ఏటా కోటిన్నరకు గండి | illegal Set up hoardings in Rajahmundry Municipal Corporation | Sakshi
Sakshi News home page

ఏటా కోటిన్నరకు గండి

Published Tue, Sep 23 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

illegal Set up hoardings in Rajahmundry Municipal Corporation

సాక్షి, రాజమండ్రి : ‘కాసులు దండుకోడానికి కాదేదీ అనర్హం’ అంటున్నారు రాజమండ్రి నగర పాలక సంస్థ అధికారులు. అనధికారికంగా హోర్డింగుల ఏర్పాటును ప్రోత్సహిస్తూ.. తద్వారా తాము డబ్బు చేసుకుంటున్నారు. నగర పాలక సంస్థ ఖజానాను దెబ్బ తీసున్నారు. అక్రమ హోర్డింగుల కారణంగా నగర పాలక సంస్థ రాబడికి ఏడాదికి రూ.కోటిన్నర వరకూ గండి పడుతోందని అంచనా. నగరంలో హోర్డింగులకు అనుమతి పొందిన సంస్థలెన్ని, ఎవరెన్ని ఏర్పాటు చేశారు వంటి కనీస వివరాలు కూడా పట్టణ ప్రణాళికా విభాగం (టీపీఓ) అధికారుల వద్ద లేవంటే పరిస్థితి అర్థమవుతుంది. వారు కేవలం ఉజ్జాయింపుగా మాత్రమే హోర్డింగుల సంఖ్యను చెప్పగలుగుతున్నారు. నగరంలో  అధికారికంగా 1685 హోర్డింగులుండగా అనధికారికంగా మరో 1000కి పైగా ఉన్నట్టు తెలుస్తోంది.
 
దుస్తులు, బంగారం వ్యాపారానికి పెట్టింది పేరైన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన వాణిజ్య కేంద్రం. కార్పొరేట్ దిగ్గజాలు నగరంలో తమ సంస్థలను నిర్వహిస్తున్నాయి. రోజుకు సుమారు మూడు లక్షల మంది రాజమండ్రికి వాణిజ్య అవసరాల కోసం వచ్చి పోతుంటారు. దీంతో నగరంపై వ్యాపార ప్రకటన సంస్థలు దృష్టి సారించాయి. చిన్న, పెద్ద సంస్థలు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఇబ్బడి, ముబ్బడిగా హోర్డింగులు ఏర్పాటు చేశాయి. వీటిలో కొన్ని  నగరపాలక సంస్థకు తగిన పన్నులు చెల్లించాయి. అయితే హోర్డింగుల నిర్వాహకుల్లో కొందరు స్థల యజమానులతో అంగీకారానికి వచ్చి కనీసం నగరపాలక సంస్థ అధికారులకు కూడా తెలియకుండా, చిన్న, మధ్య తరహా హోర్డింగులు పెట్టి నిర్వహిస్తున్నారు. వీటిని చూసీ చూడనట్టు ఉండేందుకు పట్టణ ప్రణాళికా విభాగం క్షేత్రస్థాయి సిబ్బందికి మామూళ్లు ముట్టజెపుతున్నారు.
 
నిబంధనలూ గాలికి..

‘హోర్డింగు ఎవరు పెట్టారు, అది ఎన్నోది’ వంటి వివరాల్ని సూచిస్తూ ప్రతి హోర్డింగు వద్దా కోడ్‌తో కూడిన సంఖ్య వేయాలి. కానీ నగరంలో వేళ్లపై లెక్కపెట్టదగిన వాటి వద్ద తప్ప మిగిలిన వాటి వద్ద ఎలాంటి వివరాలూ ఉండడం లేదు. ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల విధింపుపై ఆసక్తి చూపే అధికారులు ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టడం ద్వారా రాబడిని ఎందుకు పెంచుకోవని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఉన్న హోర్డింగుల ద్వారా నగర పాలక సంస్థ ఏడాదికి రూ.రెండు కోట్ల నుంచి రూ.రెండున్నర కోట్ల మేర లభిస్తోంది. కానీ లెక్కల్లో లేనివి ఎన్ని అన్న లెక్క మాత్రం వారి వద్ద లేదు. దీనిపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను అడిగితే ఒక ప్రైవేట్ బృందంతో రెండు రోజులుగా సర్వే చేయిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement