రాజమండ్రి రూరల్ :రాజమండ్రి నగరపాలక సంస్థలో 21 పరిసర గ్రామాల విలీనం విషయం కోర్టు పరిధిలో ఉన్నందున గ్రామ పంచాయితీల రికార్డుల స్వాధీనం కోర్టు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటి సెక్రటరీ ఆర్.మోహన్ జయరామ్ నాయక్ ఈనెల 10నే రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్‌కు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఉత్తర్వులు ఇచ్చారని విలీనాన్ని వ్యతిరేకిస్తున్న వారి తరఫు న్యాయవాది వెదుళ్ల శ్రీనివాస్ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. స్వాధీనం చేసుకున్న రికార్డులను వెంటనే పంచాయతీలకు అప్పగించాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కరణ అవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొనట్టు వివరించారు.
జిల్లా పంచాయతీ అధికారి ఆనంద్ ఈనెల 13వనుంచి రెండు రోజులపాటు 21 పంచాయతీలలో రికార్డుల స్వాధీనానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 21 పంచాయతీలకు 11 పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకోగా, మిగిలిన చోట్ల ప్రజలను నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం విలీన సమస్య కోర్టు పరిధిలో ఉందని, పంచాయతీ రికార్డుల స్వాధీనం కోర్టు ధిక్కరణ అవుతుందని మాజీ ప్రజాప్రతినిధులు కోర్టు ఉత్తర్వులు చూపించినా జిల్లా పంచాయతీ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదంతా కేవలం ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి వ ల్లే చేసినట్టు ఆయన కార్యాలయ వర్గాలే పేర్కొంటున్నాయి. కాగా స్వాధీనం చేసుకున్న 11 పంచాయతీల రికార్డులను వెంటనే అప్పగించాలని మాజీ వైస్ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు డిమాండ్ చేశారు.
పంచాయతీ రికార్డుల స్వాధీనం కోర్టు ధిక్కరణే..
Published Tue, Feb 17 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement
Advertisement