నిధులు.. నియామకాలు! | Universities with financial problems: Telangana | Sakshi
Sakshi News home page

నిధులు.. నియామకాలు!

Published Mon, Nov 11 2024 5:04 AM | Last Updated on Mon, Nov 11 2024 5:24 AM

Universities with financial problems: Telangana

యూనివర్సిటీల్లో నాణ్యత మెరుగుకు కావాల్సినవి ఇవే

ఆర్థిక సమస్యలతో కునారిల్లుతున్న రాష్ట్ర వర్సిటీలు 

72 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీ 

తాత్కాలిక సిబ్బందితోనే బోధన మమ.. అడుగంటిపోతున్న విద్యా ప్రమాణాలు 

న్యాక్‌ ‘ఎ’ ప్లస్‌ ప్లస్‌ గుర్తింపు ఒక్క వర్సిటీకి లేని వైనం 

వేతనాలకూ ఇబ్బంది పడుతున్న కొన్ని వర్సిటీలు 

సీఎం నివేదికలు కోరిన నేపథ్యంలో వీసీల తర్జనభర్జనలు

రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వర్సిటీల్లో రెండింటికి ఇప్పటికీ జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్‌ (న్యాక్‌) ఉత్తమ గ్రేడ్‌ రాలేదు. కేవలం రెండింటికే ‘ఎ’ ప్లస్‌ దక్కింది. జేఎన్‌టీయూహెచ్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘ఎ’ గ్రేడ్‌ స్థాయికి రాలేకపోతోంది.

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యకు ఊపిరిపోసే విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తగిన సిఫారసులు చేస్తూ నివేదికలు ఇవ్వాలని కొత్త వైస్‌ చాన్స్‌లర్లను ఆదేశించింది. అవసరమైతే కన్సల్టెన్సీల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, గాడి తప్పిన పాలన..వర్సిటీల్లో ప్రధాన సమస్యలని వీసీలు పైకి చెబుతున్నా, తగిన మొత్తంలో నిధులు ఇవ్వడంతో పాటు, పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తేనే వర్సిటీల్లో బోధనతో పాటు అన్ని అంశాల్లోనూ నాణ్యత మెరుగవుతుందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలోని ఏ వర్సిటీకీ న్యాక్‌ అత్యుత్తమ గ్రేడ్‌ ఎ ప్లస్‌ ప్లస్‌ లేకపోవడాన్ని విద్యారంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. అయితే నిధులు, బోధనా సిబ్బంది కొరత చెప్పడానికి వీసీలు సాహసించడం లేదని అంటున్నారు. 

ఆర్థిక అంశాలే కీలకం 
రాష్ట్రంలోని వర్సిటీలను అధ్యాపకుల కొరత వేధిస్తోం­ది. ఒక్కో వర్సిటీలో ఇప్పటికీ 74 శాతం వరకు ఖాళీలున్నాయి. 2,825 అధ్యాపక పోస్టులు మంజూరైతే, ఉన్న రెగ్యులర్‌ సిబ్బంది కేవలం 873 మంది మా­త్రమే. మిగతా వాళ్ళంతా తాత్కాలిక ఉద్యోగులే. దీంతో బోధనలో జవాబుదారీతనం లోపిస్తోందని, ఫలితంగా విద్యా ప్రమాణాలు అడుగంటిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఇతర అంశాలను పక్కనబెడితే నిధుల కొరతే ప్రధాన సమస్య అని వీసీలు భా­విç­Ü్తున్నారు. పోస్టుల భర్తీకి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ నియామకాలు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవ­లే వీసీల నియామకం చేపట్టింది. వీరి నివేదికల అనంతరం సమస్యల పరిష్కారం దిశగా ఏ మేరకు నిధులు సమకూరుస్తుందో వేచిచూడాల్సిందే.  

మసక బారుతున్న ఓయూ వైభవం 
వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీకి న్యాక్‌ ఎ ప్లస్‌ గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం ఓయూ వైభవం మసక బారుతోందనే అభిప్రాయం ఉంది. పరిశోధనలు తగ్గాయి. బోధన సిబ్బంది కొరతతో కేంద్ర ప్రభుత్వ శాఖలు పరిశోధన ప్రాజెక్టులు తగ్గించాయి. 2020–21లో రూ.52.45 కోట్ల ప్రాజెక్టులొస్తే, 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. రెండేళ్ళలోనే 53 శాతం పడిపోయింది. ప్రభుత్వం 1,267 అధ్యా­పక పోస్టులు మంజూరు చేసినా 340 మందే ఉన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల­తో కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి ఉంది.  

జేఎన్‌టీయూహెచ్‌కు జవసత్వాలెలా?
సాంకేతిక విద్యకు కీలకమైన ఈ విశ్వవిద్యాలయం జాతీయ ర్యాంకుల్లో స్థానం దక్కించుకోవడంలో విఫలమవుతోంది. ఇక్కడ 410 అధ్యాపకులుండాలి. కానీ 169 మందే ఉన్నారు. దీంతో కీలకమైన ఇంజనీరింగ్‌ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలను ఇంజనీరింగ్‌లో విలీనం చేశారు. కానీ సిబ్బంది కొరత వల్ల ప్రమాణాలు పెరగడం లేదు. కొత్త ఏఐ కోర్సులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ఏటా రూ.200 కోట్ల మేర నిధులు అవసరమని వర్సిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.  

ల్యాప్‌టాప్‌లు లేని ఆర్జీయూకేటీ 
బాసరలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు ఇంటర్న్‌íÙప్‌ లేదు. ల్యాప్‌టాప్‌లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మెస్‌ నిర్వహణ అక్రమాలకు కేంద్ర బిందువుగా మారడంతో విద్యార్థులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. 2008 నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

 ‘పాలమూరు’వెనుకంజ.. 
ఈ వర్సిటీకి ఏటా కేటాయించేది రూ.10 కోట్లు. ఇచ్చేది రూ.7 కోట్ల లోపే. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతుంది. ఏడు విభాగాలకు 84 పోస్టులు మంజూరైతే 17 పోస్టుల్లోనే అధ్యాపకులున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే ప్రొఫెసర్లు కాగా నలుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన 11 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు రెగ్యులర్‌ అధ్యాకులు లేరు. 94 మంది తాత్కాలిక అధ్యాప­కులతో బోధన కొనసాగుతోంది. అనుమతి వచ్చినా లా కాలేజీ భవన నిర్మాణం పూర్తవ్వలేదు. నలుగురు ఉండాల్సిన బాలికల హాస్టల్‌లో 8 మంది ఉండాల్సిన పరిస్థితి.  

‘తెలంగాణ’కు రూపాయి విదల్చడం లేదు! 
ఈ వర్సిటీలో 152 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరైనా, ఉన్నది కేవలం 61 మంది మాత్రమే. 12 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుండగా అకడమిక్‌ కన్సల్టెంట్లు, పార్ట్‌ టైం అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ఈ వర్సిటీకి పదేళ్ళుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇతరత్రా నిధులతో నెట్టుకొస్తున్నారు.  18 ఏళ్ళలో ఒక్కసారి మాత్రమే ఇక్కడ స్నాతకోత్సవం జరిగింది.  

కాకతీయలో వేతనాలకే దిక్కులేదు
కాకతీయ వర్సిటీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఏడాదికి రూ.150 కోట్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ కింద రూ.97 కోట్లు మాత్రమే వస్తోంది. దీంతో అంతర్గత సమీకరణల ద్వారా రూ.53 కోట్లు సమకూర్చుకుంటున్నారు. 405 రెగ్యులర్‌ అధ్యాపకులకు గాను 83 మందే ఉన్నారు. 190 మందిని కాంట్రాక్టు, 201 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని వర్సిటీ వర్గాలంటున్నాయి.  

నిధుల్లేకుండా మార్పు ఎలా సాధ్యం?  
జ్ఞానాన్ని సృష్టించి, పంచే యూనివర్సిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. వీటికి వివిధ రూపాల్లో నిధులు సమకూరుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు 12 శాతం నిధులిచ్చేవారు. అదిప్పుడు సగానికి పడిపోయింది. యూజీసీ కూడా 60 శాతం నిధులు తగ్గించింది. నిధులే లేనప్పుడు మార్పు ఎలా సాధ్యం? ఢిల్లీలో ఓ సాధారణ కాలేజీకి వెళ్ళా. 250 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. మన దగ్గర ఆ స్థాయిలో అధ్యాపకులు ఉండటం లేదు. పాలమూరు లాంటి వర్సిటీకి రూ.8 కోట్లు ఇవ్వడమే కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో పరిశోధన ఎలా చేయగలరు? వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వర్సిటీల సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి కార్యాచరణలో కన్పించాలి. వర్సిటీలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తేనే మార్పు సాధ్యం.     – ప్రొఫెసర్‌ హరగోపాల్‌ (విద్యారంగ నిపుణులు)

అధ్యయనం మొదలైంది  
సీఎం ఆదేశాల మేరకు ఉన్నత విద్యలో మార్పుల దిశగా అధ్యయనం చేస్తున్నాం. త్వరలో నిపుణులతో భేటీ ఏర్పాటు చేస్తాం. ఎలాంటి మార్పులు రావాలి? గ్లోబల్‌ పోటీని తట్టుకునే బోధన ప్రణాళికలేంటి? అనేది అధ్యయనం చేయబోతున్నాం. – ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్‌)

త్వరలో అందరితో సమావేశం 
నివేదిక దిశగా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రిన్సిపల్స్, డీన్స్, హెచ్‌వోడీలను పిలుస్తాం. మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఇతర అంశాలపై చర్చిస్తాం. నెల రోజుల్లో నివేదిక సమరి్పస్తాం.  – ప్రొఫెసర్‌ కుమార్‌ మొలుగారం, వీసీ ఓయూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement