- నగరంలో ట్యాంకర్ల మాయూజాలం
- ఆరు ట్రిప్పులకు మూడే సరఫరా
- పేదల కాలనీల్లో తీరని దాహార్తి
- కార్పొరేషన్ నీరు హోటళ్లకు విక్రయం
- స్వచ్ఛంద సంస్థల వ్యాపారం
- రూ.వందకు కొని.. రూ.వెయ్యికి అమ్మకం
- చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరంలో యథేచ్ఛగా మంచి నీటి దోపిడీ జరుగుతోంది. వేసవిలో తీవ్ర నీటిఎద్దడిని ఆసరాగా చేసుకొని ప్రజలకు జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ పర్వం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్లతో పాటు, స్వచ్ఛంద సేవా సంస్థల ముసుగులో సాగుతోంది. కార్పొరేషన్ నీటిని ట్యాంకర్ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్లు అమ్ముకుంటున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థల పేరిట కొందరు కార్పొరేషన్ ట్యాంకుల నుంచి నీటిని రూ.100 చెల్లించి తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు రూ.600 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. నీటి వ్యాపారంలో ఆరితేరుతున్నారు.
కార్పొరేషన్ పరిధిలో నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థారుులో ఇందుకు విరుద్ధంగా ఉంది. నీటి సరఫరా కాగితాలపై అంకెల గారడీ సృష్టిస్తున్నారు. మంచినీటి సరఫరా చేసేందుకు కార్పొరేషన్‌కు సొంతంగా ఒక ట్యాంకర్ మాత్రమే ఉంది. అయితే వేసవిలో మంచినీటిని సరఫరా చేసేందుకు ఈ ఏడాది 12 ట్యాంకర్ల కోసం టెండర్లు నిర్వహించారు.
ఈ టెండర్లను ఐదుగురు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. ఏప్రిల్, మే, జూన్ వరకు నీటిని సరఫరా చేయాలి. ఒక్క ట్యాంకర్‌కు ఒక్క ట్రిప్పుకు రూ.325 చెల్లిస్తున్నారు. ప్రతిరోజూ ఒక్క ట్యాం కర్ ద్వారా ఆరు ట్రిప్పులు సరఫరా చేయాలని టెండర్ నిబంధన పెట్టారు. ట్యాంకర్ల కాంట్రాక్టర్లు కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ అధికారులు సూచించిన ప్రకారం నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం మంచి నీటిని సరఫరా చేయాలి. అరుుతే ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లోపంతో మూడు, నాలుగు ట్రిప్పులు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని పలు కాలనీల వాసులు పేర్కొంటున్నారు.
కాంట్రాక్టర్లు మాత్రం ఆరు ట్రిప్పులు సరఫరా చేసినట్లు రిజస్టర్లలో రాసుకుంటున్నారని, అనుకూలంగా ఉన్న స్థానికులతో సంతకాలు చేయించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకు అడ్డాలను ఏర్పాటు చేసి స్థానికులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఈ నిబంధనలు ఏమీ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ట్యాంకర్ల నీటిని కాంట్రాక్టర్లు వాణిజ్య అవసరాలకు అమ్ముకుంటున్నారు.
కార్పొరేషన ఖజానాకు గండి..
ఏటా ఈ ట్యాంకర్ల మంచినీటి సరఫరాలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ ఎత్తున కార్పొరేషన్ ఖజానాకు గండికొడుతున్నారు. త క్కువ ట్రిప్పులు సరఫరా చేసి ఎక్కువ ట్రిప్పు లు సరఫరా చేసినట్లు లెక్కలు రాసుకుంటున్నారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసిన తర్వాత నెల వారీగా బిల్లులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ మూడు, నాలుగు నెలల తర్వాత మంచినీటి సరఫరా బిల్లులు తీసుకుంటున్నారు. అప్పటికి ఈ లెక్కలు ఎవ్వరూ చూడరన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నారు. ఇందులో ఓ కాంట్రాక్టర్‌కు రెండు ట్యాంకర్లు మాత్రమే ఉన్నప్పటికీ తన వద్ద ఐదు ట్యాంకర్లు ఉన్నట్లు టెండర్ దక్కించుకోవడం గమనార్హం.
నీటిని నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో మూడు, నాలుగు ట్రిప్పులు సరఫరా చేసి మిగతావి ఆపార్ట్‌మెంట్లు, హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకు మాత్రం లైన్‌మన్‌లతో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఏఈలు చెబుతున్నప్పటికీ నగరంలో రూ.10 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. వీటిని పర్యవేక్షించుందుకే ఏఈలకు తీరకలేదు. వీరికే ట్యాంకర్ల సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పటించడంతో కాంట్రాక్టర్లకు కలిసివచ్చింది. కింది స్థాయి ఉద్యోగుల చేతులు తడిపి నాలుగు ట్రిప్పులకు ఆరు ట్రిప్పులు సరఫరా చేస్తున్నట్లు రిజిస్టర్లలో రాయించుకుంటున్నారు.
వాస్తవంగా ఏ ట్యాంకర్..? రోజు ఎన్ని ట్రిప్పులు..? ఏ ప్రాంతాల్లో సరఫరా చేశారన్న విషయాలు కమిషనర్ లేక ఎంఈకి నివేదిక రూ పంలో సంబంధిత విభాగం అధికారులు ఇవ్వాలి. కానీ ఇక్కడ డీఈలు సైతం దీనిపై దృష్టి పెట్టడడం లేదు. దీంతో నగరంలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది.
‘స్వచ్ఛంద’.. వ్యాపారం..
నగరంలో కొన్ని సేవా సంస్థలు స్వచ్ఛంద సేవా ముసుగులో కార్పొరేషన్ నీటిని అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలకు మాత్రమే కార్పొరేషన్ నిబంధనల ప్రకారం నీటిని ఉచితంగా ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ఈ విధానంలో కొన్ని మార్పులు చేశారు. గతంలో దీన్ని ఆసరా చేసుకున్న కొంత మంది వ్యక్తులు కార్పొరేషన్ నుంచి ఉచితంగా నీటిని తీసుకొని నగరంలో హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, అపార్ట్‌మెంట్లకు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేసి నీటి విక్రయించారు.
అయితే ప్రస్తుతం గుర్తింపు ఉన్నా లేకున్నా సొంత ట్యాంకర్ ఉంటే రూ.100 చెల్లించి ట్యాంకర్ నీటిని కార్పొరేషన్ పరిధిలోని ట్యాంకుల నుంచి తీసుకోవచ్చు. అయితే గుర్తింపు ఉన్నా, లేకున్నా పదుల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు, కొంత మంది వ్యక్తులు కార్పొరేసన్ ట్యాంకుల నుంచి రూ.100 చెల్లించి నీటిని తీసుకొని ఇదే ట్యాంక్‌ను నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు.
తనిఖీలు చేయని అధికారులు..
మంచినీటి కోసం ప్రతిరోజు నగరంలో ఏదో ఒక చోట నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నగరంలో ఎక్కడ సమస్య ఉందో చెబితే అక్కడి ట్యాంకర్ పంపిస్తామని చెప్పిన కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం ట్యాంకర్లతో మంచినీటి సరఫరాపై నిఘా పెట్టడం లేదు.
నీరు.. చోరీ
Published Mon, Apr 20 2015 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 AM
Advertisement