ఆర్థిక సంస్కరణల తర్వాతే సంకీర్ణాలు
భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సులో సీఎం బాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాకనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. 1991లో ప్రధాని పీవీ నరసింహారావు ప్రణాళికాబద్ధంగా ఆర్థిక సంస్కరణలను మొదలు పెట్టారనీ, ఆ తర్వాత దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయ్ ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు పరిచాయని తెలిపారు. దీంతో 1991లో రూ.5.86 లక్షల కోట్లున్న జీడీపీ 2016 నాటికి రూ. 1 కోటీ 35 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో మంగళవారం ఉదయం 99వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సులను ఆయన ప్రారంభించారు.
ఎస్వీయూ వీసీ డాక్టర్ ఆవుల దామోదరం అధ్యక్షతన జరిగిన సదస్సులో సీఎం మాట్లాడుతూ... ప్రపంచ దేశాల్లో ఆర్థికాభివృద్ధిలో ముందున్న దేశాల్లో చైనా ముందుండగా, రెండోస్థానాన్ని భారత్ కైవసం చేసుకుందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 9వ స్థానంలో ఉందని చెప్పారు. దేశంలోని కీలకమైన ఆర్థికవేత్తలందరూ దేశప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సృజనాత్మకంగా ఆలోచించాలని, పాత విధానాలను వదిలి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని సీఎం కోరారు. వచ్చే ఏడాది నిర్వహించే 100వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సులను కూడా అమరావతిలోనే నిర్వహించాలన్నారు.
ప్రతిపక్షాలే అడ్డు: ‘‘అభివృద్ధి చేస్తుంటే రాళ్లు వేయడం చాలా ఈజీ.. అయినా నేనెవ్వరికీ భయపడను. నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే. అందుకే చెబుతున్నా... ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రతిపక్షాలే అడ్డు. నేనెంతో కష్టపడుతుంటే అన్నింటా అడ్డు తగులుతున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేస్తాం. కేవలం పేరు కోసం తాపత్రయం తప్ప నాకెలాంటి స్వార్థం లేదు’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన మంగళవారం ఉదయం భారత ఆర్థిక సంఘం సదస్సునుంచి వెలుపలకు వచ్చాక మీడియాతో మాట్లాడారు.
పోలవరం పూర్తి చేస్తాం...
1941–42 నుంచే నిర్మించాలనుకుని కలలు గన్న పోలవరం ప్రాజెక్టును 2018లో గా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏళ్ల తరబడి నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు మోక్షం లభించడం, కేంద్రం నాబార్డు ద్వారా రూ.1981 కోట్లు అందజేయడం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఘట్టమని తెలిపారు.