Indian Economic Association
-
ఐఈఏ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి
సాక్షి, గుంటూరు: ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్(ఐఈఏ) శతాబ్ధి ఉత్సవాలను బుధవారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ' భారత ఆర్థికాభివృద్ధి అనుభవాలు' పేరిట నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగునుంది. ఈ కార్యక్రమంలో గవర్నర నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు దేశ , విదేశాలకు చెందిన ఆర్థిక వేత్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు వచ్చిన ఆర్థిక వేత్తలు 7 ప్యానళ్లుగా ఏర్పడి వివిధ అంశాలపై చర్చిస్తారు. కీలకమైన 16 అంశాలపై ప్రముఖ ఆర్థిక వేత్తలు కీలకోపన్యాసం చేయనున్నారు. కాగా, అంతకు ముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి దంపతులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో నాగార్జున వర్సిటీకి చేరుకున్నారు. ఐఈఏ సదస్సు అనంతరం సచివాలయంలో ఫైబర్‌గిడ్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. -
ప్రజలకు చేరువగా పరిశోధనలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష ఐఈఏ సదస్సు ప్రారంభం పలు ఆర్థిక అంశాలపై చర్చ మూడు రోజుల పాటు సదస్సు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో మూడు రోజులు జరిగే ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 99వ వార్షిక సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సుకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమావేశంలో రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో పోటీతత్వం పెరగాలని, గ్రేడింగ్ విధానం అమలు కావాలని చెప్పారు. వివిధ విభాగాల్లో నిర్వహించే పరిశోధనలు సామాన్యప్రజలకు చేరువకావాలని పిలుపుని చ్చారు. ఎస్వీయూనివర్సిటీ పురోగతిలో పయనిస్తోం దని కితాబు ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు నిధుల సమీకరణపై దృష్టి సారించాలని, కన్సల్టెన్సీల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. తాను పీజీ విద్యార్థిగా ఎస్వీయూలో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటును వివరించారు. ప్రతి గ్రామాన్నీ డిజిటల్ విలేజ్‌గా మార్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఐఈఏ కీలక భూమిక ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఈఏ అధ్యక్షుడు సుఖ్దేవ్థోరట్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వి«ధానాల రూపకల్పనలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఐఈఏ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక జర్నల్ను రూపొందించి అందజేస్తున్నామని చెప్పారు. ఐఈఏ సెక్రటరీ అనిల్‌కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ ఐఈఏ వార్షిక సదస్సుల ద్వారా ఆర్బీఐ, నీతి అయోగ్, ఐసీఎస్ఎస్ఆర్ తదితర సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు హాజరై సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు. హైదరాబాద్‌లోని చెస్ సంస్థ చైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా అనేక ఆర్థిక అంశాలపై విశేష చర్చ జరుగుతుందని, బ్యాంకింగ్, వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ప్రత్యేకంగా వ్యవసాయాభివృద్ధిపై చర్చించేందుకు ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్ యూనివర్సిటీ చాన్సలర్ వైకె అలగ్ కీలకోపన్యాసం ఇచ్చారు. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. ఈసందర్భంగా ఎకనామిక్స్ అసోసియేషన్ రూపొందించిన సావనీర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఎస్వీయూ వీసీ దామోదరం మాట్లాడుతూ వర్సిటీ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఈ సదస్సు బుధ గురువారాలో కూడా జరగనుంది. -
ఆర్థిక సంస్కరణల తర్వాతే సంకీర్ణాలు
భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సులో సీఎం బాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాకనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. 1991లో ప్రధాని పీవీ నరసింహారావు ప్రణాళికాబద్ధంగా ఆర్థిక సంస్కరణలను మొదలు పెట్టారనీ, ఆ తర్వాత దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయ్ ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు పరిచాయని తెలిపారు. దీంతో 1991లో రూ.5.86 లక్షల కోట్లున్న జీడీపీ 2016 నాటికి రూ. 1 కోటీ 35 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో మంగళవారం ఉదయం 99వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సులను ఆయన ప్రారంభించారు. ఎస్వీయూ వీసీ డాక్టర్ ఆవుల దామోదరం అధ్యక్షతన జరిగిన సదస్సులో సీఎం మాట్లాడుతూ... ప్రపంచ దేశాల్లో ఆర్థికాభివృద్ధిలో ముందున్న దేశాల్లో చైనా ముందుండగా, రెండోస్థానాన్ని భారత్ కైవసం చేసుకుందన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 9వ స్థానంలో ఉందని చెప్పారు. దేశంలోని కీలకమైన ఆర్థికవేత్తలందరూ దేశప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సృజనాత్మకంగా ఆలోచించాలని, పాత విధానాలను వదిలి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని సీఎం కోరారు. వచ్చే ఏడాది నిర్వహించే 100వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సులను కూడా అమరావతిలోనే నిర్వహించాలన్నారు. ప్రతిపక్షాలే అడ్డు: ‘‘అభివృద్ధి చేస్తుంటే రాళ్లు వేయడం చాలా ఈజీ.. అయినా నేనెవ్వరికీ భయపడను. నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకు మాత్రమే. అందుకే చెబుతున్నా... ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రతిపక్షాలే అడ్డు. నేనెంతో కష్టపడుతుంటే అన్నింటా అడ్డు తగులుతున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేస్తాం. కేవలం పేరు కోసం తాపత్రయం తప్ప నాకెలాంటి స్వార్థం లేదు’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన మంగళవారం ఉదయం భారత ఆర్థిక సంఘం సదస్సునుంచి వెలుపలకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి చేస్తాం... 1941–42 నుంచే నిర్మించాలనుకుని కలలు గన్న పోలవరం ప్రాజెక్టును 2018లో గా పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏళ్ల తరబడి నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు మోక్షం లభించడం, కేంద్రం నాబార్డు ద్వారా రూ.1981 కోట్లు అందజేయడం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే ఘట్టమని తెలిపారు.