రాజమండ్రి కార్పొరేషన్, న్యూస్‌లైన్ :
అవును... ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు ఉగాది పండుగ కలిసొస్తోందనే చెప్పుకోవాలి. ఎందుకనుకుంటున్నారా... ఈ నెల 30వ తేదీన రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఆ మరుసటి రోజే అంటే 31వ తేదీన ఉగాది పండుగ. అంటే రెండురోజులు సెలవులొస్తున్నాయి. అయితే ఏంటనేగా మీ ప్రశ్న. ఇక్కడే ఉంది అభ్యర్థులకు షడ్రుచుల ఉగాది కబురు. ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవడం మన తెలుగు వారి సంస్కృతి. ఎక్కడ స్థిరపడిన వారైనా తమ గడ్డకు వచ్చి ఆ పండుగను జరుపుకోవడం సంప్రదాయం.
ఈ సందర్భంగా ఎక్కడెక్కడున్నవారో రెండురోజుల ముందే తమ సొంతూళ్లకు చేరుకుంటారు. స్థానికంగా ఓటుహక్కు ఉండి... విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహమై దూర ప్రాంతాలకు వెళ్లినవారు సెలవులు సందర్భంగా వారి ఊళ్లకు చేరుకునే అవకాశం ఉంది. పండుగ పుణ్యమా అని ఆయా డివిజన్లలోని అభ్యర్థులకు కొంత ఖర్చు తగ్గినట్టవుతుంది. ఒకవేళ ఉగాదికి రాకపోతే దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రవాణా చార్జీలు భరించి తీసుకురావాల్సి వచ్చేది.
లాడ్జీల యజమానులూ జాగ్రత్త
ఎన్నికల నేపథ్యంలో నగరంలోని లాడ్జీల యజమానులు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం కూడా గట్టి చర్యలు చేపడుతోంది. గది అద్దెకు తీసుకున్న వ్యక్తి నుంచి గుర్తింపు కార్డు జిరాక్సు కాపీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి నుంచి పూర్తి సమాచారం తీసుకోవాలి. గది అద్దెకు తీసుకునే వ్యక్తులు తీసుకువచ్చిన బ్యాగుల్లో మారణాయుధాలు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
రాజకీయ నాయకులకు అద్దెకు ఇవ్వరాదు. లాడ్జీ గదుల్లో మద్యం సేవించడం నిషేధం. గదుల కోసం వచ్చే వ్యక్తుల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే ఆవిషయం పోలీసుల తనిఖీల్లో వెల్లడైతే లాడ్జి యజమానులపై చర్యలు తీసుకుంటారు. ఇవే విషయాలపై నగరంలోని లాడ్జి యజమానులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.
అభ్యర్థులకు కలిసొస్తున్న ఉగాది
Published Tue, Mar 18 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM
Advertisement