అన్నీ హామీలే.. నిధులు శూన్యం
కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరాల జల్లు
కార్యకర్తల్లో మనోధైర్యం నింపే యత్నం
తిరుపతి: కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఇన్ని రోజులుగా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం హఠాత్తుగా తిరుపతి నగర అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటిం చడం వెనుక ఎన్నికల వ్యూహం దాగి ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దామినీడు, అవిలాలలో అసంపూర్తిగా ఉన్న పేదల గృహాలకు రూ.250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రెండేళ్లలో బాలాజీ రిజర్వాయర్ పూర్తిచేస్తామని చెప్పారు. తాత్కాలికం గా నీటి సమస్య పరిష్కారం కోసం రూ.25 కోట్లు ఇవ్వాలని టీటీడీని కోరుతామన్నారు. అక్రమ కట్టడాలపై కన్నెర్ర చేస్తామని హెచ్చరించారు. తిరుపతి నుంచి కల్యాణిడ్యామ్ వరకు భూములను సేకరించి మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీటీడీ భూముల్లో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తిరుపతి నగర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించే యత్నం చేశారు. నిజంగా ఈ సమస్యలన్నీ పరిష్కారమైతే తిరుపతి నగరం రాష్ట్రంలోనే తలమానికంగా మారనుంది. అయితే కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తరువాత ఈ సమస్యల పరిష్కారం అటకెక్కే ప్రమాదముందని జనం చర్చించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు. ఆ సంగతి మరువక ముందే తిరుపతి ప్రజలను మరోసారి ముఖ్యమంత్రి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని నగర ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది.
కేవలం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నగరంలోని సమస్యలపై దృష్టి సారించలేదు. ముఖ్యంగా నగరాన్ని తాగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. దాన్ని అధిగమించేందుకు తాత్కాలిక ఏర్పాట్లను కూడా చేయలేదనే అసహనం వ్యక్తమవుతోంది. అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ పనుల ఊసే ఇంతవరకు లేదు. అర్ధంతరంగా ఆగిపోయిన పేదల ఇళ్ల నిర్మాణాలపై కనీసం ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు సమీక్షలు జరిపిన దాఖాలాలు కూడా లేవు.
విజయోత్సవ సభలో లుకలుకలు
తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సుగుణమ్మ గెలుపుతో విజయోత్సవ సభ పేరుతో కార్యకర్తలను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి అవార్డులు ఇచ్చారు. అయితే ఈ సభలోనే తెలుగుదేశం పార్టీలో లుకలుకలు స్పష్టంగా కనిపించాయి. ఒక గ్రూపునకే ప్రాధాన్యత ఇచ్చారని నిరసనలు సైతం వ్యక్తమయ్యాయి. సన్మానిస్తామని చెప్పి మైనారీటీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలను పిలిచి వారికి వేదికపై చోటు కల్పించపోవడంతో ఆ వర్గాలు అగ్రహం వ్యక్తంచేశాయి. దీనికి తోడు విజయోత్సవ సభకు వచ్చిన వారికి కంటే వేదికపైనే నాయకులు ఎక్కువ ఉన్నారంటూ సాక్షాత్తూ చంద్రబాబే అసహనం వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
కొంతమంది నాయకులు ఫొటోలకు ఫోజులు తప్ప పనిచేసేది ఏమీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీనికితోడు తిరుపతి నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే ర్యాలీలో స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో అప్పటికప్పుడు కార్యక్రమ షెడ్యూల్‌ను మార్చారు. 19వ తేదీ పద్మావతి అతిథిగృహంలో బస చేయాల్సి ఉన్నా, దానిని రద్దు చేసుకుని తిరుమల కొండకు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలంటూ షెడ్యూల్ మార్చారు.
అర చేతిలో స్వర్గం
Published Sun, Feb 22 2015 1:51 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement