Rajahmundry Municipal Corporation
-
వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్‌పై టీడీపీ వర్గీయుల దాడి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రోజూ కూర్చునే సీట్లలో టీడీపీ కార్పొరేటర్లు కూర్చున్న విషయంలో వివాదం మొదలైంది. దీనిపై ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌పై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఇదే సమయంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ వర్గీయులు పరస్పరం కుర్చీలతో కొట్టుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించారు. -
పంచాయతీ రికార్డుల స్వాధీనం కోర్టు ధిక్కరణే..
రాజమండ్రి రూరల్ :రాజమండ్రి నగరపాలక సంస్థలో 21 పరిసర గ్రామాల విలీనం విషయం కోర్టు పరిధిలో ఉన్నందున గ్రామ పంచాయితీల రికార్డుల స్వాధీనం కోర్టు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటి సెక్రటరీ ఆర్.మోహన్ జయరామ్ నాయక్ ఈనెల 10నే రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్‌కు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఉత్తర్వులు ఇచ్చారని విలీనాన్ని వ్యతిరేకిస్తున్న వారి తరఫు న్యాయవాది వెదుళ్ల శ్రీనివాస్ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను వెంటనే పంచాయతీలకు అప్పగించాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొనట్టు వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి ఆనంద్ ఈనెల 13వనుంచి రెండు రోజులపాటు 21 పంచాయతీలలో రికార్డుల స్వాధీనానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 21 పంచాయతీలకు 11 పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకోగా, మిగిలిన చోట్ల ప్రజలను నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం విలీన సమస్య కోర్టు పరిధిలో ఉందని, పంచాయతీ రికార్డుల స్వాధీనం కోర్టు ధిక్కరణ అవుతుందని మాజీ ప్రజాప్రతినిధులు కోర్టు ఉత్తర్వులు చూపించినా జిల్లా పంచాయతీ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదంతా కేవలం ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి వ ల్లే చేసినట్టు ఆయన కార్యాలయ వర్గాలే పేర్కొంటున్నాయి. కాగా స్వాధీనం చేసుకున్న 11 పంచాయతీల రికార్డులను వెంటనే అప్పగించాలని మాజీ వైస్ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు డిమాండ్ చేశారు. -
ఏటా కోటిన్నరకు గండి
సాక్షి, రాజమండ్రి : ‘కాసులు దండుకోడానికి కాదేదీ అనర్హం’ అంటున్నారు రాజమండ్రి నగర పాలక సంస్థ అధికారులు. అనధికారికంగా హోర్డింగుల ఏర్పాటును ప్రోత్సహిస్తూ.. తద్వారా తాము డబ్బు చేసుకుంటున్నారు. నగర పాలక సంస్థ ఖజానాను దెబ్బ తీసున్నారు. అక్రమ హోర్డింగుల కారణంగా నగర పాలక సంస్థ రాబడికి ఏడాదికి రూ.కోటిన్నర వరకూ గండి పడుతోందని అంచనా. నగరంలో హోర్డింగులకు అనుమతి పొందిన సంస్థలెన్ని, ఎవరెన్ని ఏర్పాటు చేశారు వంటి కనీస వివరాలు కూడా పట్టణ ప్రణాళికా విభాగం (టీపీఓ) అధికారుల వద్ద లేవంటే పరిస్థితి అర్థమవుతుంది. వారు కేవలం ఉజ్జాయింపుగా మాత్రమే హోర్డింగుల సంఖ్యను చెప్పగలుగుతున్నారు. నగరంలో అధికారికంగా 1685 హోర్డింగులుండగా అనధికారికంగా మరో 1000కి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. దుస్తులు, బంగారం వ్యాపారానికి పెట్టింది పేరైన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన వాణిజ్య కేంద్రం. కార్పొరేట్ దిగ్గజాలు నగరంలో తమ సంస్థలను నిర్వహిస్తున్నాయి. రోజుకు సుమారు మూడు లక్షల మంది రాజమండ్రికి వాణిజ్య అవసరాల కోసం వచ్చి పోతుంటారు. దీంతో నగరంపై వ్యాపార ప్రకటన సంస్థలు దృష్టి సారించాయి. చిన్న, పెద్ద సంస్థలు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఇబ్బడి, ముబ్బడిగా హోర్డింగులు ఏర్పాటు చేశాయి. వీటిలో కొన్ని నగరపాలక సంస్థకు తగిన పన్నులు చెల్లించాయి. అయితే హోర్డింగుల నిర్వాహకుల్లో కొందరు స్థల యజమానులతో అంగీకారానికి వచ్చి కనీసం నగరపాలక సంస్థ అధికారులకు కూడా తెలియకుండా, చిన్న, మధ్య తరహా హోర్డింగులు పెట్టి నిర్వహిస్తున్నారు. వీటిని చూసీ చూడనట్టు ఉండేందుకు పట్టణ ప్రణాళికా విభాగం క్షేత్రస్థాయి సిబ్బందికి మామూళ్లు ముట్టజెపుతున్నారు. నిబంధనలూ గాలికి.. ‘హోర్డింగు ఎవరు పెట్టారు, అది ఎన్నోది’ వంటి వివరాల్ని సూచిస్తూ ప్రతి హోర్డింగు వద్దా కోడ్‌తో కూడిన సంఖ్య వేయాలి. కానీ నగరంలో వేళ్లపై లెక్కపెట్టదగిన వాటి వద్ద తప్ప మిగిలిన వాటి వద్ద ఎలాంటి వివరాలూ ఉండడం లేదు. ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల విధింపుపై ఆసక్తి చూపే అధికారులు ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టడం ద్వారా రాబడిని ఎందుకు పెంచుకోవని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఉన్న హోర్డింగుల ద్వారా నగర పాలక సంస్థ ఏడాదికి రూ.రెండు కోట్ల నుంచి రూ.రెండున్నర కోట్ల మేర లభిస్తోంది. కానీ లెక్కల్లో లేనివి ఎన్ని అన్న లెక్క మాత్రం వారి వద్ద లేదు. దీనిపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను అడిగితే ఒక ప్రైవేట్ బృందంతో రెండు రోజులుగా సర్వే చేయిస్తున్నట్టు చెప్పారు. -
విడా? కలివిడా?
- రాజమండ్రి పరిసర పంచాయతీలకు తప్పని సందిగ్ధం - ఎన్నికలో, కార్పొరేషన్లో విలీనమో తేల్చని సర్కారు - పుష్కరాల లోపు తేల్చాలని ఆశిస్తున్న గ్రామాల ప్రజలు సాక్షి, రాజమండ్రి : ఏళ్లు గడుస్తున్నా రాజమండ్రి నగరపాలక సంస్థలో పరిసర పంచాయతీల విలీనం అంశం తేలడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు. దీంతో 21 గ్రామ పంచాయతీల భవితవ్యం డోలాయమాన స్థితిలో పడింది. 2011 నుంచి నలుగుతున్న ఈ వ్యవహారంలో మొన్నటి ఎన్నికల ముందు వరకూ ఉత్తర్వులు, కోర్టు కే సుల పర్వం కొనసాగింది. కానీ ఎన్నికల అనంతరం విలీనం విషయమై పంచాయతీ రాజ్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ నోరు మెదపడం లేదు. ‘మా ఊళ్లకు పం చాయతీలుగా ఎన్నికలు జరిగి ఉంటే కాస్తయినా అభివృద్ధి జరిగేది. నగరపాలక సంస్థలోకలిసిపోతే పుష్కరాల సందర్భంగా జరిగే అభివృద్ధిలో కొంతైనా దక్కేది. ఎటూ కాకుండా వది లేశా’రని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. రాజమండ్రి కార్పొరేషన్లో రాజమండ్రి రూరల్ మండలం మొత్తంతోపాటు రాజానగరం, కోరుకొండ మండలాల్లోని కొన్ని పంచాయతీల (మొత్తం 22) విలీనానికి ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. కానీ రెండు మండలాల్లోని పంచాయతీల ప్రతినిధులు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి తీర్మానాలు పంపడంతోపాటు, కోర్టులను ఆశ్రయించారు. 2013లో 21 పంచాయతీల విలీనానికి వీలు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దివాన్‌చెరువు పంచాయతీ వేరుగా కోర్టును ఆశ్రయించడంతో దాన్ని మినహాయించారు. గ్రామాల ప్రతినిధులు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల నుంచి ఈ గ్రామాలను మినహాయించారు. అయితే ఎన్నికల ముందు విలీనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాలను కోర్టు తోసి పుచ్చింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో విలీనం కోసం పేర్కొన్న నిబంధనలను న్యాయస్థానం తప్పు పట్టింది. నిర్దిష్ట కారణాలు చూపాలని సూచించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రభుత్వం సవరించిన క్లాజులతో మరో ఉత్తర్వును జారీ చేసింది. తర్వాత ఎన్నికలు రావడం, రాష్ట్రవిభజన, కొత్త ప్రభుత్వాల ఏర్పాటు నేపథ్యంలో ఈ వ్యవహారం ముందుకు కదలలేదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అధికారులు సైతం అనాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకూ ముందుకు రారు... విలీనం చేస్తున్నంత మాత్రాన ఎన్నికలు వాయిదా వేయనక్కరలేదనే అభిప్రాయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసింది. దీంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్లో 21 పంచాయతీలూ ఉంటాయని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలింది. ఈనెల 31న అనపర్తి నగర పంచాయతీకి ఎన్నికలు జరపాలన్న నోటిఫికేషన్ సందర్భంగా కూడా ఈ గ్రామాలకు మోక్షం కలగలేదు. దీంతో నగరంలో కలిపేస్తారా, లేదా అనే సందిగ్ధం ఇప్పటికీ తప్పడం లేదు. సుమారు నాలుగేళ్లుగా ఈ గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నా యి. రావాల్సిన నిధులూ నిలిచి పోయాయి. రెండు నెలల క్రితమే అధికారులు లేఖలు రాయడంతో పంచాయతీలకు రావాల్సిన నిధుల విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది. విలీనానికి మొగ్గుతున్నా.. ప్రభుత్వం మాత్రం గ్రామాలను నగరపాలక సంస్థలో కలిపేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగని ఆ దిశగా అడుగులు వే యడమూ లేదు. ఇప్పటికే నగర మాస్టర్ ప్లాన్‌లో ఈ గ్రామాలను చేర్చారు. పుష్కరాల్లోపు విలీనం పూర్తిచేస్తే నగరపాలక సంస్థ అభివృద్ధిలోనైనా భాగస్వాములవుతామని ప్రజలు భావి స్తున్నారు. వ్యవహారం ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద ఉందని, ప్రభుత్వ ఆదేశం ప్రకారం వ్యవహరిస్తామని డీఎల్పీఓ కె.వి.చంద్రశేఖర్ అన్నారు. -
పుష్కరాలపైనే గురి
సాక్షి, రాజమండ్రి/కార్పొరేషన్ : నిన్నగాక మొన్న కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి కానేలేదు. రాజమండ్రి నగరపాలక సంస్థలో అప్పుడే పలువురు ప్రజాప్రతినిధులు వివిధ పథకాల ద్వారా వచ్చే నిధులపై కన్నేశారు. ఎక్కడ ఏ పథకం ఉంది, దేనికెంత గ్రాంటు వస్తుంది, ఏ కాంట్రాక్టులు సిద్ధంగా ఉన్నా యి, వాటిని ఎలా తన్నుకుపోవాలి అనే అంశాలపై సర్వేలు చేసేస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 15 నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి కోట్లాది మం ది రాజమండ్రి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించి వెళతారు. అంతటి ప్రాశస్త్యం కలి గిన గోదావరి పుష్కరాలను ఈసారి కుంభమే ళా తరహాలో నిర్వహించాలని నేతలు, అధికారులు అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానికోసం కోట్లాది రూపాయల నిధులు రప్పించాలని సంకల్పించారు. ఈ నేపథ్యంలో వివిధ డివిజన్లలో భారీగా పనులు మంజూరవుతాయి. వాటిని చేజిక్కిం చుకుంటే ‘లైఫ్ టర్న అవుతుంద’నుకుంటూ వాటిలో వాటా కోసం పోటీ పడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు కాంట్రాక్టర్లు చక్కర్లు కొడుతుండగా, మరికొందరు ప్రజాప్రతినిధులు తామే స్వయంగా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు. రంగంలోకి కాంట్రాక్టర్లు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 2003 పుష్కరాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేశారు. ఈసారి అంతకంటే వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నగరంలో కూడా కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేరకు అభివృద్ధి పనులు కూడా చేయాలి. ఈ పనులపై కాంట్రాక్టర్లు కన్నేశారు. అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులను మెప్పించి, అంతా కలిసి రింగై పనులను దక్కించుకునే పనిలో పడ్డారు. రూ.27 కోట్ల పనులే అందుకు నిదర్శనం ఇటీవలి ఎన్నికల ముందు రాజమండ్రి నగరపాలక సంస్థ అధికారులు రూ.27 కోట్ల విలువైన పనులకు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. ఈ పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లంతా అప్పట్లో రెండు దఫాలుగా సమావేశమయ్యారు. బయటి కాంట్రాక్టర్లకు ఈ పనులు దక్కకుండా ఉం డేందుకు వారంతా రింగయ్యారు. ఎవరి వా టా వారికి ఇచ్చి మొత్తం పనులు పంచేసుకున్నారు. వచ్చే పుష్కరాల పనులకు కూడా ఇదే ఫార్ములా అనుసరించేందుకు కొంచెం ప్రజాప్రతినిధుల అండ, మరికొంచెం అధికారుల ఆశీర్వాదం కోసం కాంట్రాక్టర్లు తాపత్రయ పడుతున్నారు. -
అభ్యర్థులకు కలిసొస్తున్న ఉగాది
రాజమండ్రి కార్పొరేషన్, న్యూస్‌లైన్ : అవును... ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఉగాది పండుగ కలిసొస్తోందనే చెప్పుకోవాలి. ఎందుకనుకుంటున్నారా... ఈ నెల 30వ తేదీన రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఆ మరుసటి రోజే అంటే 31వ తేదీన ఉగాది పండుగ. అంటే రెండురోజులు సెలవులొస్తున్నాయి. అయితే ఏంటనేగా మీ ప్రశ్న. ఇక్కడే ఉంది అభ్యర్థులకు షడ్రుచుల ఉగాది కబురు. ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవడం మన తెలుగు వారి సంస్కృతి. ఎక్కడ స్థిరపడిన వారైనా తమ గడ్డకు వచ్చి ఆ పండుగను జరుపుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఎక్కడెక్కడున్నవారో రెండురోజుల ముందే తమ సొంతూళ్లకు చేరుకుంటారు. స్థానికంగా ఓటుహక్కు ఉండి... విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహమై దూర ప్రాంతాలకు వెళ్లినవారు సెలవులు సందర్భంగా వారి ఊళ్లకు చేరుకునే అవకాశం ఉంది. పండుగ పుణ్యమా అని ఆయా డివిజన్లలోని అభ్యర్థులకు కొంత ఖర్చు తగ్గినట్టవుతుంది. ఒకవేళ ఉగాదికి రాకపోతే దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రవాణా చార్జీలు భరించి తీసుకురావాల్సి వచ్చేది. లాడ్జీల యజమానులూ జాగ్రత్త ఎన్నికల నేపథ్యంలో నగరంలోని లాడ్జీల యజమానులు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం కూడా గట్టి చర్యలు చేపడుతోంది. గది అద్దెకు తీసుకున్న వ్యక్తి నుంచి గుర్తింపు కార్డు జిరాక్సు కాపీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి నుంచి పూర్తి సమాచారం తీసుకోవాలి. గది అద్దెకు తీసుకునే వ్యక్తులు తీసుకువచ్చిన బ్యాగుల్లో మారణాయుధాలు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. రాజకీయ నాయకులకు అద్దెకు ఇవ్వరాదు. లాడ్జీ గదుల్లో మద్యం సేవించడం నిషేధం. గదుల కోసం వచ్చే వ్యక్తుల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే ఆవిషయం పోలీసుల తనిఖీల్లో వెల్లడైతే లాడ్జి యజమానులపై చర్యలు తీసుకుంటారు. ఇవే విషయాలపై నగరంలోని లాడ్జి యజమానులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.