చదువులు సాగేదెలా? | The reduced distance education admissions | Sakshi
Sakshi News home page

చదువులు సాగేదెలా?

Published Fri, Jun 3 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

The reduced distance education admissions

ఎస్వీయూను పట్టిపీడిస్తున్న ప్రొఫెసర్ల కొరత 
సగానికి పైగా తగ్గిన దూర విద్య అడ్మిషన్లు
అరకొర వసతులతో అవస్థలు 
పరిశోధక విద్యార్థుల పరిస్థితి మరింత దారుణం

 

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అరకొర వసతులు, నిలిచిపోయిన యూజీసీ నిధులు, ప్రొఫెసర్ల కొరతతో విద్యార్థులు అంతంత మాత్రపు చదువులు సాగిస్తున్నారు. సమస్యలన్నీ పరిష్కారమై, పురోగతి వైపు అడుగులు వేయాల్సిన విశ్వవిద్యాలయం రాజకీయాలకు నిలయంగా మారింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. పట్టించుకోవాల్సిన  అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో సమస్యలన్నీ జఠిలంగా మారుతున్నాయి.

 

తిరుపతి :  ఎస్వీయూ ప్రాభవం మసకబారుతోంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన వర్సిటీ చదువులు నేడు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. విశ్వవిద్యాలయం పురోగతి స్తంభించింది. సమస్యలను పరిష్కరించి ఎప్పటికప్పుడు విద్యావిధానంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఏయేటికాయేడు వర్సిటీకున్న పేరు దెబ్బతింటోంది.

 
రెండేళ్లుగా భర్తీకాని ఖాళీలు

రెండేళ్లుగా ఎస్వీయూలో ప్రొఫెసర్ల కొరత నెలకొంది. 2014 నాటికే 63 ఫ్రొఫెసర్లు, 96 అసోసియేట్ ఫ్రొఫెసర్లు, 110 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పడీ సంఖ్య పెరిగింది. దీనివల్ల అన్ని విభాగాల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులను గాడిలో పెట్టేవారు, వారిని సరైన విధానంలో నడిపించే వారు కరువయ్యారు. అధ్యాపకుల కొరత వల్ల రెండేళ్ల నుంచి యూజీసీ నిధుల విడుదల ఆగిపోయింది. వర్సిటీలో ఎంఫిల్ భోధన చేసే వారు లేక ఆ కోర్సును రద్దుచేశారు. పరిశోధక విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రయోగశాలలు, ఇతరత్రా పరికరాలు లేక బయటకు వెళ్లి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

 
దెబ్బతిన్న పురోగతి

ఎస్వీయూ పురోగతి పూర్తిగా దెబ్బతింది. వైఎస్ హయాంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్‌గాంధీ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్సు హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 60 శాతం పనులు పూర్తయ్యాక ఆయా నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్సిటీ క్యాంపస్‌లో రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలకు విరివిగా నిధులు మంజూరు చేశారు. టీడీపీ ప్రభుత్వం  వచ్చాక ఆశించిన మేర నిధులు మంజూరైన దాఖాలాలే లేవు. లైబ్రరీల పరిస్థితి అంతంత మాత్రంగా మారింది. ఎప్పుడో ఐదేళ్ల కిందట పెట్టిన జర్నల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. దీంతో పరిశోధక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 2015లో ఏర్పాటు చేసిన కాంపిటీటివ్ సెల్‌లో జర్నల్స్ పెట్టకపోవడంతో విద్యార్థులు అటువైపు చూడటం మానేశారు. ఇంటర్‌నెట్ హబ్ భవనం కూడా మూత పడింది. ఇక్కడున్న కంప్యూటర్లన్నీ పాడయ్యాయి.

 

పరిశోధకులకు సౌకర్యాలు కల్పించాలి
ఎస్వీయూలో చదువుతున్న పరిశోధకులకు సౌకర్యాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ప్రయోగశాలలో సౌకర్యాలను పెంచాలి.   కొంతమంది అధ్యాపకులు విద్యార్థులను ప్రయోగశాల కోసం బయటకు పంపుతున్నారు. దీనిని నివారించాలి. యూనివర్సిటీ రీసెర్చ్ కమిటీ సమావేశాలు సకాలంలో నిర్వహించి సంబంధిత ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలి.  - హేమంత్ యాదవ్, పరిశోధక విద్యార్థి

 

అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి
ఎస్వీయూలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. బోధనా ప్రమాణాలు పెంచాలి. దూరవిద్యావిభాగాన్ని బలోపేతం చేయాలి. సరైన సమయంలో పరీక్షల నిర్వహించి, సకాలంలో ఫలితాలు విడుదల చేయాలి. విద్యార్థులకు భరోసా కల్పించాలి. మెస్‌లను, వసతి గృహాలను ఆధునీకరించాలి.

 - రమేష్, ఎంఎ విద్యార్థి , ఎస్వీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement