గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే సెర్ప్ ‘కొండపల్లి’కి కేటాయింపు
నిధులు కూడా సెర్ప్‌కే ఎక్కువ ఉండే అవకాశం
దీనిద్వారానే పింఛన్ల పంపిణీ, పొదుపు సంఘాల సంక్షేమం
ఇంతటి కీలక విభాగాన్ని పవన్ శాఖల నుంచి వేరు చేయడంపై జనసేనలో చర్చ
2 శాఖలకు ముఖ్య కార్యదర్శి ఒక్కరే
పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోనే మెప్మా.. రెండూ నారాయణకే
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేటాయించిన మంత్రిత్వ శాఖలనూ చీలిక పీలికలు చేసి వేరే మంత్రికి అప్పగించడంపై ఆ పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైంది. ఒకే శాఖ పరిధిలో ఉండే విభాగాలను వేర్వేరు శాఖలుగా విభజించి ఇద్దరు మంత్రులకు కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను వేరు చేసి కొండపల్లి శ్రీనివాస్‌కు అప్పగించడం చర్చకు దారితీసింది. ఈ రెండింటికి ఇద్దరు మంత్రులు ఉన్నా రెండు శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఒకరే ఉండటం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ వరుసగా తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
తన శాఖల్లో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల కొరత వేధిస్తోందని ఆయన చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలు సెర్ప్ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంటాయి. దాదాపు 65 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతి నెలా ఫింఛన్ల పంపిణీ సెర్ప్ నేతృత్వంలోనే సాగుతోంది. దీనికి డ్వాక్రా గ్రూపులు, వాటికనుగుణంగా వివిధ సంక్షేమ పథకాల అమలు కూడా సెర్ప్ పరిధిలోనే కొనసాగుతుంటాయి. అలాంటిది సెర్ప్ విభాగాన్ని పవన్ కళ్యాణ్‌కు కాకుండా మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అప్పగించడానికి ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.
సెర్ప్‌కే అధికంగా నిధులు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొత్తం బడ్జెట్‌పరంగా చూసినా నిధుల కేటాయింపు సెర్ప్‌కే ఎక్కువగా ఉంటుంది. సెర్ప్ ద్వారా జరిగే పింఛన్ల పంపిణీకి ఏటా ప్రభుత్వం దాదాపు రూ.27 వేల కోట్లకు పైబడే నిధులు కేటాయిస్తోంది. ఇతర కార్యక్రమాలకు మరికొన్ని నిధులు ఎటూ తప్పనిసరి. ఇక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇతర అన్ని విభాగాలకు దాదాపు అంత బడ్జెట్ కేటాయింపులకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిలో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నేరుగా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే నిధులే.
అందులో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల వాటా తక్కువే. ఓవైపు నిధుల కేటాయింపులోనూ అధిక వాటా కలిగి ఉండి, మరోవైపు ప్రభుత్వ పథకాల అమలులో ప్రత్యక్షంగా ప్రజల నుంచి మంచి పేరును తెచి్చపెట్టేందుకు ఎక్కువ అవకాశం ఉన్న సెర్ప్‌ను పవన్ కళ్యాణ్‌కు కేటాయించకపోవడం ఏమిటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
నారాయణకు ప్రత్యేకం
గ్రామాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం గ్రామీణాభివృద్ధి శాఖలో సెర్ప్ ఉన్నట్టే.. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మెప్మా పేరుతో ఒక విభాగం ఉంది. అయితే, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న మెప్మాను ఆ శాఖ మంత్రి నారాయణ పరిధిలోనే ఉంచడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment