పంటకు నీరిచ్చి ఆదుకోండి
కలెక్టర్ కు అనంత వెంకటరామిరెడ్డి వినతి
అనంతపురం అర్బన్ : మరో పది రోజులు నీటిని విడుదల చేసి పామిడి, పెద్దవడగూరు మండలాల పరిధిలో ఉన్న 17 గ్రామాల రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కలెక్టర్ కోన శశిధర్‌ను కోరారు. శనివారం ఆయన కలెక్టర్‌ను కలిసి పంటల పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పామిడి, పెద్దవడగూరు మండలాల పరిధిలోని పొలాలకు హెచ్చెల్సీ( నార్త్ కెనాల్) ద్వారా సాగునీరు సరఫరా అవుతోందన్నారు. 17 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 3 వేల ఎకరాలలో వరి, వేరుశనగ సాగు చేస్తున్నారన్నారు.
పంట మరో 15 రోజుల్లో చేతికొస్తుందని తెలిపారు. ఈ సమయంలో సాగునీరు ఆపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.4 టీఎంసీ నీరు నిల్వ ఉందన్నారు. పంటలకు, రిజర్వాయర్‌లకు సరిపడే నీరు ఉన్నా అధికారులు నిలుపుదల చేయడం సరికాదన్నారు. 250 క్యూసెక్కులు కాకుండా 350 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తే అటు రైతులకు, ఇటు చాగల్లు రిజర్వాయర్‌కు నీటి పంపిణీ చేయవచ్చునన్నారు.
పంటలకు, రిజర్వాయర్‌లకు సరిపడే నీరు ఉన్నా అధికారులు నిలుపుదల చేయడం సరికాదన్నారు. నార్త్ కెనాల్ 38వ కిలోమీటర్‌వద్ద డిస్ట్రిబ్యూటరీల వద్ద మట్టి వేశారని, వెంటనే దానిని తొలగించి పంటలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఒకేసారి ఇటు నార్త్ కెనాల్ ఆయకట్టుకు, చాగల్లుకు నీటిని విడుదల చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. దీనివల్ల చాగల్లుకు ఎలాంటి ఇబ్బంది రాదని వివరించారు.
వ్యక్తుల ప్రయోజనాల కోసం కాకుండా.. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పొట్ట, వెన్ను దశల్లో ఉన్న పంటలకు నీరివ్వాలని హితవుపలికారు. కరువు జిల్లాకు అదనంగా నీటిని తీసుకురావడానికి ప్రయత్నం చేయకపోగా వచ్చిన నీటికోసం రాజకీయాలు చేయడం తగదన్నారు. రైతుల శ్రేయస్సు కోసం అందరూ ఆలోచించాలన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ అధికారులతో సమావేశం నిర్వహించి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎంపీ హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావును కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై ఎస్‌ఈ సానుకూలంగా స్పందించారు. మరో తడి నీరివ్వడానికి చర్యలు తీసుకుంటామని హామిఇచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, నీలం నల్లపరెడ్డి, పామిడి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన 17 గ్రామాల రైతులు పాల్గొన్నారు.