పుష్కరాలపైనే గురి
సాక్షి, రాజమండ్రి/కార్పొరేషన్ : నిన్నగాక మొన్న కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కానేలేదు. రాజమండ్రి నగరపాలక సంస్థలో అప్పుడే పలువురు ప్రజాప్రతినిధులు వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులపై కన్నేశారు. ఎక్కడ ఏ పథకం ఉంది, దేనికెంత గ్రాంటు వస్తుంది, ఏ కాంట్రాక్టులు సిద్ధంగా ఉన్నా యి, వాటిని ఎలా తన్నుకుపోవాలి అనే అంశాలపై సర్వేలు చేసేస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 15 నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి కోట్లాది మం ది రాజమండ్రి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించి వెళతారు.
అంతటి ప్రాశస్త్యం కలి గిన గోదావరి పుష్కరాలను ఈసారి కుంభమే ళా తరహాలో నిర్వహించాలని నేతలు, అధికారులు అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికోసం కోట్లాది రూపాయల నిధులు రప్పించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలో వివిధ డివిజన్లలో భారీగా పనులు మంజూరవుతాయి. వాటిని చేజిక్కిం చుకుంటే ‘లైఫ్ టర్‌న అవుతుంద’నుకుంటూ వాటిలో వాటా కోసం పోటీ పడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు కాంట్రాక్టర్లు చక్కర్లు కొడుతుండగా, మరికొందరు ప్రజాప్రతినిధులు తామే స్వయంగా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు.
రంగంలోకి కాంట్రాక్టర్లు
అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 2003 పుష్కరాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఈసారి అంతకంటే వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నగరంలో కూడా కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేరకు అభివృద్ధి పనులు కూడా చేయాలి. ఈ పనులపై కాంట్రాక్టర్లు కన్నేశారు. అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులను మెప్పించి, అంతా కలిసి రింగై పనులను దక్కించుకునే పనిలో పడ్డారు.
రూ.27 కోట్ల పనులే అందుకు నిదర్శనం
ఇటీవలి ఎన్నికల ముందు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు రూ.27 కోట్ల విలువైన పనులకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. ఈ పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లంతా అప్పట్లో రెండు దఫాలుగా సమావేశమయ్యారు. బయటి కాంట్రాక్టర్లకు ఈ పనులు దక్కకుండా ఉం డేందుకు వారంతా రింగయ్యారు. ఎవరి వా టా వారికి ఇచ్చి మొత్తం పనులు పంచేసుకున్నారు. వచ్చే పుష్కరాల పనులకు కూడా ఇదే ఫార్ములా అనుసరించేందుకు కొంచెం ప్రజాప్రతినిధుల అండ, మరికొంచెం అధికారుల ఆశీర్వాదం కోసం కాంట్రాక్టర్లు తాపత్రయ పడుతున్నారు.