విడా? కలివిడా?
- రాజమండ్రి పరిసర పంచాయతీలకు తప్పని సందిగ్ధం
- ఎన్నికలో, కార్పొరేషన్‌లో విలీనమో తేల్చని సర్కారు
- పుష్కరాల లోపు తేల్చాలని ఆశిస్తున్న గ్రామాల ప్రజలు
సాక్షి, రాజమండ్రి : ఏళ్లు గడుస్తున్నా రాజమండ్రి నగరపాలక సంస్థలో పరిసర పంచాయతీల విలీనం అంశం తేలడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు. దీంతో 21 గ్రామ పంచాయతీల భవితవ్యం డోలాయమాన స్థితిలో పడింది. 2011 నుంచి నలుగుతున్న ఈ వ్యవహారంలో మొన్నటి ఎన్నికల ముందు వరకూ ఉత్తర్వులు, కోర్టు కే సుల పర్వం కొనసాగింది. కానీ ఎన్నికల అనంతరం విలీనం విషయమై పంచాయతీ రాజ్ శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ నోరు మెదపడం లేదు. ‘మా ఊళ్లకు పం చాయతీలుగా ఎన్నికలు జరిగి ఉంటే కాస్తయినా అభివృద్ధి జరిగేది. నగరపాలక సంస్థలోకలిసిపోతే పుష్కరాల సందర్భంగా జరిగే అభివృద్ధిలో కొంతైనా దక్కేది. ఎటూ కాకుండా వది లేశా’రని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
రాజమండ్రి కార్పొరేషన్‌లో రాజమండ్రి రూరల్ మండలం మొత్తంతోపాటు రాజానగరం, కోరుకొండ మండలాల్లోని కొన్ని పంచాయతీల (మొత్తం 22) విలీనానికి ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. కానీ రెండు మండలాల్లోని పంచాయతీల ప్రతినిధులు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి తీర్మానాలు పంపడంతోపాటు, కోర్టులను ఆశ్రయించారు. 2013లో 21 పంచాయతీల విలీనానికి వీలు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దివాన్‌చెరువు పంచాయతీ వేరుగా కోర్టును ఆశ్రయించడంతో దాన్ని మినహాయించారు.
గ్రామాల ప్రతినిధులు మరోసారి కోర్టును ఆశ్రయించడంతో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల నుంచి ఈ గ్రామాలను మినహాయించారు. అయితే ఎన్నికల ముందు విలీనాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీలు చేసిన తీర్మానాలను కోర్టు తోసి పుచ్చింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో విలీనం కోసం పేర్కొన్న నిబంధనలను న్యాయస్థానం తప్పు పట్టింది. నిర్దిష్ట కారణాలు చూపాలని సూచించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రభుత్వం సవరించిన క్లాజులతో మరో ఉత్తర్వును జారీ చేసింది. తర్వాత ఎన్నికలు రావడం, రాష్ట్రవిభజన, కొత్త ప్రభుత్వాల ఏర్పాటు నేపథ్యంలో ఈ వ్యవహారం ముందుకు కదలలేదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అధికారులు సైతం అనాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకూ ముందుకు రారు...
విలీనం చేస్తున్నంత మాత్రాన ఎన్నికలు వాయిదా వేయనక్కరలేదనే అభిప్రాయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసింది. దీంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌లో 21 పంచాయతీలూ ఉంటాయని ఆశించిన ప్రజలకు నిరాశ మిగిలింది. ఈనెల 31న అనపర్తి నగర పంచాయతీకి ఎన్నికలు జరపాలన్న నోటిఫికేషన్ సందర్భంగా కూడా ఈ గ్రామాలకు మోక్షం కలగలేదు. దీంతో నగరంలో కలిపేస్తారా, లేదా అనే సందిగ్ధం ఇప్పటికీ తప్పడం లేదు. సుమారు నాలుగేళ్లుగా ఈ గ్రామాలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నా యి. రావాల్సిన నిధులూ నిలిచి పోయాయి. రెండు నెలల క్రితమే అధికారులు లేఖలు రాయడంతో పంచాయతీలకు రావాల్సిన నిధుల విడుదలకు ప్రభుత్వం అంగీకరించింది.
విలీనానికి మొగ్గుతున్నా..
ప్రభుత్వం మాత్రం గ్రామాలను నగరపాలక సంస్థలో కలిపేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగని ఆ దిశగా అడుగులు వే యడమూ లేదు. ఇప్పటికే నగర మాస్టర్ ప్లాన్‌లో ఈ గ్రామాలను చేర్చారు. పుష్కరాల్లోపు విలీనం పూర్తిచేస్తే నగరపాలక సంస్థ అభివృద్ధిలోనైనా భాగస్వాములవుతామని ప్రజలు భావి స్తున్నారు. వ్యవహారం ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద ఉందని, ప్రభుత్వ ఆదేశం ప్రకారం వ్యవహరిస్తామని డీఎల్‌పీఓ కె.వి.చంద్రశేఖర్ అన్నారు.