనుంది.