su
-
తిరుపతి చేరుకున్న సీఎం
యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. ఆయన వెంట కేంద్రమంత్రి సుజనాచౌదరి కూడా వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎంకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు సుగుణమ్మ, తలారి ఆదిత్య, జెడ్పీ చైర్మపర్సన్ గీర్వాణి, జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి స్వాగతం పలికిన వారిలో వున్నారు. చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తిరుపతికి వచ్చారు. రాత్రి పద్మావతీ అతిథి గృహంలో బస చేస్తారు. మంగళ, బుధవారాల్లో తిరుపతిలోనే వుంటారు. మంగళవారం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానితో పాటు హాజరవుతారు. బుధవారం చిల్డ్రన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సదస్సులను సీఎం ప్రారంభిస్తారు. -
ప్రజలకు చేరువగా పరిశోధనలు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష ఐఈఏ సదస్సు ప్రారంభం పలు ఆర్థిక అంశాలపై చర్చ మూడు రోజుల పాటు సదస్సు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో మూడు రోజులు జరిగే ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 99వ వార్షిక సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సుకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సమావేశంలో రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో పోటీతత్వం పెరగాలని, గ్రేడింగ్ విధానం అమలు కావాలని చెప్పారు. వివిధ విభాగాల్లో నిర్వహించే పరిశోధనలు సామాన్యప్రజలకు చేరువకావాలని పిలుపుని చ్చారు. ఎస్వీయూనివర్సిటీ పురోగతిలో పయనిస్తోం దని కితాబు ఇచ్చారు. విశ్వవిద్యాలయాలు నిధుల సమీకరణపై దృష్టి సారించాలని, కన్సల్టెన్సీల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. తాను పీజీ విద్యార్థిగా ఎస్వీయూలో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటును వివరించారు. ప్రతి గ్రామాన్నీ డిజిటల్ విలేజ్‌గా మార్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఐఈఏ కీలక భూమిక ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఈఏ అధ్యక్షుడు సుఖ్దేవ్థోరట్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వి«ధానాల రూపకల్పనలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఐఈఏ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక జర్నల్ను రూపొందించి అందజేస్తున్నామని చెప్పారు. ఐఈఏ సెక్రటరీ అనిల్‌కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ ఐఈఏ వార్షిక సదస్సుల ద్వారా ఆర్బీఐ, నీతి అయోగ్, ఐసీఎస్ఎస్ఆర్ తదితర సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్న అధికారులు హాజరై సలహాలు, సూచనలు అందజేస్తారన్నారు. హైదరాబాద్‌లోని చెస్ సంస్థ చైర్మన్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా అనేక ఆర్థిక అంశాలపై విశేష చర్చ జరుగుతుందని, బ్యాంకింగ్, వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ప్రత్యేకంగా వ్యవసాయాభివృద్ధిపై చర్చించేందుకు ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేశామన్నారు. గుజరాత్ యూనివర్సిటీ చాన్సలర్ వైకె అలగ్ కీలకోపన్యాసం ఇచ్చారు. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు. ఈసందర్భంగా ఎకనామిక్స్ అసోసియేషన్ రూపొందించిన సావనీర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఎస్వీయూ వీసీ దామోదరం మాట్లాడుతూ వర్సిటీ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ఈ సదస్సు బుధ గురువారాలో కూడా జరగనుంది. -
చదువులు సాగేదెలా?
ఎస్వీయూను పట్టిపీడిస్తున్న ప్రొఫెసర్ల కొరత సగానికి పైగా తగ్గిన దూర విద్య అడ్మిషన్లు అరకొర వసతులతో అవస్థలు పరిశోధక విద్యార్థుల పరిస్థితి మరింత దారుణం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అరకొర వసతులు, నిలిచిపోయిన యూజీసీ నిధులు, ప్రొఫెసర్ల కొరతతో విద్యార్థులు అంతంత మాత్రపు చదువులు సాగిస్తున్నారు. సమస్యలన్నీ పరిష్కారమై, పురోగతి వైపు అడుగులు వేయాల్సిన విశ్వవిద్యాలయం రాజకీయాలకు నిలయంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. పట్టించుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో సమస్యలన్నీ జఠిలంగా మారుతున్నాయి. తిరుపతి : ఎస్వీయూ ప్రాభవం మసకబారుతోంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన వర్సిటీ చదువులు నేడు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. విశ్వవిద్యాలయం పురోగతి స్తంభించింది. సమస్యలను పరిష్కరించి ఎప్పటికప్పుడు విద్యావిధానంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఏయేటికాయేడు వర్సిటీకున్న పేరు దెబ్బతింటోంది. రెండేళ్లుగా భర్తీకాని ఖాళీలు రెండేళ్లుగా ఎస్వీయూలో ప్రొఫెసర్ల కొరత నెలకొంది. 2014 నాటికే 63 ఫ్రొఫెసర్లు, 96 అసోసియేట్ ఫ్రొఫెసర్లు, 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పడీ సంఖ్య పెరిగింది. దీనివల్ల అన్ని విభాగాల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులను గాడిలో పెట్టేవారు, వారిని సరైన విధానంలో నడిపించే వారు కరువయ్యారు. అధ్యాపకుల కొరత వల్ల రెండేళ్ల నుంచి యూజీసీ నిధుల విడుదల ఆగిపోయింది. వర్సిటీలో ఎంఫిల్ భోధన చేసే వారు లేక ఆ కోర్సును రద్దుచేశారు. పరిశోధక విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రయోగశాలలు, ఇతరత్రా పరికరాలు లేక బయటకు వెళ్లి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దెబ్బతిన్న పురోగతి ఎస్వీయూ పురోగతి పూర్తిగా దెబ్బతింది. వైఎస్ హయాంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్‌గాంధీ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్సు హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 60 శాతం పనులు పూర్తయ్యాక ఆయా నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్సిటీ క్యాంపస్‌లో రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలకు విరివిగా నిధులు మంజూరు చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆశించిన మేర నిధులు మంజూరైన దాఖాలాలే లేవు. లైబ్రరీల పరిస్థితి అంతంత మాత్రంగా మారింది. ఎప్పుడో ఐదేళ్ల కిందట పెట్టిన జర్నల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. దీంతో పరిశోధక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2015లో ఏర్పాటు చేసిన కాంపిటీటివ్ సెల్లో జర్నల్స్ పెట్టకపోవడంతో విద్యార్థులు అటువైపు చూడటం మానేశారు. ఇంటర్నెట్ హబ్ భవనం కూడా మూత పడింది. ఇక్కడున్న కంప్యూటర్లన్నీ పాడయ్యాయి. పరిశోధకులకు సౌకర్యాలు కల్పించాలి ఎస్వీయూలో చదువుతున్న పరిశోధకులకు సౌకర్యాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ప్రయోగశాలలో సౌకర్యాలను పెంచాలి. కొంతమంది అధ్యాపకులు విద్యార్థులను ప్రయోగశాల కోసం బయటకు పంపుతున్నారు. దీనిని నివారించాలి. యూనివర్సిటీ రీసెర్చ్ కమిటీ సమావేశాలు సకాలంలో నిర్వహించి సంబంధిత ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలి. - హేమంత్ యాదవ్, పరిశోధక విద్యార్థి అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి ఎస్వీయూలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. బోధనా ప్రమాణాలు పెంచాలి. దూరవిద్యావిభాగాన్ని బలోపేతం చేయాలి. సరైన సమయంలో పరీక్షల నిర్వహించి, సకాలంలో ఫలితాలు విడుదల చేయాలి. విద్యార్థులకు భరోసా కల్పించాలి. మెస్‌లను, వసతి గృహాలను ఆధునీకరించాలి. - రమేష్, ఎంఎ విద్యార్థి , ఎస్వీయూ -
ఎస్వీయూలో అంబేద్కర్ ఫ్లెక్సీల చించివేత
పోలీసులకు ఫిర్యాదు క్యాంపస్‌లో మరో వివాదం యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఎస్వీయూ ప్రాంగణంలో మంగళవారం మరో వివాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అంబేడ్కర్ చిత్రాలున్న ఫ్లెక్సీలను చించివేశారు. దీనిపట్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. మంగళవారం రిపబ్లిక్‌డే నేపధ్యంలో సోమవారం ఎస్వీయూలోని అన్నమయ్య భవన్లో బుద్ధవిహార్ సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్, బుద్ధుని ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. మంగళవారం ఉదయం కార్యక్రమా ప్రారంభించే సమయానికి ఫ్లెక్సీలు చించివేసి ఉన్నాయి. ఈసంఘటనపై ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం, మాదిగ విద్యార్థి సమాఖ్యలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఈసంఘటనపై విద్యార్థినాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీసీ దామోదరం, తిరుపతి వెస్ట్ డీఎస్పీ అన్నమయ్య భవన్‌ను సందర్శించి చించి వేసిన ఫ్లెక్సీలను పరిశీలించారు. ఎస్వీయూలో బుధవారం జరగనున్న సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈనేపధ్యంలో ఎస్వీయూ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఓ విద్యార్థిసంఘ గోడరాతలను మరో విభాగం తుడిచి వేయించింది.దీనిపట్ల విద్యార్థి నాయకులు సోమవారం రాత్రి ఆందోళన చేశారు. రెండు సంఘాల మధ్య వాగ్వాదం జరిగింది. వీసీ దామోదరం స్వయంగా వెళ్లి విద్యార్థులకు నచ్చచెప్పారు. ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ ఫొటోలున్న ఫ్లెక్సీలు చించి వుండడం విశేషం. ఈ పని ఆకతాయిలదా లేక రాత్రి గొడవ పడ్డ విద్యార్థి సంఘ నాయకులు చించివేశారా అనేది మిస్టరీగా మారింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అయ్యా.. అమ్మా నీళ్లు ఇవ్వండి
ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు వీసీ ఘెరావ్ యూనివర్సిటీక్యాంపస్: అయ్యా నీళ్లు ఇవ్వండి.. అమ్మానీళ్లు ఇవ్వండి అంటూ ఎస్వీయూలో విద్యార్థులు గొంతెత్తి అరిచారు. నీళ్లు ఇచ్చి ఎండిన గొంతును తడపాలని వేడుకున్నారు. మహిళా వసతి గృహంలో మూడు రోజులుగా తీవ్ర నీటి సమస్య నెలకొంది. తాగడానికి చుక్క నీరు లేదు. మంగళవారం రాత్రి 2 గంటల పాటు ఆందోళన చేశారు. ఫలితం దక్కలేదు. యూని వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం ఉద యం తరగతులు బహిష్కరించి బంద్ నిర్వహించా రు. పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. వసతి గృహానికి సరఫరా చేస్తున్న నీరు ఏమూలకూ సరిపోవడం లేదన్నారు. 80 మందికి రెండు బాత్రూమ్లే ఉన్నాయని తెలిపారు. పాచిపట్టిన నీటితోనే వంట చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు. వార్డెన్‌ను తొలగించాలని, రిజిస్ట్రార్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రదర్శనగా శ్వేత భవనం వద్దకు చేరుకుని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఇన్చార్జి వీసీ రాజగోపాల్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు సంతృప్తి చెందకపోవడంతో వీసీ బయలుదేరుతుండగా వాహనాన్ని చుట్టుముట్టారు. ఆయన కారు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా ఘెరావ్ చేశారు. దారికి అడ్డంగా కూర్చుని కదలకుండా చుట్టుముట్టారు. పోలీసులు వలయంగా ఏర్పడి పరిపాలనా భవనం వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం ఇన్చార్జి వీసీ యూనివర్సిటీ అధికారులు, వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, హేమంత్ యాదవ్, హేమంత్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, మాదిగ విద్యార్థి సమాఖ్య, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్, బీవీఎఫ్ తదితర సంఘాలు మద్దతు తెలిపాయి. -
ర్యాగింగ్‌పై విచారణ ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై ఆదివారం అధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్వీయూలో ర్యాగింగ్ అంశంపై ఆదివారం సాక్షి దినపత్రికలో సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికతో కథనం వెలువడింది. దీనికి అధికారులు స్పందించారు. మధ్యాహ్న సమయంలో రెక్టార్ జయశంకర్, ప్రిన్సిపాల్ భగవాన్ రెడ్డి, డెప్యూటీ వార్డన్ రమేష్‌బాబు డి.బ్లాక్‌ను సందర్శించారు. ఘటనపై విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
మెడిసిన్ కౌన్సెలింగ్‌లో గందరగోళం
ఎస్వీయూ రీజియన్‌కు అన్యాయం జరిగిందని ఆందోళన కౌన్సెలింగ్‌కు అంతరాయం పద్మావతి మెడికల్ కళాశాల సీట్లను ఏయూ రీజియన్‌కు కేటాయించారని ఆరోపణ యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూలో జరుగుతున్న వైద్యవిద్య కౌన్సెలింగ్‌లో గురువారం గందరగోళం చోటుచేసుకుంది. తిరుపతిలో ని పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లను ఎస్వీయూ రీజియన్‌కు కేటాయించకుండా, ఆంధ్రా యూనివర్సిటీకి అలాట్ చేశారని ఆరోపిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫలితంగా మెడిసిన్ కౌన్సెలింగ్ ఆగిపోయింది. ఎస్వీయూలోని కౌన్సెలింగ్ కేంద్రంలో సర్వర్ పనిచేయకుండా చేసి, ఏయూ రీజియన్‌కు సీట్లను కట్టబెట్టారని వారు ఆరోపించా రు. అయితే అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని చెబుతున్నారు. రాత్రి 10.45 గంటల తరువాత తిరిగి కౌన్సెలింగ్ ప్రారంభమయింది. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశానికి బుధవారం కౌన్సెలింగ్ ప్రా రంభమైంది. ఇందులో భాగంగా గురువారం 1001 నుంచి 4వేల ర్యాంక్ వర కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే పద్మావతి మెడికల్ కళాశాలకు సంబంధించిన సీట్ల కేటాయింపుపై గందరగో ళం నెలకొంది. ఎస్వీయూ ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కంప్యూటర్ సర్వర్ పనిచేయలేదు. సర్వర్ నిలిచిపోయిన సమయానికి ముందు పద్మావతి మెడికల్ కళాశాలలో ఓపెన్ కేటగిరిలో 44 సీట్లు అందుబాటులో ఉన్నట్లు డిస్ప్లేలో కన్పించింది. అప్పుడు 1630 ర్యాంక్ వరకు సీట్ల కేటాయింపు జరుగుతోంది. తిరిగి 2 గంటలకు కౌన్సెలింగ్ పునఃప్రారంభమైన సమయంలో పద్మావతి మెడికల్ కళాశాలలో సీట్లు లేనట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించారు. అప్పటికి ఓపెన్ కేటగిరీలో 2003 ర్యాంక్‌కు సీట్లు కేటాయించారు. ఆ 44 సీట్లు ఏమయ్యాయి సర్వర్ ఆగిపోవడానికి ముందు పద్మావతి మెడికల్ కళాశాలలో కన్పించిన 44 సీట్లు సర్వర్ పునరుద్ధరించే సమయానికి కన్పించకుండా పోయాయని, ఆ సీట్లు ఏమయ్యాయంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కౌన్సెలింగ్‌ను నిలిపి వేశారు. స్విమ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న పద్మావతి మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటాలో ఉన్న 127 సీట్లు ఎస్వీయూ రీజియన్‌కే చెందాలని చెప్పారు. ఆ సీట్లన్నీ ఏయూ రీజి యన్‌కు కట్టపెట్టి, తమను మోసగించారని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించా రు. ఆ44 సీట్లు ఏమయ్యాయని ప్రశ్నిం చారు. కౌన్సెలింగ్ రద్దు చేసి రీకౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. స్విమ్స్ రిజిస్ట్రార్ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2014 ఆగష్టు 23న విడుదల చేసిన జీవో 120 ప్రకారం పద్మావతి మె డికల్ కళాశాలలోని 127 సీట్లు రా ష్ట్రంలోని 13 జిల్లాల వారికి చెందుతాయ ని చెప్పారు. ఎస్వీ యూ రీజియన్ వా రికి అన్యాయం జరగలేదని సర్దిచెప్పా రు. అయితే న్యాయ పోరాటం చేస్తామని వారు వెళ్లిపోవడం తో కౌన్సెలింగ్ తిరిగి ప్రారంభించారు. -
ఎస్వీయూ హాస్టళ్లలో జామర్లు!
రాత్రి వేళల్లో సెల్వాడకుండా ఉండేందుకు నిర్ణయం త్వరలో అమలులోకి యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీయూలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, పరిణామాల నేపథ్యంలో వర్సిటీ మహిళా హాస్టళ్లలో జామర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మహిళా హస్టళ్లలో విద్యార్థినులు అర్ధరాత్రి దాటినా ఫోన్లు వదలడం లేదు. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ నిషేధాన్ని అమలులోకి తెచ్చినా ఫలితం లేదు. దీంతో రాత్రి 9 తర్వాత ఫోన్వాడితే జరిమానా విధించాలని అధికారులు నిబంధనలు పెట్టారు. అయినప్పటికీ ఫలితం దక్కడంలేదు. రాత్రివేళల్లో వార్డెన్లు, స్టీవార్డెన్ల కళ్లు కప్పి గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు. కొంతమంది రాత్రి రెండు మూడుగంటల వరకు ఫోన్లు వదలడం లేదని వార్డెన్ దృష్టికి వచ్చింది. క్యాంపస్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రధాన కారణం అతిగా సెల్ఫోన్ల వినియోగమేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎక్కువ సేపు మాట్లాడ డం వల్ల చదువు నిర్లక్ష్యం చేయడం, చె డు స్నేహం చేయడం, ఇతర వ్యాపకాల్లో ఉండడం, కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలను అణచుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అధికారుల దృష్టికి వచ్చాయి. గత ఏడాది కొంతమంది విద్యార్థినులు హాస్టల్ గదుల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. న వంబర్ ఒకటిన బీటెక్ విద్యార్థిని సెల్ఫోన్లో మాట్లాడుతూనే భావోద్వేగాలను అణుచుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నేపథ్యంలో సెల్‌ఫోన్ వాడకాన్ని నియంత్రిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడవచ్చని అధికారులు నిర్ధారణకు వచ్చారు. శ్రీపద్మావతి డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాల, విద్యానికేతన్ తదితర విద్యాసంస్థల్లో సెల్ఫోన్లు మాట్లాడడంపై నియంత్రణ ఉం ది. ఇలాంటి విధానాన్ని ఎస్వీయూలో అమలులోకి తేవాలని సూచనలు చేస్తున్నారు. దీనికి జామర్లు ఏర్పాటే సరైన చర్య అని వారు భావిస్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత జామర్లు ఆన్‌చేసి సెల్ఫోన్లు పనిచేయకుండా పనిచేయాలని ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇతరులతో రాత్రి 9 గంటల వరకు మాట్లాడుకునే అవకాశం కల్పించి 9 తర్వాత ఫోన్లు పనిచేయకుండా చేస్తే ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అత్యవసరమైతే కామన్ ల్యాండ్ ఫోన్ల సౌకర్యం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై వార్డెన్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని వార్డెన్లకు సూచించారు. అన్ని అనుకూలిస్తే సెప్టెంబర్ నుంచి జామర్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. -
దేవ దేవా..
ఎస్వీయూ ప్రీ పీహెచ్డీ ఫలితాల్లో రిజిస్ట్రార్ జోక్యం రెక్టార్ అనుమతి లేకుండా తుది జాబితా అర్హతలేని వారిని అందలం ఎక్కించేందుకే.. సంతకం చేసేందుకు నిరాకరించిన రెక్టార్ రాజకీయ ఒత్తిడితో ఎట్టకేలకు పట్టువిడుపు రిజిస్ట్రార్ తీరుపై వ ర్సిటీ వర్గాల మండిపాటు తిరుపతి తుడా: ఎస్వీయూలో ఓ ఉన్నతాధికారి పరీక్ష ఫలితాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రీ పీహెచ్‌డీలో అర్హత లేని వారికి అందలం ఎక్కించేందుకు ఫలితాల్లో గోల్మాల్ చేసి ఏకపక్షంగా విడుదల చేశారు. రెక్టార్ అనుమతి లేకుండా ఫలితాలు విడుదల చేయడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. వర్సిటీలో రెక్టార్ ఆమోదం లేనిదే ఎలాంటి ఫలితాలు వెలువడవు. రెక్టార్‌కు ఎలాంటి సంబంధం లేకుండా, కనీసం సంతకం లేకుండా లేకుండా రిజిస్ట్రార్ మేడసాని దేవరాజులు ప్రీ పీహెచ్డీ ఫలితాలు వెలువరించారనే ఆరోపణలు కోడై కూస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం కిందట వర్సిటీ ప్రీ పీహెచ్డీ ఫలితాలను ప్రకటించారు. రెక్టార్‌ను పక్కన పెట్టి ఫలితాలు విడుదల చేశారని తెలియడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెక్టార్ సంతకం లేకుండా, కనీసం ఆయన అనుమతి కూడా పొందకుండా ప్రీ పీహెచ్డీ ఫలితాలను విడుదల చేయడం వర్సిటీ చరిత్రలో ఇదే మొదటిసారి . ఫలితాలపై అనుమానాలు ప్రీ పీహెచ్డీ ఫలితాల్లో రిజిస్ట్రార్ ఆచార్య దేవరాజులు జోక్యం చేసుకోవడంతో రెక్టార్ ఆచార్య జయశంకర్ ఫలితాల విడుదలకు నిరాకరించారని తెలుస్తోంది. అర్హతలేని వారికి పట్టం కట్టేందుకే రిజిస్ట్రార్ ఫలితాలను తన వద్దకు తెప్పించుకుని తుది జాబితా తయారు చేశారని సమాచారం. తయారు చేసిన ఫలితాలపై రెక్టార్ సంతకం పెట్టేం దుకు నిరాకరించారని తెలుస్తోంది. రెక్టార్ ప్రమేయం లేకుండానే రిజిస్ట్రార్ ఏకపక్షంగా ఫలితాలను విడుదల చేసినట్టు సమాచారం. ఫలితాలు విడుదల చేశాక రెక్టార్ సంతకం లేదని, ఫలితాలు చెల్లే పరిస్థితి లేదని ఎగ్జామినేషన్‌కు చెందిన మరో అధికారి చెప్పడంతో తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశారు. సంతకం చేయాలని రెక్టార్పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఎంతకీ సంతకం చేయకపోవడంతో ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా సోమవారం సంతకం పెట్టించారని సమాచారం. రిజిస్ట్రార్ తీరుపై వర్సిటీ వర్గాలు మండి పడుతున్నాయి. తన వారు, సిఫార్సులు తీసుకొచ్చిన వారిని అందలం ఎక్కించేందుకే ఇలా వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు పదవి రావడానికి సహకరించిన వారికి కృత జ్ఞతగా ఇలా వ్యవహరించారని వర్సిటీ వర్గాల సమాచారం. వీసీకి తలనొప్పి .. రిజిస్ట్రార్ దేవరాజులుకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వర్సిటీలో ఆయన చెప్పిందే వేదంగా మారింది. ప్రీ పీహెచ్డీ ఫలితాల విడుదలలో రెక్టార్ ప్రమేయం లేకుండానే రిజిస్ట్రార్ ఏకపక్షంగా వ్యవహరించినా వీసీ ఏమీ చేయలేక పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హత లేని వారికి ఫలితాల్లో అందలం ఎక్కించారని ఫిర్యాదులు అందినా పట్టించుకోవడానికి సాహసం చేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను చెప్పింది వినకుంటే రాజకీయ ఒత్తిళ్లతో తన పంతం నెగ్గేలా రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందరితో చర్చించే విడుదల చేశా.. వీసీ, రెక్టార్లతో చర్చించే ప్రీ పీహెచ్డీ ఫలితాలను విడుదల చేశా. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో తొందరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నాను. ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. కావాలనే కొందరు దుష్పచారం చేస్తున్నారు. ఫలితాల్లో రెక్టార్ సంతకం ఉంది. -ఆచార్య మేడసాని దేవరాజులు, రిజిస్ట్రార్, ఎస్వీయూ